ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
183.మహాశిల్పి ఎవరు--:: - బెలగాం భీమేశ్వర రావు
November 14, 2020 • T. VEDANTA SURY • Memories

ఒకొక్కసారి మనసులో ఎన్నెన్నో ఆలోచనలు
ముసురుతుంటాయి.ఏమిటి ఈ ఆకాశం?చుక్కలక్కడ ఎవరు తాపేరు?చందమామనక్కడ
ఎవరుంచారు? ఏమిటి ఈ భూగోళం?భూమిపై ఎన్నిన్ని జీవరాశులు?!
వాటికి తీర్చిదిద్దే రూపాలు ఎలా కలుగుతున్నాయి?!ప్రకృతిలో ఎన్ని వైవిధ్యాలు?
రకరకాల పర్వతాలు రకరకాల నీటి ప్రవాహాలు
రకరకాల మొక్కలు రకరకాల పువ్వులు రకరకాల చెట్లు రకరకాల పంటలు సృష్టంతా అందాలమయం! అటువంటి ఆలోచనల లోంచి
పుట్టింది "ఉన్నతుడు"అనే కథ.ఈ కథను విశాఖపట్నం నుంచి వెలువడబోయే "శ్రీవాణి పలుకు" పత్రికకు పంపేను.ఆ పత్రికకు సంపాదకులు శ్రీ ఎం.వి.వి.సత్యనారాయణ గారు.
తొలి పత్రిక లోనే తొలికథగా వేశారు.పత్రిక 
2014 మార్చిలో విడుదలయింది. కథలోకి వెళ్తే...
రంగరాయపురంలో విశ్వనాధుడు శిల్ప కళలో
దిట్ట!అతడి కీర్తి కళింగరాజు రామచంద్ర గజపతి
చెవిన పడింది. ఒకరోజు రాజు మందీమార్బలంతో
రంగరా‌యపురం చేరాడు. ఆ గ్రామానికి ఆనుకొని
ఉన్న రెండు కొండల నడుమనున్న ప్రదేశం లో
శిల్పాలు చెక్కుతున్న విశ్వనాధుడిని సమీపించి,
"మీ కీర్తి విని వచ్చాను.మీ శిల్పాలు అమోఘంగా
ఉన్నాయి. మా ఆస్థానానికి ఆహ్వానిస్తున్నాం.మా
నగర పౌరులకు మీ దర్శన భాగ్యం కలిగించండి!"అని కోరాడు.ఆయనను కళింగరాజు
గా గుర్తించి విశ్వనాధుడు,"మహారాజా!మీ ప్రశంసలకు కృతజ్ఞతలు.మీ రాజ్యంలో నేనొక
సాధారణ పౌరుడిని!నా వృత్తి వ్యవసాయం. 
నాకున్న కొద్దిపాటి పొలాన్ని నమ్ముకుని తీరిక
వేళలో నాలోని కళాతృష్ణను తృప్తిపరచడానికి ఈ
శిల్పకళా ప్రవృత్తిని ఎంచుకున్నాను.మీ వరకు
నా శిల్పాల గురించి తెలియడం నాకెంతో ఆనంద
దాయకం.మీ ఆస్థానానికి తప్పక వస్తాను!"అన్నాడు. రాచమర్యాదలతో విశ్వనాధుడు రాజాస్థానంలో ప్రవేశించాడు.
రాచనగరులోనూ అంతఃపురంలోను,నాలుగు
కూడళ్ళలోను అద్భుతమైన శిల్పాలు చెక్కి
రామచంద్రగజపతికి మరీ చేరువయ్యాడు.ప్రజలు
విశ్వనాధుడి శిల్ప చాతుర్యాన్ని వేన్నోళ్ళ పొగడడం చూసి రామచంద్ర గజపతి ఆయనకు
మహాశిల్పి బిరుదును ఇవ్వడానికి నిశ్చయించాడు.విశ్వనాధుడు వినయంగా మహారాజుకు నమస్కరించి "నా మీద మీరు
చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు!
మహాశిల్పి బిరుదును పొందే అర్హత నాకు లేదు.
శిల్పినైన నేను సృష్టించినవి జీవంలేని బొమ్మలు!
కాని దేవుడు జీవం కలిగిన కోటానుకోట్ల ప్రాణులను వైవిధ్యభరితంగా సృష్టించాడు.
ఆ ప్రాణులకు తోడుగా సుందర ప్రకృతిని సృష్టించాడు.ఆ ప్రకృతే లేకపోతే ఈ లలిత కళలేవీ
గుర్తు వుండవు!అందువల్ల ఈ విశ్వంలో "మహాశిల్పి"అనిపించదగిన వాడు ఆ దేవదేవుడే!ఆ బిరుదు ఆ దేవుడికే దక్కుతుంది. మాలాంటి
శిల్పులకు కాదు!"అన్నాడు. మహారాజు సంతోషించి ఆయనను కౌగలించుకొని,"మీ వ్యక్తిత్వం గొప్పది. మేము స్థాపించాలనుకున్న 
శిల్ప విశ్వవిద్యాలయానికి ప్రధాన స్థపతి పదవిలో
ఉండి శిల్పకళను బతికించండి!"అని కోరాడు. విశ్వనాధుడు మహారాజు అభీష్టాన్ని మన్నించాడు... ఇదీకథ.అందుకే పెద్దలు ప్రకృతి
ఆదిదేవోభవ అన్నారు.(సశేషం)