ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
(78 వ భాగము) మధుర చెంజి నాయకులలో విజయ రంగ చొక్క నాథుడు కవి పండిత పోషకుడు --‌ ఇతని ఆస్థాన కవి అయిన వేంకట కృష్ణప్ప నాయకుడు వ్రాసిన ప్రబంధం "అహల్యా సంక్రందన",ఈ ప్రబంధ రచనలో కవి పురాణమందలి మూల కథను, మార్చి వేసినాడు. ఇంద్రుడు, అహల్యల శృంగార వృత్తాంతం వర్ణించే గ్రంథం ఇది. ఇందు హాస్య రసం కూడా జొప్పించాడు. ఇందలి శృంగారం రాధిక సాంత్వనము నందు రచన వలె కాక ఔచిత్యము, మర్యాదను అతిక్రమించ లేదు.మిక్కిలి సభ్యతగా ఉంది. మృదు మధురమైన పదములతో కూడి ఉండి రసవత్తరంగా సాగుతుంది వేంకట కృష్ణప్ప నాయకుడు రచించిన జైమిని భారతము, సారంగధర చరిత్రము. . సారంగధర చరిత్రము అముద్రితము. ఇతని జైమిని భారతము, పిల్లలమర్రి పిన వీరభద్రుని పద్యకావ్యమును అనుసరించి రాసాడు. ఈ కావ్యాన్ని విజయ రంగ చొక్క నాథునికి అంకితము చేశాడు. ఈ కావ్యంలోని , ప్రతియాశ్వాశ అంతమునందు పద్యములు కూర్చి వ్రాశాడు. వేంకట కృష్ణప్ప నాయకుడు తాను రచించిన "సారంగధర చరిత్ర"ను శ్రీరంగ నాథునికి అంకితం చేశాడు. ఇందులో మూడు ఆశ్వాస ములు ఉన్నవి. ఈ కావ్యము వేంకటకవి రచించిన సారంగధర చరిత్రను అనుసరించి వచనీకరింపబడి ఉండవచ్చునని విమర్శకుల అభిప్రాయము. ఈ కవి తన రచనలలో ఇతరుల గ్రంథముల నందలి పదములు ఎక్కువగా గ్రహింప ప్రయత్నించాడు అందుకే ఇతని వచన కావ్యంలో విశేషించి పద్య కావ్యములలో ఉన్నంత సౌకుమార్యము కనిపించదు.---శేషము వేంకటపతి కవి-- శేషము వేంకటపతి కవి, తార శశాంకుల ప్రణయ గాధను ఐదు ఆశ్వాసముల గల ప్రబంధంగా రచించాడు. దీనిని విజయరంగ చొక్కనాథ కవి మంత్రియైన వంగల సీనయామాత్యునికి అంకితం చేశాడు. ఈ సీనయ మంత్రి కూడా కవియే అనియు రామానుజ చరిత్ర మన్నారు రంగాంకిత గేయములను రచించాడని వేంకటపతి తెలియజేసాడు. దక్షిణాంధ్ర పథమున గల కవులలో చేమకూర వేంకట కవి తరువాత చెప్పదగిన వాడు,శేషము వేంకటపతి. ఇతడు "తారాశశాంక విజయము"అను కావ్యమున స్వేచ్ఛగా శృంగారము వర్ణించుట చేతను, పరాంగనా ప్రణయమును సమర్థించు కొన్ని పద్యములు రచించుట చేతను ఆధునిక విమర్శకులు ఇతనికి ఔచిత్య దృష్టి లేదని తెగనాడు చుందురు. ఆ కాలపు ఆచారాలు పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని పరిశీలించినచో ఈ కావ్యమునందలి శృంగార వర్ణనము మితిమీరి పోలేదని అనిపిస్తుంది. మరియు గ్రంథమునందలి పాత్రల నోట చొప్పించిన భావము లన్నిటిని గ్రంథకర్తకు అంటగట్టుట భావ్యం కాదు. ఈ కావ్యము నందలి కథ కొంత నీతిబాహ్యమైన మాట వాస్తవమే గాని కవిత్వం మాత్రము మృదు మధురములైన లలిత పదములతో అలరారు చున్నది. గంభీర భావ శోభితమై, సహృదయుల హృదయానంద కరముగా ఉంటుంది. ఇట్లు చెప్పుటకు కారణము, తెలుగునాట ఈ గ్రంథము నకు గల విపరీత ప్రచారమే తార్కాణము ఈ కాలమునందు గల కవి వెలగపూడి కృష్ణయ్య. ఇతడు అనేక కావ్యాలు వ్రాసాడు. వాటిలో మాలతీమాధవము, గౌళిక శాస్త్రము, భానుమద్విజ జయము అను పద్య కావ్యములను చతుర్విధ కందశతకము, వేదాంత సార కావ్య సంగ్రహమను వచన కావ్యం రచించాడు. ఇందు భానుమద్విజయమొక్కటేలభించుచున్నది. భానుమంతుడను విప్ర యువకుడు ఉజ్జయిని రాజకుమారిని వివాహమాడిన వృత్తాంతము, ఇందలి కథావస్తువు . ఇందు ఐదు ఆశ్వాసములు ఉన్నవి. ఇందలి ఐదవ ఆశ్వాసమున యోగశాస్త్రము వివరింపబడినది. ఇది శైవమత ప్రతిపాదితమైన గ్రంధ రాజము. ఆ మత ప్రాధాన్యము చేతనే కాబోలు ఇది తమిళ భాషలో నికి కూడా అనువదింప బడినది.ఇందలి కవిత్వము ప్రౌఢముగా నుండును. బ్రౌన్ దొర మెప్పు పొందినదీ కావ్యము. ఆయన అతిగా ప్రశంసించాడు.(సశేషం) బెహరా ఉమామహేశ్వరరావు.సెల్ నెంబర్ 9290061336*
July 31, 2020 • T. VEDANTA SURY • Serial