ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
35.ఒకటవ తరగతి పిల్లల కోసం గేయాలు: --1979లో పుట్టిన చెట్లొస్తున్నాయ్ జాగ్రత్త నవల ప్రచురణ అలా సుఖాంతమైంది.1వ తరగతి పిల్లల కోసం మరికొన్ని బాలగేయాలు తయారు చేయాలన్న తలంపు కలిగింది. తరగతి వాచకంలో ఇచ్చే బాలగేయాలతో నేను తయారు చేసిన బాలగేయాలను కూడా పిల్లలకు నేర్పాను. వాటిలో కొన్ని ప్రస్తావిస్తాను.ఇవి 1979,80సం.లలో రాసినవి. / పిల్లలు/ /పిల్లల్లారా పిల్లల్లారా/ /అల్లరి చేసే పిల్లల్లారా/ /వేళకు బడికి రావాలి/ /బడిని శుభ్రం చేయాలి/ /పోకిరి మాటలు ఆడొద్దు/ /గోల ఎన్నడు చేయొద్దు/ /శ్రద్ధగ పాఠాల్ వింటూను/ /బుద్ధిగ విద్యలు నేర్వాలి/ /ఆటలు అందరు ఆడాలి/ /పాటలు బాగా పాడాలి/ /ఐకమత్యం గ ఉండాలి/ /గొప్పవాళ్ళుగ అవ్వాలి/ పత్రిక పేరు: శుభోదయ పార్వతీపురం లో ప్రతి గురువారం సంత పెడతారు.సంతలో పశువుల క్రయ విక్రయాలు జరుగుతాయి.పశువులను అలంకరించే మువ్వలు,గంటలు,పట్కాలు అమ్ముతారు. వ్యవసాయ పనిముట్లు తయారు చేయడానికి ఉపయోగపడే కలప , నిచ్చెన లాంటి గృహోపకరణాలు అమ్మకానికి పెడతారు.గిరిజనులు కొండ పంటలు తెచ్చి అమ్ముతారు. ఇంకా పిల్లల ఆటవస్తువులు పీపలు, బుంగలు(బెలూన్లు),గిలకలు లాంటివి అమ్ముతారు. సంతను చూపడానికి పిల్లలను పెద్దలు అపుడపుడు తీసుకు వెళ్తుంటారు. మా పాఠశాల పిల్లలకు సంత పరిచయమే.సంత మా పాఠశాల కు దగ్గర లోనే జ‌రుగుతుంది.అందువల్ల సంత అనే పాట తయారు చేశాను. ఆ పాట: /బాబూ బాబూ ఏడకెళ్ళావ్?/ /చెరువూ పక్కన సంతకెళ్ళాన్!/ /సంతా లోపల ఏం చూశావ్?/ /రంగూ రంగుల బుంగలు చూశాన్!/ /బుంగలు చూసి ఏం చేశావ్?/ /చక్కనిదొక్కటి గప్ న కొన్నాన్!/ /కొన్నా బుంగా ఏం చేశావ్?/ /గుక్కా తిప్పక గట్టిగ ఊదాన్!/ /ఊది ఊది ఏం చేశావ్?/ /దారం కట్టి మీదకు ఎగిరాన్!/ /మీదకు వెళ్ళి ఏం చేశావ్?/ /లోకాలన్నీ తిరిగీ వచ్చాన్!/ (శుభోదయ పత్రిక) పాట పెద్దదయినా పిల్లలకు పాట నచ్చింది. పిల్లలు ఇష్టపడే బుంగ(బెలూన్)ను గేయవస్తువుగా తీసుకున్నాను. బుంగను ఊది దారం కట్టడం ,దారం కట్టి మీదకెగరడం,అక్కడ ఎగురుకుంటూ లోకాలను చుట్టి రావడం...ఇవన్నీ పిల్లల భావ జగత్తు లో చాల ఇష్టమైనవి. మరొక విషయం ఈ గేయంలో ఉంది. పాదాలు తయారయ్యేటప్పుడు వెనుక దానితో తర్వాత పాదం ముడిపడి ఉండడం వల్ల పిల్లలు పాటను సులభంగా గుర్తుంచుకోగలిగారు. ఈ పాటను పిల్లలు అభినయగీతంగా పాడుకున్నారు. ఒకరు పాడుతుంటే ఇంకొకరు అభినయం చేస్తుండే వారు. ఆ రోజుల్లో చుక్ చుక్ రైలు వస్తోంది దూరం దూరం జరగండి అనే పిల్లల పాట చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఆ పాటంటే పిల్లలకు మోజే! అందువల్ల ఆ పాటను అనుకరిస్తూ విమానం మీద పాట రాశాను.