ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
36.నా మొదటి బాలల కథ: -- చెట్లొస్తున్నాయ్ జాగ్రత్త నవల రాయడంతో భావాలను అల్లగలనన్న ఆత్మవిశ్వాసం కలిగింది. చిలుక, పిల్లలు, సంత,విమానం బాలగేయాలు రాయడం పత్రికలలో అవి రావడంతో నాలో రచన చేయడం పట్ల ఉత్సాహం పెరిగింది. బాలల కథ రాయాలనుకుంటున్నాను గాని రాసే సందర్భం రాలేదు.ఆ సందర్భం మా చిన్నన్నయ్య గారబ్బాయి చక్రధర్ కల్పించాడు. అవి1980 అక్టోబరు రోజులు!తీవ్రమైన తుఫాను వచ్చింది. ఒరిస్సా నుంచి వస్తున్న వంశధార నదికి వరదలు వచ్చాయి.శ్రీకాకుళం జిల్లా వాసులు ,దక్షిణ ఒరిస్సా ప్రజలు కట్టుగుడ్డలతో సురక్షిత ప్రాంతాలకు పోయి ప్రాణాలు దక్కించుకున్నారు.కూడు,గుడ్డ,గూడు కరువయ్యే పరిస్థితులు ఆ ప్రాంతంలో తాండవించాయి. ఆ సందర్భంలో అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు సాయమందించడానికి ముందు కొచ్చాయి.ఊరూరా తిరిగి ప్రజల నుంచి ఆహార దినుసులు, బట్టలు సేకరించి వరదబాధితులకు పంపుతున్నారు.చక్రధర్ అప్పుడు ఒకటో తరగతి చదువుతున్నాడు. స్కూల్ నుంచి సాయంత్రం ఇంటికి వచ్చాడు.మా వదిన గారింట్లో లేరు.పేరంటానికి వెళ్ళారు.అన్నయ్య గారింకా స్కూలు నుంచి రాలేదు. చక్రధర్ ఒక్కడే ఉన్నాడు. పుస్తకాలు గడపలో పెట్టి ఇంటికీ వీధికి మధ్య తిరుగుతున్నాడు.వాళ్ళమ్మ గారి కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలో వీధి లోకి ఒక స్వచ్ఛంద సంస్థ వారు వచ్చారు.మైక్ లో వరదబాధితులకు సాయం చేయండి.తినడానికి తిండిలేదు.ఉండడానికి ఇల్లు లేదు.కట్టుకోడానికి బట్టలు లేవు.వస్తున్నది చలికాలం. పాపం పిల్లలు, పెద్దలు ఎలా ఉంటారో ఏమో ...సందర్భం చెప్పి సాయమడుగుతున్నారు.ఆ మాటలన్నీ చక్రధర్ చెవిన పడ్డాయి. వీధి మెట్లు దగ్గరకు వచ్చాడు.ప్రతి ఇంటి వాళ్ళు బియ్యమో బట్టలో ఇస్తున్నారు. అది చూశాడు. అమ్మానాన్నలు ఇంట్లో లేరు. సాయం చెయ్యాలనిపించింది.గబ గబ ఒంటి మీద డ్రెస్ తీసి ఇంటికి వచ్చిన వారి కందించాడు.వాళ్లు తీసుకోడానికి సంశయిస్తుంటే నాకు బోలెడు బట్టలు అని తుర్రున గడపలోకి వచ్చేశాడు.చిన్న పిల్లాడి ఔదార్యానికి వాళ్లు అవాక్కయ్యారు కాస్సేపటికి మా వదిన గారు పేరంటం నుంచి . తిరిగి వచ్చారు. బట్టలు లేకుండా ఉండే కొడుకును చూసి బట్టలు విప్పుకొని ఉన్నావేం? కోపంతో అడిగారు. మైక్ నుంచి మాటలు వస్తున్న వైపు చూపించి వాళ్ళకిచ్చాను.నువ్వూ లేవు నాన్నా లేరు అందుకే నా బట్టలు ఇచ్చాను అని చాలా సీరియస్ గానే అన్నాడట! వదిన గారు ఆశ్చర్యం నుంచి తేరుకొని నవ్వు ఆపుకోలేకపోయారు. ఈ సంఘటన విన్నాక బాలల కథగా ఆ విషయం రాయాలనుకున్నాను. పెద్దలకే కాదు చిన్న పిల్లలకూ జాలిపడే గుణం,సాయపడే మనస్సు ఉంటాయని చెప్పడానికి "సహాయం" పేరుతో ఈ ఇతివృత్తం తీసుకుని కథ రాశాను.ఈ కథ 1980 నవంబర్ 15 శుభోదయ పక్ష పత్రికలో వచ్చింది. అలా పిల్లల కథలకుశ్రీకారం చుట్టాను.(సశేషం) - బెలగాం భీమేశ్వరరావు 9989537835
June 23, 2020 • T. VEDANTA SURY • Memories