ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
-బాలసాహిత్యం ---49- శివ్వాం. ప్రభాకరం,బొబ్బిలి--ఫోన్ : 7013660252
November 15, 2020 • T. VEDANTA SURY • Memories

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత , ప్రముఖ బాల సాహితీవేత్త, సహృదయుడు, పరోపకారి అయిన బెహరా ఉమామహేశ్వరరావు గారి గురించి మనం తెలుసుకుందాం. బెహరావారు 14 ఆగస్టు 1949లో విజయనగరం  జిల్లా పార్వతీపురంలో జన్మించారు. వీరి  తల్లి  దండ్రులు సువర్ణమ్మ , సీతారామస్వామిగార్లకు ద్వితీయ పుత్రునిగా జన్మించారు. వీరి సహచరిణి శ్రీమతి రాజేశ్వరిగారు. వీరు పుట్టిన ఊర్లోనే విద్యాభ్యాసం కొనసాగించి 1972 లో పార్వతీపురం మున్సిపల్ హైస్కూల్ లో ఉపాధ్యాయునిగా చేరి  2007 వరకూ పని చేసి పదవీ విరమణ చేశారు. వీరి విద్యార్హత ఎం. ఏ; ఎం.ఇడి, రాష్ట్ర భాషా ప్రవీణ్ (హిందీ ). ఉపాధ్యాయునిగా పని చేసిన కాలంలో వృత్తినే దైవంగా భావించి  అనేకమంది బాలలను విద్యావంతులుగా చేశారు. అంతేకాకుండా  బెహరావారు 1978 నుండి రచనా వ్యాసంగం ప్రారంభించి 1000 పైబడిన రచనలు చేసారు. బాలజ్యోతి, చిన్నారి లోకం, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి, బాల భారతం, బాలబాట, ఈనాడు, సాక్షి, వార్త, విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఆంధ్రభూమి, తెలుగు వెలుగు, భక్తి సమాచారం, ధర్మ శాస్త్రం వంటి అనేక పత్రికలలో వీరిి రచనలు ప్రచురింపబడ్డాయి. 2007లో  " బడి గంటలు" అనే గేయ సంపుటి బెహరా వారిచే తీసుకు రాబడింది. ప్రముఖ బాలసాహితీవేత్త రెడ్డి రాఘవయ్యగారి చేతులు మీదుగా అత్యంత ఘనంగా పార్వతీపు రం జట్టు ఆశ్రమంలో ఆవిష్కరించబడింది. ఈ ఆవిష్కరణ సభకు అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.ఈ గేయ సంకలనమే కాకుండా ఓ బాల వీర, బాలల చెలిమి లాంటి బాలల సంకలనాలను కూడా తీసుకు వచ్చారు. కాకులు చేసిన మేలు, మంచి శిక్ష, శ్రమ విలువ.  లాంటి బాలల బొమ్మల కథలను కూడా ప్రచురించారు. అంతేకాకుండా మా మంచి మాష్టారు, డబ్బు తెచ్చిన తంటా, గురువు మాట, బస్తీ కాకులు, బంటి స్నేహం, బహుమతి, చిలక జోస్యం, అమాయకుని తెలివి  వంటి కథాసంకలనాలను కూడా తీసుకువచ్చారు. అంతేగాక ప్రముఖుల జీవితచరిత్రలు బాలలకు ఉపయోగపడేవిధంగా తీసుకు వచ్చారు. మంత్ర మహిమ, ధర్మరాజు ఇలాంటి పురాణ కథలను కూడా బాలలు వినియోగార్ధం తీసుకు వచ్చారు. కబీరు, ప్రజల కవి యోగివేమన సంక్షిప్త జీవిత పరిచయాలను చేస్తూ,  బాలల కోసం వ్యాసరచన కూడా చేశారు. 2006 సంవత్సరంలో ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవంనాడు ఆనాటి అటవీ శాఖ మాత్యులు శత్రుచర్ల విజయరామరాజు గారు, జిల్లా కలెక్టర్ కిషోర్ గారు  బెహరా వారిని ఒక ప్రముఖ బాల సాహితీవేత్తగా సన్మానించారు. చిలకలూరిపేట రావూరి భరద్వాజ పీఠము వారిచే
సన్మానింప బడ్డారు. ఇలా సాహితీ రంగంలో తను చేసిన  కృషికి గాను అనేక సంస్థలు అనేక  సన్మానాలు చేశారు. 2007 సంవత్సరం ఉపాధ్యాయ దినోత్సవంనాడు గౌరవ రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా పాటిల్ గారి  చేతుల మీదుగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. నా  సాహితీ ప్రయాణంలో అతి విలువైన సలహాలను అందిచ్చి  ప్రోత్సహించిన వారిలో బెహరా ఉమామహేశ్వర రావుగారు  కూడా ఉన్నారు. ( సశేషం)