ఆ చుక్ చుక్ రైలు పాట కవి ఎవరో ఆయనకు కృతజ్ఞతలు. /విమానం/ /తెల్లటి విమానమొస్తోంది!/ /ఆకాశం నుంచి దిగుతోంది!/ /పాపా పాపా ఏడవకు!/ /విమానమెక్కీ పోదాము!/ /చక్కగ మీదకు వెళ్తాము!/ /మబ్బుల మధ్య మసలెదము!/ /హాయిగ కూర్చొని వుంటాము!/ /మిఠాయిలెన్నో తింటాము!/ /మీద నుండి చూస్తేను!/ /బొమ్మరిల్లే... మన ఊరు!/ (ఆంధ్ర భూమి) ఇది కూడా అభినయగీతమయింది.చుక్ చుక్ రైలు,విమానం గేయాలు రెండూ పిల్లలకు కవల గేయాలయ్యాయి.బుద్ధిమంతుడైన పిల్లడు బడికి వెళ్తాను దీవించి పంపమ్మా అని తల్లిని అడిగే తీరును "డాక్టర్ బాబు' పేరుతో ఒక పాటగా మలిచాను. ఆ పాట: /పప్పూ బువ్వ పెట్టమ్మా/ /అల్లరి చేయక తింటాను/ /మీగడ పాలు ఇవ్వమ్మా/ /గప్ చిప్ గా తాగేస్తాను/ /పలకా బలపం కొనవమ్మా/ /బుద్ధిగ బడికి పోతాను/ /చల్లని దీవెన లివ్వమ్మా/ /డాక్టర్ బాబును అవుతాను/ (ఆదివారం వార పత్రిక) ఆడపిల్లలు చివరి పాదాన్ని లేడీడాక్టరునవుతాను అని పాడేవారు.కొన్నేళ్ల కిందట ఒక ఉదయం నేను బజారు వైపు వెళ్తుంటే ఒక యువకుడు పప్పూ బువ్వ పెట్టమ్మా అల్లరి చేయక తింటాను మీగడ పాలు ఇవ్వమ్మా గప్ చిప్ న తాగేస్తాను అంటూ నాకెదురుగ వచ్చాడు.నేను ఆశ్చర్యం నుంచి తేరుకొనేలోగా నా పేరు డొంకాడ రమేశ్అండీ.జగన్నాథపురం స్కూల్ లో నేను 1వ తరగతి చదివినప్పుడు మీరప్పుడప్పుడు మా తరగతికి వచ్చి పాటలు నేర్పేవారండీ అని పరిచయం చేసుకున్నాడు.నేను ఏ పాఠశాలకు బదిలీ మీద వెళ్ళినా అక్కడ 1వ తరగతికి అప్పుడప్పుడప్పుడు వెళ్ళడం నాకలవాటుగా ఉండేది.నేను నేర్పిన పాటను నాకే ఆ యువకుడు గుర్తు చేయడం ఉపాధ్యాయుడిగా రచయితగా నాకెంత సంతృప్తి?!ఆ సంతృప్తిని మాటల్లో కొలవలేం! మరొక చిన్నపాట: /ఇష్టం/ /తేనెటీగకు తేనంటే ఇష్టం/ /రామచిలుకకు పండంటే ఇష్టం/ /మ్యావ్ మ్యావ్ పిల్లికి పాలంటే ఇష్టం/ /మా చిట్టి పాటకు అమ్మంటే ఇష్టం/ (చంపక్) ఒకటవ తరగతి ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఇలాంటి పాటలు రాసే భాగ్యం కలిగింది. బాలసాహిత్య రచయిత గా నిలదొక్కుకోడానికి ఇవన్నీ నాకుపకరించాయి.(సశేషం)-- బెలగాం భీమేశ్వరరావు--9989537835
June 22, 2020 • T. VEDANTA SURY • Memories