ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
110. తగిన శాస్తే జరిగింది:--బెలగాం భీమేశ్వరరావు,9989537835.
September 1, 2020 • T. VEDANTA SURY • Memories

నేను జగన్నాథపురం పాఠశాలలో పనిచేస్తున్నప్పుడు మాతో పని చేసే సింహాచలంమాష్టారు ఒక ఊళ్ళో జరిగిన సంఘటన చెప్పారు.
ఆ సంఘటనలో హాస్యరసం కనిపించింది.కథగామలిస్తే హాస్యరసంతో సందేశం కూడా అందివ్వవచ్చు అనుకున్నాను.మాష్టారు చెప్పిన
విషయం కథగా మార్చాను.కథకు చెరపకురా చెడేవు అని పేరు పెట్టాను.ఆ సరదా కథలోకివెళ్దామా మరి! వీరయ్య తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే పోయారు.ఊరి అండతో పెరిగి పెద్దవాడయ్యాడు. ఊర్లో రైతులకు వ్యవసాయం లోసాయం చేస్తూ కాలంగడుపు తున్నాడు.ఆ ఊళ్ళోనే కమల అనే ఒక యువతి ఉంది.వీరయ్యలో కష్టపడి పనిచేసే గుణం నచ్చిఅతడిని పెళ్ళాడింది.ఆలూమగలిద్దరు పనులు చేసి నాలుగు డబ్బులు వెనకేసుకొని ఒక బీడుభూమి కొన్నారు.కష్టపడి బీడు బాగుచేసుకున్నారు.కమలకు బావి తవ్వుకుంటే
వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుందన్న ఆలోచన కలిగింది. ఇద్దరు ఊరి వారి సాయంకోరారు. దంపతుల మంచితనం వల్ల చాలా మందిసాయం చేయసాగారు.ఆ ఊళ్లో సూరయ్యనేఅసూయపరుడున్నాడు.ఎవరు బాగు పడినాఓర్వలేక పోతాడు.వీరయ్య బీడుభూమి కొనడం,బాగుచేయడం,బావి పని మొదలు పెట్టడంసూరయ్యకు కళ్ళు పొడిచినట్టయింది.వీరయ్యబాగుపడిపోతాడేమో అన్న భయం పట్టుకొంది.వీరయ్య తవ్వుతున్న బావి మధ్య రాయి అడ్డువచ్చేసరికి సూరయ్య ఆనందంతో ఎగిరి గంతేశాడు.వీరయ్య పని సరి అనుకున్నాడు. వీరయ్య మాత్రం దిగులు పడి కూర్చోలేదు.కండబలం,బుద్ధి బలం నమ్మే మనిషి.పనివాళ్ళను హుషారెక్కించి బావిలోని రాయినిముక్కలు చేయించాడు.పలుపుల సాయంతోవాటిని బయట పడవేయించాడు.సూరయ్యకు ఆసంగతి తెలిసింది.వీరయ్యను నష్టపెట్టడానికి ఒకచెడు ఆలోచన ఆలోచించాడు.బాగా చీకటి పడ్డాకవీరయ్య తవ్వుతున్న బావి వద్దకు వెళ్ళాడు. బయట పడేసిన రాళ్ళను  గొయ్యి లోకి తోసి బావిపనికి ఆటంకం కలిగించాలనుకున్నాడు.ఉడుకునీళ్ళకు ఊరు కాలిపోతుందా?!ఏమిటో ఎవరిఆనందం వారిది! సూరయ్య ఏదేదో ఊహించుకొనిబావి ఒడ్డుకు వెళ్ళాడు. సూరయ్య అడుగు వేసినదగ్గర ఒడ్డు గట్టిగా లేదు.ఒడ్డు నుండి బండ తొయ్య బోయే లోపే తానే దుబ్బున బావిలో పడిపోయాడు.నడుము విరిగినంత పనయింది.బావిలోపలున్న చిన్న చిన్న రాతిముక్కలు గుచ్చు కున్నాయి.బాధతో అరిచాడు.అతడి గోలఅరణ్య రోదనయింది.బాగా అలసిపోయాడు. కూర్చోవాలనుకున్నాడు.కింద బురద.నిలబడలేక
కూర్చో లేక సతమతమయ్యాడు.ఆ బాధలు చాలవన్నట్టు గాలివాన మొదలయింది. సూరయ్య వానకు తడిసి ముద్దయ్యాడు.చలికి గజగజ లాడసాగాడు.బయటున్న కప్పలు నీటితో పాటు బావిలో పడ్డాయి. ఇప్పటి వరకు పడుతున్న బాధలకు తోడు దిక్కులు పిక్కటిల్లేటట్టు కప్పలగోల! ఆ పై కటిక చీకటి! అంతలో సూరయ్య కువర్షానికి మట్టి కరిగి ఒడ్డునున్న బండలు ఎక్కడమీద పడతాయో అని భయం పట్టుకుంది.తెల్లారివరకు బిక్కుబిక్కుమని జాగరం చేశాడు. తెల్లారింది.ఎవరైనా ఇటు రారా నా గోల వినరా అని అరిచాడు. ఎవరూ అటు రాలేదు.తన కేకలుబయటకు వినిపిస్తున్నాయో లేదో అన్న సందేహంకలిగింది. వెంటనే తలకు చుట్టిన పాగా తీసి రాయి ముక్క మూట కట్టి మీదకు విసిరాడు. పాపం ఆమూట ఎంత జోరుగా వెళ్ళిందో అంతే జోరుగాసూరయ్య మీద పడింది.తలపైన బొప్పి కట్టింది.
