ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
158.అది దూరాలోచన కాదు దూరాలోచన::-బెలగాం భీమేశ్వరరావు,9989537835.
October 13, 2020 • T. VEDANTA SURY • Memories

లోకానికి అవసరమైన వస్తువు కలవారు ఆ వస్తువును ఎరగా చూపి లోకం మీద పెత్తనంచూపడానికి ప్రయత్నిస్తారు.అగ్ర దేశాల కుట్రలు,
కుతంత్రాలు అవి చేసే ఆర్ధిక దోపిడీలు ఉన్నత పాఠశాల విద్యార్థులకు అవగాహన పరచడానికి"దురాలోచన"కథ రాశాను.ఆ కథలోకి వెళ్తే.....స్వర్ణదీవి రాజు నీలవర్మ దృష్టి చుట్టుపక్కలున్నదీవులలోని బొగ్గు గనుల మీద పడింది. నల్ల బంగారం గా ప్రసిద్ధి కెక్కిన నేలబొగ్గు
తో పరిశ్రమలను నడిపి అగ్ర రాజ్యంగా స్వర్ణదీవిని చేయాలనుకున్నాడు. స్వర్ణదీవిలో కూడా బొగ్గు గనులున్నాయి.ఆ విషయం ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. ఇరుగు పొరుగు రాజులకు " మా వద్ద ధనముంది.మీ వద్ద బొగ్గుంది.మా ధనంతో మీ బొగ్గును కొంటాం.పరిశ్రమలు నెలకొల్పి వస్తూత్పత్తి చేసి మీ దేశ ప్రజలకు అమ్ముతాం.మీ బొగ్గుకుమంచి ధరే చెల్లిస్తాం"అని రాయబారం పంపేడు.
చాలా మంది రాజులు ధనానికి ఆశపడి తమదీవులలోని బొగ్గును స్వర్ణదీవికి ఇవ్వడానికిఒప్పందం చేసుకున్నారు.స్వర్ణదీవికి దగ్గరలోనే
రజితదీవి ఉంది. ఆ దీవికి రాజు ఇంద్రవర్మ.అతడుకూడా స్వర్ణదీవితో ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నాడు.అంతలో తన కుమారుడు జ్ఞానవర్మవిదేశీ ఉన్నత విద్య ముగించి స్వర్ణదీవికి వస్తున్న వార్త తెలిసింది. ఆ సంబరంలో ఇంద్రవర్మ స్వర్ణదీవితో ఒప్పందం వాయిదా వేశాడు. రాజభవనం చేరిన కుమారుడిని చూసి మురిసిపోయాడు.విదేశాలలోనేర్చుకున్న విద్యానైపుణ్యాలను అడిగి 
తెలుసుకున్నాడు.మాటల్లో స్వర్ణదీవి ఒప్పందంచెప్పాడు ఇంద్రవర్మ. ఆ ఒప్పందం విని విస్తుపోయాడు జ్ఞానవర్మ!తండ్రితో "ఒప్పందం వాయిదా వేసి రజితదీవికి మేలుచేశా'రన్నాడు.ఇంద్రవర్మకుకుమారుని మాటలు అర్థం కాలేదు."కుమారా!స్వర్ణదీవితో చేసుకోబోయే ఒప్పందం రజితదీవికిమంచి చేస్తుందని అనుకున్నాను. బొగ్గు గనులుఅమ్మగా వచ్చిన ధనంతో రజితదీవిని మరో స్వర్ణ
దీవిగా మార్చవచ్చని ఉబలాటపడ్డాను!"అని అన్నాడు ఇంద్రవర్మ! అప్పుడు జ్ఞానవర్మ " మీరుపొరబడ్డారు.నీలవర్మ అమాయకుడు కాదు.అతనిరాజ్యంలో కూడా బొగ్గుగనులున్నాయి.వాటినిఉపయోగించుకోకుండా ఇతర దీవుల లోని బొగ్గుగనులను తన పరం చేసుకోవడంలో ఒక కుటిల ఆలోచన ఉంది"అని అన్నాడు. దానికిఇంద్రవర్మ "నాకు అలా అనిపించలేదు,వివరంగా
చెప్పు!"అని కుమారుడిని కోరాడు."వినండి నాన్నగారూ!"అని జ్ఞానవర్మ చెప్పడం మొదలుపెట్టాడు."ఖనిజాలు పరిమితం గా దొరికే ప్రకృతి సంపద.నేలబొగ్గు,రాతినూనె ఏ దేశమైనా ఆర్థికంగా ముందుకు పోవడానికి అత్యవసరాలు.నీలవర్మతన రాజ్యంలోని బొగ్గుగనులను భవిష్యత్ కుదాచుకుంటున్నాడు.ప్రస్తుత అవసరాలకు చుట్టుపక్కల దీవులలోని బొగ్గును వాడుకుంటాడు.వస్తూత్పత్తి చేసి విదేశాలతో
వ్యాపారం చేసి సంపద పోగుచేసుకుంటాడు.ఇతర దీవుల గనులలో బొగ్గు పూర్తయ్యాక ఆ దీవులకు స్వర్ణదీవి బొగ్గు గనులే దిక్కవుతాయి.
గనులను అడ్డం పెట్టుకొని చుట్టుపక్కల దీవులనుతన గుప్పిట్లో పెట్టుకుని అగ్రరాజ్యం గా తనదీవిని వెలగనిస్తాడు.ఇదీ అతడి దురాలోచన.అందుకే మనం బొగ్గుగనులను స్వర్ణదీవికి అమ్మవద్దు.మన దీవి బొగ్గుతో మనమే పరిశ్రమలు నడుపుకుందాం.మన ప్రజలకు పనికల్పిద్దాం.విదేశీ వ్యాపారంలో స్వర్ణదీవికి పోటీఇచ్చి రజితదీవిని వజ్రాలదీవిగా మార్చుకుందాం"అని తండ్రికి తన ఆలోచనను వివరించాడు జ్ఞానవర్మ!ఇంద్రవర్మ కుమారుని ఆలోచనతోఏకీభవించాడు!...ఈ కథ ప్రజాశక్తి దినపత్రికలో 2011 జూలై నెలలో వచ్చింది.(సశేషం)