ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
హృదయ వాచికం:--కె ఎస్ అనంతాచార్య
September 4, 2020 • T. VEDANTA SURY • Poem

లలిత పదాల కూర్చిన వర్ణ గుచ్చo
మల్లెల కన్నా సున్నితం 
 మంచి గంధమంత పరిమళం
ఆప్త వాక్యమై అల్లుకొనే  రసోద్దీప్త

మనిషిలోని అంతః కరణాల కన్నా అతీతమై స్పందనే వేదికయై సంభాషిస్తుంది

కళ్ళనిండా కరుణ
కడివెడoతా దయ
పిడికెడు జాలి కలిగినదే
సహృదయo

ద్వారాలు తెరుచుకుంటే తప్ప
చిత్తం ప్రవృత్తి తెలియదు
సంస్కారం అవిష్కారం  
జరగదు 

అలక పాన్పులు
కోపతాపాలు
సహజాతాలైనా
మూలమంతా 
ఆర్ద్రతయే

ఒక్క చూపుకోసం
పడిగాపులు కాస్తుంది
స్పర్శ కోసం తల్లి స్తన్యం కోరే పిల్లలా 
ఉక్కిరి బిక్కిర వుతుంది
మాటకోసం ఫిరంగికి ఎదురు నిలుస్తుంది

ప్రేమికుల బంధాలకు
దృఢత్వం చేకూర్చే
హృదయావరణ త్వచం

సుఖం దుఃఖం సంస్పందనల
మధ్య సాగే హృదయ వాచికం

ద్రవిస్తే మౌనం రూపుదాలుస్తుంది
వ్యతిరేకిస్తే వెంటాడి
బాంధవ్యాల్ని నిలువునా చీల్చుతుంది

హృదయం నిత్య సూర్యోదయమై
ప్రకాశించే ఆత్మ సదృశ్యం