ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
(తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన వాడు, తంజావూరు ప్రభువు, రఘునాథ నాయకుడని మన అందరికీ తెలిసినదే. ఇతని ఆస్థానంలో పెక్కు మంది కవులు ఉండేవారు. వారిలో చేమకూర వెంకటకవి గురించి తెలుసుకుందాం ఈ కవికి రాజు పై అమిత భక్తి విశ్వాసములు ఉండేవి. అందుకే తాను రాసిన సారంగధర చరిత్రము, విజయ విలాసము, అను రెండు ప్రబంధాలు ఆయనకే అంకితమిచ్చాడు.) సారంగధర చరిత్రము:- సారంగధర చరిత్రమున రాజ రాజ నరేంద్రుని భార్య చిత్రాంగి తన సవతి కుమారుడగు సారంగధరుని వలచి వలపింపచేసేప్రయత్నం, ఈ కథ శృంగార రసభావములతో కూడిన కథ. దీని కథాంశము కొంత జుగుప్సాకరంగాఉంటుంది. అయినా తెలుగు సాహితీ చరిత్రలో నిలచిన ప్రబంధం. చేమకూర వేంకటకవి వ్రాసిన మరోప్రబంధ కావ్యం విజయ విలాసము. ఈ కావ్యం తెలుగు సాహితీ తల్లికి అపూర్వ అలంకారం. పాండవ మధ్యముడైన విజయుడు ఉలూచి,చిత్రాంగి, సుభద్ర అను ముగ్గురు యువతులతో చెట్టపట్టాలు వేసుకొని కావించిన వివాహములు మూడవ ఆశ్వాసంలో వర్ణింపబడినది. దీనిని మహాభారతము నందలి మూడవయాశ్వాశ ములో ప్రధాన కథను గ్రహించి మనోహరమైన సరస వర్ణనలతోను, మధుర గంభీరమైన భావములతో అద్భుత శ్లేషాలంకారములతోను, ఆహ్లాదము కలిగించినట్లు, చమత్కారములతోను అనన్య సామాన్యంగా రచించాడు. రస పాత్రపోషణములోను, పద ప్రయోగములతోను, అతనికి అతనే సాటి యనిపించుకున్నాడు. ప్రతి పద్యము నందు అతడే వ్రాసెనో లేక రఘునాథుడే అనెనో యన్న సందేహము పండితులకు కలుగక తప్పదు. ఈ విధమైన ప్రతిభా సంపన్నులు ఇద్దరే ఇద్దరు. వారిలో చామకూర వేంకటకవి మరియు భట్టు మూర్తి అద్వితీయమైన కవులు". క్షితిలో నీ మార్గమెవరికిన్ రా"అనుట సత్యము, అంతటి గొప్ప కవి కావుననే రసిక శేఖరుడైయిన రఘునాధ భూపాలుడు ఆదరించి ఘన సత్కారాలు చేసాడు. రఘునాథ నాయకుని ఆస్థానములో విద్వత్ కవియై పలు గ్రంథములు రచించాడు. వాటినన్నిటిని అతనికే అంకితం చేసిన మేటి కవి చామకూర వెంకటకవి. ఆతని ఘనత చెప్పనలవి కాదు. కృష్ణాధ్వరి, రఘునాథ భూపాలీయము, నైషధ పారిజాతావతారిక, కళ్యాణ కౌముదీ, కందర్ప నాటకము, శృంగార సంజీవని, తాళ్ల చింతామణి, నైషధ పారిజాతము అను ఆరు గ్రంధములను తానే రచించినట్లు చామకూర వెంకటకవి చెప్పుకున్నాడు. కాని వానిలో రఘునాథ భూపాలీయము, నైషధ పారిజాతములను రెండే కావ్యములు కానవచ్చు చున్నవి. ఇందులో రఘునాధ భూపాలీయము, ప్రతాప రుద్రీయమువలె కావ్య స్వరూప రస ధ్వన్య లంకారాదులు దెల్పు లక్షణ గ్రంధము. ఇందు లక్షణాలైన పద్యములన్నిట రఘునాథుడే వర్ణింపబడి ఉన్నాడు. నైషధ పారిజాతీయములందు నల చరిత్ర పారిజాతాపహరణ కథ జోడించబడింది. సన్నిహిత సంబంధము లేని ఈ రెండు కథలను సమాంతరంగా సాగించుటలో ఈ కవి నేర్పు, పాండిత్యము అనన్య సామాన్యములైయున్నవి. ద్వ్యర్ధి కావ్యనిర్మాణమునఇతడు సూరన, భట్టు మూర్తులకు మించిన వాడని విమర్శకుల అభిప్రాయము. ఇతడు వ్రాసిన ఇతరరచనలు, తెలుగు గ్రంథములు, సంస్కృత గ్రంథములు తెలియరాలేదు. శృంగార సంజీవని, అమరు కాహంకార హారి అని ఆతడు తెలిపి యున్నాడు.కళ్యాణ కౌముది, కందర్ప నాటకము బహుశా యక్షగానములో ఉండవచ్చును.తాళ సంజీవనిసంగీత శాస్త్ర మునకు సంబంధించిన గ్రంథముగా తోచుచున్నది. రఘునాధుని ఆస్థానములో మేటి కవి చేమకూర వెంకట కవియని చెప్పుట అతిశయోక్తి కాదు. (సశేషం) 71 వ భాగము -బెహరా ఉమామహేశ్వరరావు-సెల్ నెంబర్: 9290061336
July 24, 2020 • T. VEDANTA SURY • Serial