ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
41.తొలి కథలు (రెండవ భాగం)--దుగరాజుపేట స్కూల్ లో పనిచేస్తున్నప్పుడుఒక ఏడాది 5వ తరగతిని నలుగురు టీచర్లం సర్దుకున్నాం. నా వంతు సామాన్య శాస్త్రం వచ్చింది. అందులో సంతృప్త ద్రావణం అనే పాఠముంది. ఏదైనా ద్రవంలో కరిగే గుణం గల పదార్ధమును వేసుకు పోతుంటే ఒక స్థితికి వచ్చే సరికి ఆ ద్రవం మనం వేసే పదార్ధమును మరి కరిగించుకోలేదు. అలా తయారయ్యే ద్రావణాన్నే సంతృప్త ద్రావణమని అంటారని మనకందరికీ తెలిసిందే. తరగతి గదిలో ప్రయోగాత్మకంగా పంచదారతో చేసి చూపించాను.ఒక స్థితిలో పంచదార కరగక పోవడం చూసి విద్యార్థులు ఆశ్చర్య పోయారు.ప్రత్యక్షంగా చూడడం వల్ల విద్యార్థులకుసంతృప్త ద్రావణం భావన బాగానే తలకెక్కింది.అందరూ సంతృప్త ద్రావణం నిర్వచనం చెప్పగలిగారు.చాలా సంతృప్తి కలిగింది.ఆ భావననుకథగా మార్చాలన్న ఆలోచన వచ్చింది. ఆ రోజు రాత్రి కథ రాయడానికి కూర్చున్నాను.కథ ప్రారంభించాను.వెంటనే తయారయింది.ఆ రోజుల్లో పంచదార ఎంత కావాలంటే అంత దొరికేదికాదు. సోమయ్య ఇంట్లో పెళ్లి. మిఠాయి చేయించడానికి పంచదార అవసరమయింది.ధరకు మించి ఎక్కువ చెల్లించి సోమయ్య పంచదార కొన్నాడు.వంటవాళ్ళు మిఠాయి ముద్ద తయారు చేసి వెళిపోయారు.ఆ మిఠాయిని ఒకగదిలోకి చేర్చి నలుగురు పనిమనుషులను ఉండలు చుట్టడానికి పెట్టాడు.ఏదో పని ఉండి బయటకు వెళ్ళాడు. అయిదు నిముషాలలో తిరిగి వచ్చేశాడు.మిఠాయి ఉండ లక్కడ కనిపించలేదు కాని మిఠాయిని పనిమనుషులు నోట్లో వేసుకోడం మాత్రం కనిపించింది. సోమయ్యకు కోపం వచ్చింది.పనివాళ్ళను పొండి అని కేకలేశాడు.అయిదో తరగతి చదువుతున్న వాళ్ళబ్బాయి శీను వచ్చి తండ్రిని పనివాళ్ళకు దూరంగా తీసుకుపోయి నిన్న మాష్టారు చెప్పిన సంతృప్త ద్రావణం గురించి చెప్పి ఈ పనిమనుషులు తినగలిగినంత తినేశారు.ఇక తినమన్నా తినలేరు.మీరు కొత్త జట్టుకుఈ మిఠాయి పని అప్పజెప్పితే మిగిలున్న మిఠాయిని వాళ్లు పూర్తి చేసేయగలరు.అందువల్ల ఈ పనివాళ్ళనే ఉంచి పనిచేయించడం మంచిది అని సలహా ఇచ్చాడు.సోమయ్య కొడుకు చెప్పిన సైన్స్ విషయం అర్థం చేసుకొని మొదటి పనివారి చేతే పని పూర్తి చేయించాడు. కథకు సంతృప్త ద్రావణం అని పేరు పెట్టి బాలచంద్రిక కు పంపేను.1981 జూన్ సంచికలోకథ వచ్చింది.