ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
172.ఆపదలు రానివ్వని స్నేహబలం:-బెలగాంభీమేశ్వరరావు,9989537835.
November 1, 2020 • T. VEDANTA SURY • Memories

శత్రువులెప్పుడూ దెబ్బ తీయడానికే చూస్తారు.
మనం శత్రువులను ఎదుర్కోలేనప్పుడు మిత్రుల
సహాయంతో ఎదుర్కోవాలి.బలహీనులమని
లొంగిపోరాదు.చీమలన్ని కలిసి పామును
హతమార్చలేదా!ఒకరికొకరు సాయంలో
మహాబలం దాగుంటుంది!శత్రువులను తరమడానికి అదే చక్కని ఉపాయం! ఈ అంశంతో
రాసిన కథ"స్నేహబలం!" ఈ కథ 2012 అక్టోబర్
ధ్యానమాలిక సంచికలో వచ్చింది. కథలోకి వెళ్తే...
అనగనగా ఒక అడవి.ఆ అడవిలో ఒక చెట్టు. ఆ
చెట్టు మీద ఒక గూడు.ఆ గూటిలో ఒక కాకి.గూటిలో మాయమైన గుడ్లు గుర్తు తెచ్చుకొని
వెక్కి వెక్కి ఏడుస్తుంది. ప్రతిసారి పెట్టిన గుడ్లు
పాముకు ఆహారమవడం కాకికి చాలా బాధనిపించింది.ఒక బలమైన స్నేహితుడిని
సంపాదించి పాము బెడద లేకుండా చేసుకోవాలనుకుంది కాకి.పాముకు శత్రువు
ముంగిస.ఆ ముంగిసతో స్నేహం చేసింది కాకి.
కాకికి వచ్చిన ఆపద పోగొట్టాలనుకుంది ముంగిస.
"ఆహారం కోసం నువ్వెళ్ళు.పాము సంగతి నేను
చూసుకుంటాను"కాకికి భరోసా ఇచ్చింది ముంగిస.
ఆహారం కోసం వెళ్లిన కాకి తిరిగి వచ్చేసరికి
పాము చెట్టు క్రింద చచ్చిపడి ఉంది.పామును
చంపిన ముంగిసకు కాకి కృతజ్ఞతలు తెలిపింది.
అప్పటి నుండి కాకి,ముంగిసల స్నేహం గట్టి
పడింది. గుడ్లు పొదిగి పిల్లలను చూసి కాకి ఎంతో
ఆనందించింది.పిల్లలు పెరిగి పెద్దవై ఎగిరి పోయాక
కాకి మళ్ళీ గుడ్లు పెట్టింది. ఈసారి కోతి  బెడద వచ్చి పడింది. కాకి పెడుతున్న గుడ్లను కోతి వచ్చి
పగలగొట్టి తినసాగింది. అది గమనించిన ముంగిస
చెట్ల కొమ్మల మీద నుంచి గెంతుతూ వస్తున్న కోతిని "తప్పు మిత్రమా!"అని హెచ్చరించింది. కోతి
హిహిహి అని పళ్లు ఇకిలించి "పామును చంపగలి
గావు.నన్ను మాత్రం ఏమీ చేయలేవు"అని కాకి
గుడ్డును కిందకేసి కొట్టి వినోదించింది.ముంగిస
కోతిని ఎదిరించలేక మిత్రుని గుడ్లను కాపాడలేక
పోయినందుకు చాలా బాధపడింది.కాకి జరిగింది
తెలుసుకొని కోతి బెడద లేకుండా చేసుకోడానికి
మరొక ఉపాయం పన్నింది.దూరానున్న చెట్టు
మీద వున్న తేనెపట్టు దరికి చేరి రాణీ ఈగతో
తనకొచ్చిన కష్టం మొరపెట్టుకుంది.రాణీ ఈగ
కోతి పని పడతాను.నీ గుడ్లకు ఇక ప్రమాదముండదు"అని చెప్పింది.మర్నాడు కాకి గుడ్డు పెట్టి బయటకు వెళ్ళింది. అలవాటు 
ప్రకారం కోతి గూడు వద్దకు వచ్చింది. రాణీఈగ
తేనెటీగలను కోతిపై దాడి చెయ్యమని ఆజ్ఞాపించింది.తేనెటీగలు కోతిని చుట్టుముట్టాయి.
కోతి ఆ ప్రాంతం వదిలి పారిపోయింది. కాకి సంతోషించింది.ఇప్పుడు కాకికి ముంగిస, తేనెటీగలు ఆప్తమిత్రులయ్యాయి.రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు కొందరు బోయవాళ్ళు
ముంగిసను పట్టడానికి వలపన్నారు.కాకి అది
చూసింది. ముంగిసకు ఆ విషయం చెబితే 
ముంగిస మరోదారిన తన నివాసం చేరుకుంది.
కాకి తన నివాసానికి వెళ్తూ బోయవాళ్ళ మాటలు
వింది.వాళ్ళు ముంగిస చిక్కలేదు,తేనెనయినా
తీసుకుపోదాం,పట్టు కింద మంట పెట్టడానికి
ఎండుపుల్లలేరండి అనుకుంటున్నారు. ఆ మాటలు విన్న కాకి తేనెటీగల రాణికి చెప్పింది.
బోయవాళ్ళు పట్టు దగ్గరకు రాగానే దాడి
చేయించింది. బోయవాళ్ళు పరుగుతీశారు.
కాకి,ముంగిస, తేనెటీగలు భలేగ ఆనందించాయి.
అవి ఒకరిని ఒకరు కాపాడుకుంటూ పిల్లాపాపలతో
హాయిగా సుఖించసాగాయి.(సశేషం)