ప్రయత్నం మాన లేదు సూరయ్య.మూడో సారోనాలుగో సారో తలపాగా గుడ్డ బావి బయట పడింది.అమ్మయ్య అని ఊపిరి తీసుకున్నాడు. తన తలపాగా గుడ్డ చూసి తననక్కడవెతుకుతారని సూరయ్య ఆశ.చాలా పొద్దెక్కింది. ఊపిరి ఆడడం లేదు. దాహం ఎక్కువయింది. మంచి నీరు ఎక్కడిది?అక్కడున్నబురదనీటి తోనే గొంతు తడుపుకున్నాడు.అంతలోసాయంత్రమయింది. ఆకలి! బతుకు మీద ఆశ
వదలుకున్నాడు సూరయ్య!ఆ శిక్ష సూరయ్య కుచాలనుకున్నాడేమో భగవంతుడు! బావికి దగ్గరనుంచి వెళ్తున్న ఒక రైతు సూరయ్య విసిరిన గుడ్డమూట చూశాడు. ఏమిటదని మూట విప్పాడు. లోపల రాయి.అంతలో బావి నుంచి అరుపులు విన్నాడు.అనుమానం వచ్చి బావి దగ్గరకు వెళ్ళితొంగి చూశాడు. లోపలున్న మనిషిని చూసిఎవరూ అని కేకేశాడు. సూరయ్యకు పోతున్న ప్రాణం వచ్చినట్ట యింది.నేను సూరయ్యను అని ముఖం చూపించాడు.ఆ రైతు ఆలస్యంచేయకుండా వీరయ్య దగ్గరకు పరుగెత్తాడు. విషయం చెప్పాడు. వీరయ్య పలుపు పట్టుకుని అందరూ రండోయ్ అని పరుగు తీశాడు.  బావి వద్దకు అందరూ చేరారు.వీరయ్య అందించిన పలుపు సాయంతో సూరయ్య బయటకు వచ్చాడు.వీరయ్య సూరయ్యను చూసి నువ్వు బాగున్నావా అని పరామర్శించాడు.సూరయ్య తల వంచుకొని "నిన్ను నష్ట పరచాలని చూసి ఆపద తెచ్చుకున్నాను.నాకు తగిన శాస్తే జరిగింది. నన్ను క్షమించు"అన్నాడు.  వీరయ్య చిరునవ్వు నవ్వుతూ"నీవు మారావు.చాలు. చేతనైతే ఇతరులకు సాయంచేయు. నష్టపరచాలని చూడకు.కష్టాలు తెచ్చుకోకు"అని అన్నాడు. ఆ రోజు నుంచి సూరయ్య ఇతరులకు కీడు చేయాలనే ఆలోచనే మానుకున్నాడు.ఇదీ కథ!మనం మిత్రులతో మాట్లడేటప్పుడు అనేక విషయాలు దొర్లుతుంటాయి.కథకు పనికి వచ్చేవిషయాన్ని వదలకూడదు.సహజమైన కథలప్పుడు తయారవుతాయి.మీరూ ప్రయత్నిస్తారు కదా! ఈ కథ 2004 జూలై నెలబుజ్జాయి లో వచ్చింది.(సశేషం)