ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
38. యువరచయితల వెల్లువ (1980 దశకంలో)----పార్వతీపురం ప్రాంతం చాలా కాలం నుంచి సాహిత్యానికి పెట్టింది పేరుగా ఉంది!హరికథాపితామహుడు శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు బాల్యంలో అడుగు పెట్టిన ప్రాంతమిది! పోతనామాత్యుని శ్రీ మదాంధ్ర మహా భాగవతమును ఆ బాల్యం లోనే ఆయనకు బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించిన పట్టణమిది! మొదటి తెలుగు కథ ఎవరిది అన్న వాదనలో నిలబడిన ఐదారు కథలలో ఒక కథగా నిలిచిన "లలిత" కథ రచయిత శ్రీ ఆచంట సాంఖ్యాయన శర్మ గారు పార్వతీపుర ప్రాంత వాసీయులే!సంస్కృత భాష నేర్చుకోవాలనుకొనే వారికి సహాయ పడే శబ్దమంజరి సృష్టికర్త శ్రీ నడిమింటి సర్వమంగళేశ్వర శాస్ర్తిగారు ఈ ప్రాంతం వారే! శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కృష్ణ పక్షానికి పోటీగ శుక్లపక్షం అనే సరస పరిహాస కావ్యం రచించిన కవి శ్రీ అనంతపంతుల రామలింగ స్వామి గారు పార్వతీపురం పట్టణం వారే.మణిప్రవాళం వ్యాస సంపుటితో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన డా.ఎస్వీ జోగారావు గారు కూడా పార్వతీపురం వారే.వీరే కాకుండా ఆదిభట్ల రామమూర్తి గారు శ్రీ ఉప్మాక నారాయణ మూర్తి గారు, సీనియర్ నేరెళ్ళ నారాయణ మూర్తి గారు కవులుగా ప్రసిద్ధికెక్కారు. వీరే కాకుండా శ్రీ ద్వివేదుల సత్యనారాయణ,శ్రీ పతంజలి శాస్త్రి ,శ్రీమతి గరిమెళ్ళ సూర్యమాంబ గారలు కూడా ఈ ప్రాంతంలో కవులుగా ప్రసిద్ధికెక్కారు. గొప్పవాళ్ళు నడిచే నేల వికసిస్తుందిగాని బీడుబారదు.దానికి తార్కాణమే అనేక మంది కవులు, రచయితల ఆవిర్భావం ఈ నేల మీద! ఉపాధ్యాయ పత్రికలో కథల ద్వారా కొండ గోడు వినిపించిన భూషణం మాష్టారు తెలుగు నేల పేరు బడ్డ రచయిత అయ్యారు.మధ్య తరగతి జనజీవితానికి అద్దం పట్టే రచనలు చేసి పంతులు జోగారావు, పి.వి.బి.శ్రీరామ మూర్తి ,వసుమతి,ఏ.ఎన్.జగన్నాధశర్మ,జల్దు బాబ్జీ గారలు కథాలోకంలో అవిరళమైన కృషి చేస్తున్నారు. భూషణం గారి వారసులుగా తయారవ్వబోయే అట్టాడ అప్పలనాయుడు గారు, ఉత్తరాంధ్ర రైతు జీవితాన్ని తెలుగు సాహిత్యంలో పదిల పరచబోతున్న గంటేడ గౌరునాయుడు గారు కొత్తగా రచనలు ప్రారంభించారు.జూనియర్ నేరెళ్ళనారాయణ మూర్తి గారు తెలుగు శతక సాహిత్యం సంస్కృత వ్యాకరణ వ్యాసరచనలో ప్రవేశించారు. ఎస్వీ ఎల్ ఎన్ స్వామి ,ముంతా గుంపస్వామి, దొడ్లంకి వెంకట రావు(ఆప్తచైతన్య), పి.నాస్తిక్ ,గారల కథలు కూడా పత్రికలలో వస్తుండేవి.