ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
హైస్కూల్ ప్రధానోపాధ్యాయునిగా మండల విద్యాశాఖాధికారిగా రెండు పదవులు నిర్వహించడం కత్తిమీదసాములాంటిది. పాఠశాలను వదలి మండల ఆఫీసు విధులకు హాజరయ్యేందుకు వెళితే ఒక పద్ధతిలో, క్రమశిక్షణతో నడుస్తున్న పాఠశాల గాడీ తప్పే ప్రమాదం ఉంది. మొదటి రోజున నేను మండల విద్యాశాఖ పనులపై వెళ్లే ముందు స్టాఫ్ మీటింగుపెట్టి నేను లేని సమయం లో ఎవరెవరు ఏ ఏ పనులు చేయాలో, స్కూలు ఇన్-ఛార్జ్ కు ఎవరెవరు ఎలా సహకరించాలోతెలియజెప్పాను. పాఠశాల ఆవరణ చాలా పరిశుభ్రంగా ఉంచేం దుకు కృషి చేయాలని సూచించాను. అంతకుముందే మా పాఠశాలకు కావలసిన ల్యాండ్ లైన్ వేయించాను. దీనికి ఉపాధ్యాయులు కొంత ఆర్థిక సహాయం చేయగా మిగిలిన సొమ్మును విద్యాకమిటీ అందజేసింది. స్కూలుకు ఫోన్ వేయించడం ఏదో హెడ్మాష్టర్ రూం అలంకరణ కోసం కాదు. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు చాలా అరుదుగా ఉండేవి. పాఠశాల స్థాఫ్ మెంబర్స్ అత్యవసరంగా ఎవరికైనా ఫోన్ చేయ వలసి వస్తే అరకిలోమీటర్ దూరంలో నున్న ( సీతానగరం ఊరు బయట ) ఎస్. టీ. డి బూత్ కు వెళ్ళవలసి ఉండేది. రెండు వైపులా కలిపి కిలోమీటరు దూరం ఉంటుంది. ఫోన్ చెయ్యడానికి వెళ్ళిన స్టాఫ్ మెంబర్ నడిచి వెళ్ళి తిరిగి వచ్చే టందుకు కనీసం అరగంట, మరియూ అక్కడ క్యూ లో నిరీక్షణ, ఫోన్ చెయ్యడానికి తీసుకోబోయిన టైం కలిపి మరో పావుగంట ఇలా మొత్తంగా రమారమీ ఒక గంట కాలం స్కూలు వర్కింగ్ పిరియడ్ పోతుంది. ఆ కారణంగా పాఠశాలలో ల్యాండ్ లైన్ టెలీఫోన్ వేయించాను .టీచర్ కు ఎటువంటి ఇబ్బంది ఉండదు. పాఠశాల వర్కింగ్ ఆవర్స్ కలిసొస్తాయి. ఇంకా నాకు కలిసొచ్చే అంశమేమిటంటే స్కూల్ వర్కింగ్ అవర్స్ మధ్యాహ్నం 12.30 గంటలతో సరి. ఏడు, పదితరగతులకు స్పెషల్ క్లాసులు మధ్యాహ్నం వేళ ఉండేవి. నాకు ఆఫీసు వర్క్ ఉంటే స్కూలులో ఉండేవాడను. స్పెషల్ క్లాసులు కూడా అబ్జర్వ్ చేసేవాడిని. లేకపోతే ఇంటికి వెళ్ళి పోయేవాడిని. అయినా నా దృష్టంతా స్పెషల్ క్లాసులపైనే ఉండేది. అందుకు సంబంధించిన టీచర్స్ స్పెషల్ క్లాసులు నిర్వహించడడానికివచ్చారాలేదా? క్లాసులు చెబుతున్నారాలేదా అని. నాకు బదులుగా అటెండర్, నైట్ -వాచర్ లను కాపలా ఉంచేవాడిని. వీళ్లు సరియైన ఇన్ఫర్మేషన్ ఇస్తారాలేక క్లాసులు ఎగవేసిన టీచర్స్ తో చేతులు కలిపి నన్ను మోసం చేస్తారా? ఈకాలంలో ఎవరినీ నమ్మడానికి వీల్లేదు అనుకుని ఇంటి నుండి స్కూలుకు ఫోన్ చేసేవాడిని ఫలానా టీచర్ ఈరోజు స్పెషల్ క్లాసుకు వచ్చారా అని ఫోన్ లో అడిగేవాడిని. వచ్చారని చెప్పేవారు. కానీ నమ్మశక్యంగా లేక ఆ టీచర్ ను నాతో ఫోన్ లో మాట్లాడమని చెప్పేవాడిని. అలా మాట్లాడిన తరువాత ఆ టీచర్ పై విశ్వాసం కలిగేది. 30 మంది టీచర్స్ లో ముగ్గురిపై మాత్రమే నమ్మకం ఉండేదికాదు. ఈ టీచర్స్ ఆరోజుల్లో ( 2000 నుండి 2005 మధ్య కాలంలో) ఉండే జీతాలననుసరించి 10 వేల నుండి 15 వేల రూపాయల మధ్య తీసుకునేవారు. అయినా క్లాసులు ఎగ్గొట్టే దొంగ గుణంపోయేది కాదు. రెండు వేల రూపాయల కోసం వేరే ప్రైవేట్ కాలేజీలో పనిచేసేటందుకు చివర పీరియడ్ ఎగవేసేవాడొకడు, పురోహితం ద్వారా మరి నాలుగు డబ్బులు సంపాదించే ఆలోచనతోతరగతులు ఎగవేసేవాడు ఇంకొకడు , రాజకీయా లపై శ్రద్ధచూపే మాస్టర్ ఇంకొకరు ఉండేవారు. వీరిపై అను నిత్యం నిఘా వేసి ఉంచేవాడిని. అయితే ఒక క్రమపద్ధతిలో పెట్టి నడిపిస్తున్న స్కూల్ నేను ఎం. ఇ. ఓ గా వెళ్తే ఏ‌మవుతుందనే ఆలోచన నాలో వెంటాడుతుంది. అందుకే పాఠశాలను విడిచిపెట్టలేకవిడిచిపెట్టాను. ( సశేషం )- శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252
June 28, 2020 • T. VEDANTA SURY • Memories