ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
40. తొలి కథలు (మొదటి భాగం)-- సహాయం, ఇద్దరు దొంగలు కథలు వచ్చాక పర్యావరణ అంశం తీసుకొని కథ రాయాలనుకున్నాను.నా ఆలోచన అడవుల మీదకు మళ్ళీ వెళ్ళింది. అందులో ఉండే జంతువుల గురించి రాస్తే?! ఏం రాయాలి? నన్ను నేనే ప్రశ్నించుకున్నాను!ఆలోచన చేస్తుంటే పులులు, సింహాలు నా మనసులోకి వచ్చాయి!అవి కూడా పర్యావరణలోని భాగమేగా!!ఏజీవిని కూడా ప్రకృతి వృధాగా సృష్టించలేదు.ప్రతి జీవి పర్యావరణ సమతుల్యత కాపాడే ధన్యజీవే! పులి,సింహం లాంటి కౄరమృగాల వల్ల కూడా ఆ బృహత్కార్యం నెరవేరాలి కదా! ఆ దిశగా ఆలోచించాను.ఆ ఆలోచనల ఫలితమే "మేలు చేసే కౄరమృగాలు" కథ! జానపదకథగా మలిచాను.ఆ కథలోని విషయం ఏమంటే....తండ్రి మరణించాక యువరాజు వీరవర్మ రాజయ్యాడు. ప్రజలు సుఖశాంతులతోఉండాలని అతని ఆశయం.ఒకరోజు కొన్ని గ్రామాల నుంచి పల్లెవాసులొచ్చారు.మహారాజా!అడవిలో పులులు, సింహాలు ఎక్కువయ్యాయి.ఆ భయం వల్ల అడవికి పోలేకపోతున్నాం.మాకు అడవులే జీవనాధారం. అడవికి వెళ్ళకపోతే బతుకుండదు.అందువల్ల మీరు కౄరమృగాలను వేటాడి మమ్మల్ని కాపాడండి అని కోరతారు. రాజు సరే అంటాడు.మంత్రి అడ్డు పడతాడు. మైథిలి అనే రాజ్యంలో కౄరమృగాల వేట వల్ల జరిగిన నష్టం చెబుతాడు.మైథిలీ రాజుకు వేటంటే ఇష్టం! తరచూ అడవులకు వెళ్ళి వేటాడేవాడు. కౄరమృగాలను చంపి తన వీరత్వానికి మురిసిపోయేవాడు.అడవులకు దగ్గరగా ఉన్న ప్రజలు తమకు కౄరమృగాల బెడద లేకుండా చేసినందుకు జేజేలు పలుకుతుంటే రాజు చాలాగర్వపడుతుండేవాడు.ఆ ఆనందం ఎంతోకాలం ఉండలేదు.కౄరమృగాలను నాశనం చేయడంవల్ల అడవులు రెండు విధాలుగా నాశన మయ్యాయి. కౄరమృగాలు లేకపోవడంతో శాఖాహార జంతువులు తెగ పెరిగిపోయాయి.వాటిఆకలి తీరడానికి అడవిలోపెరుగుతున్న మొక్కలెన్నీ చాలలేదు.వేళ్ళతో సహా పెకిలించి తింటుండేవి.కొత్త చెట్ల అభివృద్ధి ఆగిపోయింది.అడవులకు దగ్గరగా ఉన్నపల్లె వాసులకు కౄరమృగాల భయం పోయింది.ఇష్టారాజ్యంగా చెట్లను నరికారు.దట్టమైనఅడవులు పలచనయ్యాయి.రాజ్యంలో చల్లనివాతావరణం కరువయింది.చూస్తుండగానే మేఘాలు మైథిలీ రాజ్యం దాటిపోతుండేవి. వానలు తగ్గిపోయాయి.నీటి కరువు వచ్చింది.పంటలు తగ్గాయి. ఒకవేళ ఏ కొద్దో పండినాఆ పంటను అడవి జంతువులు వచ్చి మెక్కుతుండేవి.మైథిలి రాజ్యం బీడు భూమిగా మారిపోయింది. అని చెప్పుకొచ్చాడు.మంత్రి చెప్పిన వృత్తాంతం వీరవర్మను ఆలోచనలో పడేసింది. రాజ్య క్షేమం కోరి వీరవర్మ వేట ఆలోచన మానుకున్నాడు. పల్లె వాసులకు వేరే జీవనాధారాలు చూపించి రాజ్యం కరువుబారిన పడకుండా కాపాడుకుంటాడు.ఇలా సాగించాను కథను! అడవిలో ఉండే ప్రతి జీవి పర్యావరణానికి మేలు చేసిభూమిపై ఉన్న మనకెంతో పరోక్షంగా సహాయపడగలదని చెప్పడానికి ప్రయత్నించాను. ఈ కథ బాలచంద్రిక లో వచ్చింది.(1981 మే) ఈ తీరులోనే పాములను చంపడం వల్ల కలిగే దుష్ఫలితాలు సర్పదీవి కథ ద్వారా తెలియపరిచాను.పక్షులను నాశనం చేయడం వల్ల కలిగే నష్టం ఖగదీవి కథలో చెప్పాను.(సశేషం)బెలగాం భీమేశ్వరరావు 9989537835
June 27, 2020 • T. VEDANTA SURY • Memories