ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
42.తొలి కథలు(మూడవ భాగం)--కథలు రాయడానికి కథావస్తువులు వెతుకుతున్నాను.కొత్త వస్తువు తోచలేదు. ఆ సమయంలో సోక్రటీస్ జీవితంలో జరిగిన సంఘటన తీసుకుని "కోపం లేని మనిషి" అనే కథను రాశాను.సోక్రటీస్ భార్య గయ్యాళి.ఇంటి విషయాలు పట్టించుకోడని భర్తతో ఎప్పుడూ తగవుకు దిగేది.సోక్రటీస్ ఆమె మాటలు పట్టించుకునే వాడు కాదు.ఒకసారి ఆమె కోపం తారాస్థాయికి చేరింది. తిట్టిన తిట్టు తిట్ట కుండా ఆమె చాలా సేపు తిట్టింది.సోక్రటీస్ ఎటువంటి సమాధానం ఇవ్వకుండా రాయిలాగ కూర్చున్నాడు. ఆమెలో సహనం నశించింది. భర్తను రెచ్చగొట్టడానికి పేడనీళ్ళు కుండతో తెచ్చి మీద కుమ్మరించింది.సోక్రటీస్ పూర్తిగా పేడనీళ్ళలో‌తడిసి పోయాడు.కళ్ళకడ్డం వచ్చిన పేడను తీస్తూ పిడుగులు పడ్డాక వాన కురిసింది" మెల్లిగాఅన్నాడు.అతని సమాధానం విని ఆమెకు నోటమాట రాలేదు. అప్పటి నుంచి ఆమె భర్త పై విసుక్కోడం మానుకుంది. ఈ కథ ఆంధ్రభూమివీక్లీలో 1981 ఏప్రిల్ లో వచ్చింది.రామకృష్ణపరమ హంస చెప్పినట్టు ప్రచారంలో ఉన్నకథావస్తువు తీసుకుని "సంతోషానికి కారణం"కథ రాశాను.కథలో ఒక శ్రీమంతుడు కంటే ఒకరైతు కూలి ఎందుకు ఆనందంగా ఉండగలిగాడోచెప్పాను.అలెగ్జాండర్ బాల్యంలో చూపినతెలివితేటలను "తెలివి తేటలు" పేరుతో కథ రాశాను.సైనిక పాఠశాలలో గుర్రాన్ని స్వాధీనం చేసుకొనే పోటీ ఏర్పాటు చేశారు. అది కొత్త గుర్రం. ఎవ‌రికీ లొంగ లేదు.భీకరంగా ఇకిలిస్తూ రౌతును కింద పడేస్తుండేది.ఆఖరిలో అలెగ్జాండర్ వంతు వచ్చింది. గుర్రాన్ని అతి సునాయాసంగా లొంగదీసీ స్వారీ చేసి చూపించాడు.తోటి విద్యార్థులు ఆశ్చర్యపోయారు. గుర్రం నీకెందుకు లొంగిపోయిందని అలెగ్జాండర్ ను అడిగారు. అప్పుడు అలెగ్జాండర్ నవ్వుతూ"మీరు ఎదురెండకు భయపడి పడమర దిక్కుగా ప్రయాణం చేయడానికి చూశారు. ఉదయం సమయమిది.నీడలు పొడవుగా పడతాయి.గుర్రం స్వారీకి కొత్తది.దాని నీడ దానినే భయపెట్టింది.అందుకే అది భయంతో బిగిసిపోయి మీకు లొంగలేదు.ఆ విషయం గ్రహించి దిశ మార్చిలొంగ దీశాను."అని సమాధానమిచ్చాడు.ఈ కథబాలచంద్రిక 1982 ఏప్రిల్ సంచికలో వచ్చింది. అలెగ్జాండర్ జీవితంలో జరిగిన మరో సంఘటన ను "తొందరపాటు"కథగా రాశాను.అది కూడాబాలచంద్రికలో వచ్చింది.ఆ కథలు చదివి కొందరుమెచ్చుకున్నారు.మరి కొందరు చరిత్ర కథలకుఅలవాటు పడితే నీ సృజనాత్మకత బండబారి పోతోందని హెచ్చరించారు. అది సద్విమర్శగా స్వీకరించాను. ఒక రోజు నా బి.ఇడి.సర్టిఫికేట్తీ సుకోడానికి విశాఖపట్నం వెళ్ళాను. యూనివర్సిటీ రిజస్టార్ ఆఫీస్ లో బాలసాహిత్య శిక్షణా శిబిర మిత్రులు ఎం.వి.వి.గారు పనిచేస్తున్నారు. అక్కడికి ముందు వెళ్ళాను. గతంలో నా ఎం.ఏ. మార్కుల జాబితాలు ప్రావిజనల్ సర్టిఫికెట్ తీసుకున్న సందర్భంగా ఆయనను రెండు మూడు సార్లు కలిశాను.నన్ను చూసి ఆప్యాయంగా పలకరించారు.నేను వచ్చిన పని చెప్పాను. చేస్తున్న పని పూర్తి చేసి ఆయన నన్ను కరెస్పాండెన్స్ విభాగానికి తీసుకు వెళ్ళారు. పని తొందరగా ముగిసింది. టీ తీసుకుందాం రండని కేంటిన్ కి తీసుకువెళ్ళారు.అక్కడ కూర్చుని టీ తీసుకుంటున్నాం."నా రచనలు ఈ మధ్య చూస్తున్నారు కదా! వాటిపై మీ అభిప్రాయం చెప్పండి.మంచి సలహాలివ్వండి!అవి చేదువైనా ఫర్వాలేదు."అని కోరాను. ఎం.వి.వి. గారి కథలు చందమామ లో ఎక్కువగా వస్తుండేవి.వారపత్రికలలో ఆయన సాంఘిక కథలు కూడా ప్రచురణ జ‌రుగుతుండేవి.ఇవి చాలవన్నట్టు అపరాధ పరిశోధక కథలూ రాస్తుండేవారు. అటువంటి అనుభవం ఆయనిది! మితభాషి అయినా ఆయననే ఒక్కో మాట అమూల్యమే!"కథను చిన్న వాక్యాలతో నడపడానికి కృషి చేయండి. అపరాధ పరిశోధన కథలు,చందమామ కథలు చదవండి. చిన్న వాక్యం, పరుగుతీసే కథనం పట్టు బడతాయి.కథ చదువుతూంటే కళ్లు ముందు దృశ్యాలుకదలాలి." అని సలహా ఇచ్చారు. దృశ్యం ఊహించుకొనే కథను పరుగెత్తించండని అన్నారు.ఏది రాయాలన్నా ఆయన మాటలే వెంటపడుతుండేవి.ఒక రోజు గ్రంథాలయంలో బాలజ్యోతి చూస్తుండగా 1984 సంక్రాంతి పిల్లలకథల పోటీ అనే ప్రకటన చూశాను.(సశేషం)-- బెలగాం భీమేశ్వరరావు 9989537835
June 29, 2020 • T. VEDANTA SURY • Memories