ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
168-బాలగేయ అలలు: --బెలగాం భీమేశ్వరరావు,9989537835.
October 28, 2020 • T. VEDANTA SURY • Memories

చందమామను చూసిఎవరు సరదాపడరు?పిల్లలయితే మరీను!ఆకాశంలో కనిపించే ఆ చందమామను అందుకోడానికి అర్రులు చాస్తారు.ఆనందంతోచప్పట్లు చరుస్తారు.రావే అనేటట్టు చేయి చాచిఊపుతారు.ఆ పిల్లల ఆనందాన్నే "చందమామ"
గేయంగా రాశాను.//చందమామ వచ్చింది/చల్లదనం తెచ్చింది/వెండిమబ్బు వెనుక నుంచి/వెన్నెలను పరచింది//చక్కనైన పాపాయి/చప్పట్లను చరిచింది/చందమామనే చూచి/
చేయి చాచి పిలిచింది/దోబూచుల చందమామ/
మురిసిపోయి నవ్వింది/అమ్మ చెంత నున్న పాప/
పొంగిపొరలి ఆడింది//ఈ గేయం 2012 ఆగస్టు
22న వార్త దినపత్రికలో వచ్చింది. మరో గేయం
"అందాల చెరువు"2012 సెప్టెంబరు 23 ప్రజాశక్తి
లో వచ్చింది. ఈ గేయం లో చెరువుల పూర్వ
వైభవం పిల్లలకు చెప్పడానికి ప్రయత్నించాను.
//అందాల చెరువండి/మా ఊరి చెరువు/అపురూప వరమండి/మా కల్పతరువు//నల్దిక్కులా గట్లు/చెట్లతో నిండెను/చల్లన్ని నీడలో/మన సేదతీరును//చెరువు చూడగ నీరు/నోరు ఊరించును/రుచి చూడ త్రాగగ తేనెలూరించును//ఏ నాచు కలిపిరో/ఏ దుంప
వేసిరో/స్వచ్ఛమైన నీరు/మాకు వరమయ్యేను//
తుళ్ళుతు ఉరుకుతు/మీనములు ఎగురును/
ఇనబింబ కాంతిలో/దగదగ మెరియును//
బారులు తీరుస్తు/బాతులు అగపడును/చూడ
ముచ్చట వేయ/నీటిలో ఈదును//వికసించు
తామరలు/కొల్లలుగ ఉండును/చూడ వచ్చే ప్రజను/పలుకరిస్తుండును//కనువిందు పొందుటకు/మా ఊరు రండీ/మా చెరువు అందాలు/మరి మరీ చూడండి//ఇప్పటికీ కొన్ని
గ్రామాల చెరువులు పూర్వవైభవంతో ఉండడం
విశేషం.ఇంకొక గేయం "వర్ధిల్లు తల్లీ'!ఇది వాస్తవానికి బాలగేయమే.2012 నవంబరు
తెలుగు వెలుగులో వచ్చింది. తెలుగు భాష
ఎలాంటి భాషో ఈ గేయం లో పిల్లలకు వర్ణిస్తూ
చెప్పాను.//పరిమళించు మల్లి కన్న/సంపెంగల
ఛాయ కన్న/ముద్దబంతి పువ్వు కన్న/తెలుగు
భాష సొగసురా//పాలపిట్ట రంగు కన్న/నెమలి
కన్ను కాంతి కన్న/రామచిలుక పలుకు కన్న/
తెలుగు భాష అందమురా//పసిపిల్లల నగవు కన్న/పసిడి నగల మెరుపు కన్న/గలగల సెలయేరు
కన్న/తెలుగు భాష గొప్పదిరా//ఉడుత పిల్ల చూపు
కన్న/లేగదూడ మృదువు కన్న/లేడికూన పరుగు
కన్న/తెలుగు భాష మిన్నదిరా//దోరజామ మిసిమి
కన్న/నిమ్మ పండు పసిమి కన్న/దబ్బపండు ఛాయ
కన్న/తెలుగు భాష మెరియునురా//పప్పు నెయ్యి
బువ్వ కన్న/పనసపండు తొనల కన్న/పంచదార
అరిసె కన్న/తెలుగు భాష మధురమురా//(సశేషం)