అయ్యగారి శ్రీనివాసరావు గారు ,మంచిపల్లి శ్రీరాములు గారు ఆ రోజులలోనే రచనావ్యాసాంగం లో అడుగు పెట్టారు.తానేమీ తక్కువ కాదంటూ బాలసాహిత్యం కూడా పార్వతీపురం లో వికసించింది .1948 ఫిబ్రవరి చందమామ లో సి.హెచ్.మోహనరావు , పార్వతీపురం పేరుతో ఒక కథ వచ్చింది.1950 దశకం చివర నుంచి సుమారు సుమారు 4 దశాబ్దాలు శ్రీ తాళ్ళపూడి వెంకట రమణ గారు బాలసాహిత్యంలో గేయాలు, గేయకథలు రాసి లబ్దప్రతిష్టుల య్యారు.ఆయనకు సమకాలికులుశ్రీ రాళ్ళపల్లి గౌరీపతి శాస్త్రి(లతిక)గారు కూడా బాలసాహిత్యం లో కృషి చేశారు. శ్రీ అందవిల్లికొండలరావు గారు కూడా బాలలకథలను అప్పటికిరాస్తున్నారు. 1980 దశకంలో బాలసాహిత్యంపరవళ్లు తొక్కిందనే చెప్పొచ్చు. బెలగాం భీమేశ్వరరావు,బెహరా ఉమామహేశ్వరరావు, నారంశెట్టి ఉమామహేశ్వరరావు, బి.వి.పట్నాయక్, బెలగాం కేశవరావు, బి.వి.రవికృష్ణ, పక్కి రవీంద్ర,కాలిపు శంకర్రావు గారల రచనలు పత్రికలలో పోటాపోటీగా వస్తుండేవి.పార్వతీపురం బాలసాహిత్య రచయిత కథ లేని పిల్లల పత్రికలు ఆ రోజుల్లో లేవంటే అతిశయోక్తి కాదు.ఆ సమయం లోనే తాళ్ళపూడి వారి ఆధ్వర్యంలో ఇందిరా బాలానందం కార్యక్రమాలు, నవ్యబాలసాహితీ కార్యక్రమాలు జరుగుతుండేవి.ఇక పెద్దల సాహిత్యానికి వస్తే పి.వి.బి.శ్రీరామమూర్తి గారు మిత్రసాహితీ సంస్థ స్థాపించారు..వారం వారం కథాపఠన కార్యక్రమాలు చేపట్టారు.ఎందరో యువకులకు సాహిత్యం మీద ఆసక్తి కలిగించారు.1987లో శ్రీ మంచిపల్లి శ్రీరాములు గారు సాహితీలహరి పేరుతో సాహిత్యసాంస్కృతిక సంస్థను ఆరంభించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో లబ్దప్రతిష్టులైన కవులు,రచయితల ప్రసంగాలు జరుగుతుండేవి.సాహిత్య అధ్యయనానికి అవకాశం కలిగించారు. ఆంధ్ర భూమి దినపత్రిక వారు కథల మాష్టారు శ్రీ కాళీపట్నం రామారావు గారి ఆధ్వర్యంలో నేటికథ శీర్షిక నిర్వహించారు.రోజుకొక కథ ఆ దినపత్రికలో ఇచ్చే వారు.సాంఘిక కథలు నేర్చాలనుకొనే వారికి ఆ శీర్షిక ఒక వరమే అయింది! ఇన్ని కారణాల వల్ల ఆ రోజుల్లో పెద్దల సాహిత్యం, పిల్లల సాహిత్యం జోడుగుర్రాల్లా పరుగు తీస్తుండేవి. ఆ పరిస్థితులలో పిల్లల కథలు రాస్తున్నప్పటికి పెద్దల కథలు రాశాను.ఆ కథలు యోజన, ఉపాధ్యాయ, తెలుగు విద్యార్థి,కన్య, కథాంజలి, నాగావళి, విపంచి,ఆంధ్రభూమి దినపత్రిక, విజయ,పల్లకి, ఆంధ్ర జ్యోతి, ఆంధ్రపత్రికలలో వచ్చాయి.(సశేషం) --బెలగాం భీమేశ్వరరావు 9989537835
June 25, 2020 • T. VEDANTA SURY • Memories