ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
1906 లో గురజాడవారు" కొండుభట్టీయం" అనే గ్రంథాన్ని వ్రాసారు. కొండుభట్టీయంలో కూడా వేశ్యా సమస్య,వితంతు వివాహం గురించి నాటకం వ్రాయడం జరిగింది. కన్యా శుల్కంలో కూడా ఇవే సమస్యలపై నాటకం వ్రాయడం జరిగింది. సమకాలీన సమస్యలపై పదేపదే అక్కడక్కడ మార్పులు చేస్తూ వ్రాసినట్టు ఉంది. ఆర్థికంగా చిదికిపోయినబ్రాహ్మణ కుటుంబాల జీవనశైలి, సమస్యలపై పోరాటం ఇందులో మనం చూడవచ్చు.నిర్భాగ్యులైన స్ర్తీలు మిగతాసమాజంచే ఎలా దోపిడీకి గురికాబడుతున్నారో ఇందులోవివరిస్తాడు. తన రచనల ద్వారా సమాజంలో గల కుళ్ళునఎత్తిచూపుతూ వాటి పరిష్కారానికి కావలసిన మార్గాలను కూడా సూచిస్తాడు. ఇంగ్లీషు, సంస్కృత చదువులకు సంబంధించి కన్యాశుల్కంలో వ్రాసినట్టు కొండుభట్టీయంలో వ్రాస్తాడు గురజాడ. కొండుభట్టీయంలో పాత్రల గుణగణాలు కన్యాశుల్కంలో పాత్రల గుణగణాలు ఒక్కలానే అనిపిస్తుందికొండుభట్టీయంలోని మంజువాణి కన్యాశుల్కంలోని మధురవాణి ఇద్దరికీ వేశ్యా వృత్తి పట్ల యేవగింపే ! మధురవాణివేశ్యా కులంలో పుడుతుంది. మంజువాణి వేశ్యా కులంలోపుట్టనిది.అయినా కొండుభట్టీయంచే వేశ్యగా తయారు చేయబడుతుంది. అలానే కన్యాశుల్కం లోని గిరీశం, కొండుభట్టీయంలోని, కొండుభట్లు పాత్ర లక్షణాలు ఒక్కలానే ఉంటాయి. కన్యాశుల్కంలోని మీనాక్షి, కొండుభట్టీయంలోనిపార్వతి పాత్ర లక్షణాలు ఒకేలా ఉంటాయి. కన్యాశుల్కం లోని పోలిశెట్టి, కొండుభట్టీయంలోని రంగన్నశెట్టి పాత్రలక్షణాలు ఒకటిగా ఉంటాయి. కన్యాశుల్కంలానే వితంతువుల, వేశ్యల సమస్యలు,పేకాట సన్నివేశాలు కొండుభట్టియంలోనూ ఉంటాయి. కన్యాశుల్కం చదివేవారికి కొండుభట్టీయంచదివితే ఇదేమి రచన అనిపిస్తుంది. కొండుభట్టీయం రచనను గురజాడ కొంతవరకే సాగించి పూర్తి చేయకుండానే విడిచి పెట్టాసాడంటారు మన ముందుతరాల రచయితలు. అలానే గురజాడచే వ్రాయబడిన " బిల్హణీయం'' అచ్చయ్యాయంటారు సెట్టి. ఈశ్వరరావుగారు. అయితే తెలకపల్లి రవి గారు వ్రాసిన " గురజాడ యుగస్వరం" లో రెండు వాక్యాలబిల్హణుని కథ లభిస్తుంది. అదేమిటంటే " బిల్హణుడు 12వ శతాబ్ది కాశ్మీరుకు చెందిన కవి. తనను ప్రేమించిన రాజకుమార్తెను తన శిష్యుడైన రణసింహుడికి అప్పగించి వెళ్లిపోవడం" ఇతివృత్తం అని . ఇక డాక్టర్. యు.ఎ. నరసింహమూర్తిగారు వ్రాసిన ' కన్యాశుల్కం 19వ శతాబ్ది ఆధునిక భారతీయ నాటకాలు' అనే గ్రంథంలో " ప్రాచీన సాహిత్యంలో' అతి కామోద్రేక రచన'లలో బిల్హణీయం ఒకటి.ఆ వస్తువునుతన నాటకానికి ఇతివృత్తంగా గురజాడ ఎందుకు స్వీకరించవలసిందో అర్థంకాదు. ఉదాత్త శృంగారాన్ని కూడా వాడుకభాషలో రచించి రక్తి కట్టించవచ్చునని ఈ కథను నాటకంగాతీర్చిదిద్దడానికి సిద్ధ పడ్డాడు. తనను ప్రేమించిన రాజకుమార్తెను తన శిష్యునికి అప్పగించి రాజు ఓడనెక్కి వెళ్ళిపోవడం ఏ విధంగా( శాస్ర్తీయంగానైనా/లౌకికంగానైనా ) ఉదాత్త శృంగారం అయిందో తెలియడంలేదు" అంటారు. ఇక్కడయువరాజును ప్రేమించే రాకుమారిని రాకుమారుడైనా పెండ్లి చేసుకోవాలి. లేదా ఆమెను ఆమె విధికి ఆమెను విడిచి పెట్టేయాలి. మరొకరికి అప్పజెప్పి పారిపోవడమేమిటి ? ఈ కథ ఒకరి మానవ విలువలను, స్వేచ్ఛను ఇంకొకరికి ఫణంగా పెట్టినట్టుకాదా ? స్ర్తీ ఔన్నత్యానికి పాటుపడిన గురజాడ కలం నుండి ఇటువంటి రచన రావడం తోటి రచయితలు యేవగింపు చేసుకున్నారు.1910లో ముత్యాల సరములు, కాసులు మిగతా ప్రముఖ రచనలు ప్రచురించారు. ఈ సంవత్సరం నుండి తన రచనా ఝరిని ముందుకు పోనిచ్చారు. అనేక ఆధునిక కవితా గీతాలు , ఆధునిక కథలు, అనేక వ్యాసాలు అనేక పత్రికలలో ప్రచురింప బడ్డాయి. వాడుక భాషకోసం వాదోపవాదాలు ఈ కాలంలోనే జరిగాయి. ఇదే సంవత్సరం బిల్హణీయం ప్రథమ భాగం ప్రచురితమైంది. 1911లో " బిల్హనీయం" రెండవ భాగం ప్రచురితమైంది. కొండభట్టీయం, బిల్హణీయంఈ రెండు రచనలు సాహిత్య ప్రపంచంలో సరైన స్థానాన్నిసంపాదించుకోలేదు సరికదా విమర్శల పాలయ్యాయి. (సశేషం) శివ్వాం. ప్రభాకరం,బొబ్బిలి, ఫోన్: 701 3660 252.
July 28, 2020 • T. VEDANTA SURY • Memories