ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
39.యువ రచయితల వెల్లువ (రెండవ భాగం)---పార్వతీపురానికి వన్నె తెచ్చిన మహనీయులలో శ్రీ బెహరా సత్య గణేష్ పాత్రో ఒకరు!గణేష్పాత్రోగా అందరికీ ఆయన సుపరిచతం!పార్వతీపురాన్ని సినిమా రంగం వరకు 1980 కి ముందే తీసుకు వెళ్ళిన ఘనత ఆయనిది! పార్వతీపురానికి దగ్గర ఊరు మార్కొండపుట్టి ఆయనిది!ఆయన హైస్కూలు చదువు పార్వతీపురం లోనే! నాటికలు, నాటకాలు రచనతో ఆరంభమయ్యే ఆయన రచనా జీవితం సినిమాలకు డైలాగులు, కథలు సమకూర్చే స్థాయికి వెళ్ళింది. ఆయన రాసిన డైలాగుల్లో పార్వతీపురం స్థానికత కనిపించేది.గణేష్ పాత్రో సమకాలికులే ఓలేటి బుచ్చిబాబు గారు దోమాన సూర్యనారాయణ గారు తాము స్వయంగా నాటికలు రాయడమే కాకుండా యువరచయితలచే కూడా నాటికలు రాయించి ప్రదర్శనలిస్తుండేవారు.శిష్ట్లా హరగోపాల రావు గారు కవి,రచయితే కాకుండా ఆయన శారదా కళా స్రవంతి అనే సంస్థను స్థాపించి ఎన్నో సాహిత్య కార్యక్రమాలను నిర్వహించి ఆనాటి రచయితలను ప్రోత్సహించారు. దేవరకొండ రామచంద్ర రావు గారు ఉపనిషత్తులను తనదైన సులభ శైలిలో సంస్కృతంలో రాసిన పండితులు. ఈయన కూడా పార్వతీపురం వారే!పార్వతీపురానికి చెందిన పంతులు సీతాపతి రావు మాష్టారు తేటగీతిలోసుందరాకాండ రాశారు. పంతులు విశ్వనాథ రావుగారు కథలు పద్యాలు రాశారు. ఆ కుటుంబానికేచెందిన పంతులు కృష్ణారావు గారు చాలా కథలు రాశారు. ప్రముఖ నవలా రచయిత రామవరపు వేణుగోపాలరావు గారు స్థానికంగా ఉండే కొల్లూరి సోమేశ్వర రావు గారి అల్లుడు. కొంత కాలం పార్వతీపురంలో ఉండి రచనలు చేశారు.1980 దశకంలో నవలా రచనలతో తెలుగు నవలా సాహిత్యాన్ని పండించిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి తనికెళ్ల కళ్యాణి గారు పార్వతీపురానికి చెందిన వారే! నవలారచనల పోటీలలో బహుమతులందుకున్నారు!మాణిక్య మంజీరాలు అనే సాహిత్య సంస్థను నిర్వహించిసాహిత్య సేవ చేసిన ధన్యజీవి! తెలుగు నేల గర్వపడే ప్రముఖ కవి ప్రముఖ వ్యాఖ్యాత ప్రముఖ పండితులు శ్రీ మానాప్రగడ శేష సాయిగారి కుమార్తె! ఈ దశాబ్దం లోనే ఓలేటి సోదరులు బుచ్చిబాబు, శ్రీనివాస భాను గారలు తమ కలాలకు పదును పెట్టారు. ఆ రోజుల లోనే జియో లక్ష్మణ్ గారు బి.వి.డి.ప్రసాద్ గారు,ముంతా గుంపస్వామి గారు విరివిగా కథలు రాస్తుండేవారు.నేటి కథలతో నాటి పాఠకులను ఆకట్టుకున్న పోతుబరి వెంకటరమణ పార్వతీపురం లో ఉపాధ్యాయులు గా ఉండేవారు.తనికెళ్ళ అలివేణి గారు ఆ రోజుల్లో కథలు రాస్తుండేవారు.రాగోలు శంకర్రావు గారు,ప్రముఖ చిత్రకారులు పల్ల పరిసినాయుడు గారు, రొంపల్లి చంద్రమౌళి గారు బాలసాహిత్య రచనలు ప్రారంభించారు.జర్నలిస్ట్ నుంచి రచయిత అవతారమెత్తి అప్పన్న వ్యాసాలతో తెలుగు పాఠకులను ఆలోచనాపరులుగా చేసిన సముద్రాల సత్యనారాయణ గారు పార్వతీపురం వారే!విద్యాసమస్యల మీద రాజకీయ సమస్యల మీద ఎన్నోవ్యాసాలు ఇటు తెలుగు లోను అటు ఆంగ్లం లోను రాసిన శివ్వాం ప్రభాకరం కూడా పార్వతీపురం ప్రాంతం వారే ! వాణీగాన సభ అనే సంగీత సంస్థను ఆ రోజులలోనే స్థాపించి డా.డి.రాఘవేంద్రరావు దంపతులు సంగీత కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా సాహితీవేత్తలను కూడ ప్రోత్సహింంచడం విశేషం! పార్వతీపురం మెయిన్ రోడ్ లో రాధాగోవింద పాఢి గారి పుస్తకాల దుకాణం నిర్వహించిన అనంతపంతుల సామవేది గారు కవితలు రాయడమే కాకుండా నూతన రచయితలకువిలువైన సలహాలిచ్చి ప్రోత్సహిస్తుండేవారు. రచయితలు చదవ వలసిన పుస్తకాలు తెప్పించి అందుబాటులో ఉంచేవారు.ఎందరో మహానుభావులు వారంతా భావితరాల రచనలకు రచయితలకు మార్గం చూపారు. అది పార్వతీపురం కాదు సరస్వతీపురం అనే నానుడి కి అందరూ దోహదపడ్డారు. జీవం పోశారు. (సశేషం)- బెలగాం భీమేశ్వర రావు
June 26, 2020 • T. VEDANTA SURY • Memories