పాఠానికి అనుబంధం గా కథ తయారయినందుకు ఎంతో సంతృప్తి చెందాను. బాలజ్యోతి పత్రిక వారు ఆ రోజుల్లో పిట్ట కథలుఅనే శీర్షిక పెట్టారు. పక్షులను పాత్రలుగా చేసి కథలు పంపాలి.ఒక రోజు కథ రాయడానికి కూర్చున్నాను.ఎన్నో పక్షులు నా మనసులోఎగిరి వెళ్తున్నాయి.కోడి,బాతు మాత్రం ఎగిరి వెళ్ళలేదు.ఆ రెండు పక్షులతో కథ రాస్తే... ఆలోచనలో పడ్డాను.కల్పిత కథ (ఫాంటసీ) రాయాలనిపించింది.కోడి,బాతుల గురించి ఆలోచించాను.అవి తినే తిళ్ళు ,తిరిగే ప్రాంతాలుగుర్తు తెచ్చుకున్నాను.కలం కదిలింది. మనసుపరుగెత్తింది.ఊహాలోకంలోకి వెళ్ళాను.ఒకప్పుడుపక్షులన్నీ నేల మీదే తిరిగావట! రెక్కలుండి అవిఎగరగలిగేవి కావట!సులభంగా మనుషులకుజంతువులకు పట్టుబడిపోతుండేవి.ప్రాణాలు కోల్పోతుండేవి.అప్పుడు వాటికి ఒక ఆలోచనవచ్చింది.బ్రహ్మ దేవుని వద్ద నుంచి ఎగిరే వరం పొందాలనుకున్నాయి.తపస్సు చేయడానికి ఒక పెద్ద పర్వతం మీదకు చేరాయి.కోడి బాతులువెళ్ళలేదు.ఈ పక్షులు తపస్సు చేయడం ఆ బ్రహ్మవరమివ్వడం ఒకలాగే ఉన్నాయి అనుకొని వెటకారంగా నవ్వుకున్నాయి. తన కూత వల్లే లోకం లేస్తుందని కోడికి గర్వం.నేల మీదను నీటి లోన తిరగ గలనని బాతుకు గర్వం.పక్షులు చేసేతపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్ష మయ్యాడు.పక్షుల కోరిక విన్నాడు.కొన్ని మూలికలిచ్చి ఇవి తినండి ఎగిరిపోతారు అని అన్నాడు. పక్షులు ఆ మూలికలు తిని ఎగిరి పోయాయి. కోడి బాతు ఆ వింత చూశాయి.పర్వతం మీదకు ప‌రుగెత్తాయి.మాకు కూడామూలికలు ప్రసాదించు ఎగిరి పోతాం అన్నాయి. బ్రహ్మదేవుడు దేవుడు కదా ! కోడి బాతు రావడానికి ఎందుకు ఆలస్యమయిందో దివ్యదృష్టి తో తెలుసుకున్నాడు.వీటి గర్వం అణచాలనుకున్నాడు.ఒక మూలిక తీసి దూరంగా విసిరేశాడు.ఆ మూలిక చెత్తకుప్పలో పడింది.వెతుక్కో అని కోడికి చెప్పాడు.మరొక మూలికనుఇంకా దూరంగా విసిరాడు. ఆ మూలిక బురదగుమ్మిలో పడింది. వెతుక్కో అని బాతుకుచెప్పాడు. అప్పటి నుంచి ఆ మూలిక కోసంకోడి కనిపించే ప్రతి చెత్త కుప్పను దువ్వుతుంది.బాతు ప్రతి బురదగుమ్మిని కెలుకుతుంది.నాఊహలు ఆగాయి.కథ తయార యింది.గర్వపడినపక్షులు అని కథకు పేరుపెట్టాను.కథ 1981 నవంబర్ బాలజ్యోతిలో వచ్చింది. ఇలాంటి ఫాంటసీ ఆ తరువాత కుక్క, పిల్లి మీద రాశాను. (సశేషం)-బెలగాం భీమేశ్వరరావు. 9989537835
June 28, 2020 • T. VEDANTA SURY • Memories