ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
44.ఒక నాన్నమ్మ చెప్పిన కథ--బి.ఇడి.కరెస్పాండెన్స్ కోర్సు తరగతులకు అప్పుడప్పుడు విజయనగరం వెళ్లి వస్తుండే వాణ్ణి.ఆ పై బి.ఇడి. టీచింగ్ ప్రాక్టీస్, రికార్డుల హడావుడి. తీరికలేని రోజులు. మనసు రచనల వైపు లాగుతుండేది.రాత్రి పూట పుస్తకాలు చదివే సమయంలో ఊరట పొందడానికి కథ ప్రారంభించే వాణ్ణి. అలా చేస్తే గాని చదివిన చదువు మనసుకెక్కేది కాదు.ఆ రోజుల్లోనే నేరం అనే కథ కన్య అనే పత్రికలో వచ్చింది. డ్రైవర్ దేవుడు, తెర వెనుక కథ,ఒక అసమర్ధుని కథ అనే సాంఘిక కథలు కథాంజలి పత్రికలో వచ్చాయి.ఒక రోజు నీతికథల పీరియడ్ లో 4వ తరగతి అమ్మాయి చీమ మీద కథ చెప్పింది.పిల్లలు చాలాశ్రద్ధగా విన్నారు.ఆ కథను ఎవరు చెప్పారని ఆ అమ్మాయిని అడిగాను.మా నాన్నమ్మ చెప్పిందని ఆ అమ్మాయి అంది.మీ నాన్నమ్మ పుస్తకాలు చదువుతారా అని అడిగాను. ఆ నాన్నమ్మకు చదువే రాదట!ఆమె చిన్నప్పుడు విన్న కథట!అంటే జనపదులు చెప్పుకొనే కథ! కథ తయారు చేశాను.చీమకు సంపెంగి అనే పేరు పెట్టాను.పాపం ఆ సంపెంగి చిన్నప్పుడే కన్నవారిని కోల్పోయింది.ఒక మామిడి చెట్టు కింద ఒక చిన్న పుట్ట కట్టుకొని అందులో ఉంటుండేది. ఒక కోకిల వద్ద సంగీతం నేర్చుకుంది. యుక్తవయస్సు వచ్చింది. మంచి వరుణ్ణి చూసి పెళ్ళాడాలనుకుంది.ఒక రోజు ఉదయం స్నానం చేసి మంచి చీర కట్టి ముస్తాబై పెళ్లి కొడుకును వెతకడానికి బయలుదేరింది.అలా వెళ్తుండగా ఒక గబ్బిలం కనిపించి ఏమిటి విశేషం అని అడిగింది. చీమ పెళ్లి కొడుకు కోసమని చెప్పింది.గబ్బిలం చీమను పెళ్లి చేసుకుంటానంది.చీమ గబ్బిలం వైపు అదోలా చూసింది. ఛీ... కంపు! పగలు చూస్తే రాత్రి కలలోకి వస్తావు అని ఛీ కొట్టింది. గబ్బిలానికి కోపం వచ్చింది. చీమను తినేయాలనుకుంది.చీమ వెంటనే పక్కనున్న పొదలోకి దూరిపోయి ప్రాణం కాపాడుకుంది.గబ్బిలం ఎగిరి పోయాక చీమ మళ్ళీ బయలు దేరింది. ఈ సారి కొంగ ఎదురయింది.గబ్బిలం లాగే ఎక్కడకని చీమనడిగింది.పెళ్లి కొడుకు కోసమని చెప్పింది. అయితే నన్ను పెళ్లి చేసుకో అని కొంగ అంది.ఛీ చేపల కంపు!దొంగ జపం చేసి పాపం మూట కట్టుకుంటావు.అని కొంగ మాటను కాదంది.కొంగకు కోపం వచ్చిందిముక్కుతో చీమను పొడవబోయింది. బండ సందులోకి దూరి చీమ ప్రాణం కాపాడుకుంది. కొంగ వెళ్ళాక చీమ బండ కిందకు చేరి కొంత సేపు విశ్రాంతి తీసుకుంది.ఆ తరువాత బయలుదేరింది. ఈసారి నెమలి కనిపించింది. అది నాట్యం చేస్తోంది. చీమకు భలే హుషారు వచ్చింది. చక్కనిపాట పాడింది. నెమలి చీమను అభినందించడానికి దగ్గరకు రాగా చీమ భయపడింది. నిన్ను ఏమీ చేయను.నీ పాట బాగుంది.ఈ వేళప్పుడు ఎక్కడికి బయలుదేరావు అని అడిగింది నెమలి.చీమ పెళ్లి కొడుకు కోసమనిచెప్పింది. నెమలి తన స్నేహితురాలు చిలుకతోచీమ సంగతి చెప్పింది. చిలుక చీమను చీమలరాజు వద్దకు తీసుకువెళ్ళింది. చీమ పాటకుఅందచందాలకు చీమల రాజు ముగ్ధుడయ్యాడు.సంపెంగి చీమను పెళ్లి చేసుకుంటానన్నాడు.చిలుక ఆధ్వర్యంలో పెళ్లి జరిగింది. పెళ్లికి వనంలోని జంతువులు, పక్షులు వచ్చాయి. గబ్బిలం, కొంగ లు కూడా వచ్చాయి. చీమలరాజును కలిసి ఎన్నోసార్లు నువు వేటగాళ్ళ వలన మమ్మల్ని కాపాడావు.ఉదయం రాణీ గారితో క్రూరంగా ప్రవర్తించాం.మమ్మల్ని క్షమించమని రాణీగారికి చెప్పండి అని విన్నవించు కున్నాయి. చీమరాణి క్షమించింది.రామచిలుక ఏర్పాటు చేసిన విందు ఆరగించిఅతిథులంతా వెళ్ళిపోయారు.చీమలరాజు చీమలరాణి హాయిగా కాలం గడిపారు.సంపెంగి పెళ్లి కథ ఇలా తయారయింది. ఇందులో పిల్లలనుఆకట్టుకునే అంశం చీమప్రయాణం.మా ప్రాంతంలో ప్రచారంలో ఉన్న కథను రాసి పంపినట్లు హామీపత్రంలో పేర్కొన్నాను.బుజ్జయి ప్రచురణ పుస్తకానికి అనుబంధం గా కథను ప్రచురించారు.1982 ఫిబ్రవరి లో ప్రచురించారు.ఆ నాన్నమ్మ చెప్పిన కథ ఇలా అక్షర రూపం దాల్చింది.(సశేషం)-బెలగాం భీమేశ్వరరావు 9989537835
July 1, 2020 • T. VEDANTA SURY • Memories