ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
121.నా మొదటి బాలగేయ సంపుటి::-బెలగాం భీమేశ్వరరావు9989537835.
September 11, 2020 • T. VEDANTA SURY • Memories

2004లో హైదరాబాద్, ఆంధ్ర మహిళాసభలోజరిగిన ఒక సెమినార్ లో శ్రీ తిరునగరి వేదాంత సూరి గారు నేను పక్క పక్కన కూర్చున్నాం.సెమినార్ విరామసమయంలో వార్తలో వస్తున్న నా బాలగేయాల ప్రస్తావన తెచ్చారు.గేయాలు బాగున్నాయి పుస్తక రూపంలో
తీసుకురండి అని సలహా ఇచ్చారు. నా అశక్తతనుతెలియపరిచాను.అశక్తతకు రెండు కారణాలున్నాయి.మొదటిది ఆర్ధికం.పిల్లల చదువులు అవుతున్నాయి. తండ్రిగా నా బాధ్యతలు ఉండనే ఉంటాయి.వాళ్ళ బాధ్యతలుచక్కదిద్దేవరకు ఆర్ధిక క్రమశిక్షణ పాటించాలి.రెండవ కారణం సొంతం గా పుస్తకంప్రచురిస్తే ఆ పుస్తకం మా ఇంటికి మా ప్రాంతానికి పరిమితమవుతోంది.పుస్తకం తెలుగు ప్రాంతమంతా పంపిణీ జరగాలని నా ఆలోచన.నేను ఆలోచనలో పడడం చూసి వేదాంత సూరిగారు"నాకు తెలిసిన పబ్లిషర్ తో మాట్లాడతాను.50 గేయాలు పంపండి"అన్నారు.నేను సరే అన్నాను.ఇంటికి వచ్చాక 53 గేయాలు పంపేను.ఎంపిక జరిగినప్పుడు బాగులేని గేయాలకు బదులు అదనంగా పంపిన గేయాలు ఉపయోగపడగలవని నా ఆలోచన.2004లో గేయాలు వేదాంత సూరి గారికి పంపేను.ఆ తరువాత ఆ విషయం మరచిపోయాను.ఒకవేళ గుర్తు వచ్చినాపుస్తక ప్రచురణ గురించి అడిగి ఒక మంచి స్నేహితుడిని విసిగించడం బాగోదనుకున్నాను.అంతలో కుటుంబం లో ఒక పెద్ద కుదుపు వచ్చింది. ఒక యేడాది వ్యవధిలో మా చిన్నన్నయ్య వరహా నరసింహారావు గారు, మాపెద్దన్నయ్య జనార్దనరావు గారు లోకం విడిచారు.ఆ శోకం తట్టుకోలేక మా అమ్మగారు పరమపదించారు. మనస్సు అల్లకల్లోల మయింది.మా అన్నయ్యల వయస్సులు అప్పటికి పెద్దవయస్సులు కావు.అరవైలలోనే చనిపోయారు.ఆ సంఘటనలు మా కుటుంబ సభ్యులనందరినికలవరపరిచాయి.అన్నయ్యల జ్ఞాపకాలు,అమ్మ జ్ఞాపకాలు నన్ను చుట్టుముట్టేవి.ఎందుకిలా వరుససంఘటనలు జరిగాయని తల్లడిల్లిపోయేవాడిని.ఒకొక్కసారి రాత్రుళ్ళు నిద్ర పట్టేది కాదు.బాల్యంలో అన్నయ్యలతో గడిపిన క్షణాలు గుర్తు వచ్చేవి.
వృత్తి లో నాన్నగారి లాగే అన్నయ్యలుఆదర్శంగా వుండేవారు.సాహిత్యం లో నేనురాణించడం , బహుమతులు పొందడం ,పురస్కారాలందుకోవడం చూసి చాలా సంతోషించేవారు.మా తమ్ముడు అని నా గూర్చిసగర్వంగా చెప్పే వారు.నన్ను ప్రోత్సహించే వారు.
ఇక మా అమ్మగారు గురించి... ఇల్లు, పిల్లలు తప్పించి ఆమెకు మరే వ్యాపకం ఉండేది కాదు.అనవసర విషయాలలో తలదూర్చేవారు కాదు.మా చిన్నతనంలో చదువులకే మమ్మల్ని పరిమితం చేసే వారు.ఇంటిపనులన్నీఆడపిల్లల సాయంతో ఆమే చేసే వారు. నా చిన్న తనంలో నన్ను ముద్దుగా పిలవాలనుకున్నప్పుడు కోటీశ్వర్రావ్ అని పిలిచేవారు.ఎందుకలా ఆమె పిలిచేవారో? ధన సంపాదనలో ఆ మారు పేరు సార్ధకత చేసుకోకపోయినా అక్షర సంపాదనలో ఆమె పిలుపు నిజంకావాలని నా సంకల్పం.చదువుకొనే పిల్లలన్నా
పుస్తకాలన్నా ఆమెకు చాలా ఇష్టం.నా బాల్యం లోఆమె కుశలవుల చరిత్ర, సన్యాసమ్మ పాటలు ,ఆమె బాల్యంలో నేర్చుకున్న పద్యాలు వినిపించేవారు.తన కన్నవారి ఊరు మరిపివలస సంగతులు, తన అమ్మానాన్నలతో గడిపే బాల్యంఅవంతా చెప్పేవారు.అమ్మగారితో తాతగారింటికివెళ్ళేటప్పుడు నా ఇష్టాన్ని గుర్తించి ఆమెచిన్నాన్న గారబ్బాయి కరకవలస గుంపస్వామితోపొలాలు,తోటలు చూడడానికి ఊరి బయటకుపంపేవారు.ఊరి బయటకు వెళ్ళి దూరంగా కనిపించే కొండలు,చెట్ల సమూహాలు చూసిపరమానందం చెందేవాడిని! వివాహమయ్యాక నా భార్యతో మా అమ్మగారు"ఇప్పటి వరకు బాబును జాగ్రత్తగా చూసుకున్నాను.ఇక బాబుబాధ్యత నీది.వేళకు అన్నీ అమర్చి తన ఉద్యోగవిధులకు సకాలంలో వెళ్ళగలిగేటట్టు చూడడంనీ బాధ్యత"అని నా బాధ్యతను నా భార్యకుఅప్పజెప్పారు. ఇలా ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టేవి.ఆ రోజుల లోనే  సరోజారాయ్ కమ్యూనికేషన్స్ ,హైదరాబాద్ నుంచి ఒకరోజుచిన్న బుక్ పార్సిల్ వచ్చింది. తెరచి చూస్తే "పనసపళ్ళు" పేరుతో పుస్తకం!అక్షర దోషాలుసరిచేసి త్వరలో పంపమని ఒక లేఖ!సరోజారాయ్  కమ్యూనికేషన్స్ అధినేత శ్రీ హిప్నో కమలాకర్గారి ఉత్తరమది!ఆ వెంటనే పుస్తకం సరిచేసిపంపేను. అమ్మానాన్నలకు అంకితం అని పుస్తకం లో వేయాలని అమ్మానాన్నలు ఫోటోను పంపేను.ఆ కొద్ది రోజుల లోనే పుస్తక ప్రచురణ జరిగింది.నా బాలగేయాల మొదటి సంపుటి పనసపళ్ళే!!
నేను పంపిన 53 గేయాలతో 53 బొమ్మలతోఆ పుస్తకం వచ్చింది! నా మొదటి బాలగేయ సంపుటి ప్రచురణకు బీజం వేసింది వేదాంత సూరి గారే! నేనది మరచిపోలేను.(సశేషం)