ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
66. బొర్రాగుహలు ప్రయాణం (మొదటి భాగం):1989సంవత్సరం దసరా సెలవుల్లో బొర్రాగుహలు ఊరికి పిల్లలతో బయలుదేరాం. అక్కడ మా బావ మర్దు లిద్దరు చంద్ర మౌళీశ్వరరావు, నాగభూషణరావులు రైల్వే డిపార్ట్మెం ట్ లో పనిచేస్తున్నారు. సాయంత్రం పార్వతీపురం లో దుర్గ్ పాసెంజరెక్కి విశాఖపట్నం చేరుకున్నాం.ఆ రాత్రి లాడ్జి లో ఉండి తెల్లారికి రైల్వే స్టేషన్ చేరాం. ఉదయం గం.7లకు కిరండూల్ ట్రయిన్.అది బొర్రాగుహలు గం.11 కి చేరుతుంది.ట్రయిన్ లో కిటికీ పక్కన సీట్లు దొరికాయి.పిల్లలు మేము ఎదురెదురుగా కూర్చున్నాం .బండి కదిలింది. ఒక్కో స్టేషన్ బండి దాటుతోంది.శృంగవరపుకోట దాటిన అరగంటకు వాతావరణం లోను పరిసరాలలోను భలే మార్పు కనిపించింది. బయట ఎండ కాస్తున్నా చల్లని గాలి మాకు తాకి హాయి కలిగిస్తుంది. చిన్నచిన్న గుట్టలు, కొండలు,వాటినానుకొని చిట్టడవి మాకు కనులపండుగ చేస్తున్నాయి. మరో అరగంట దాటేసరికి అద్భుతమైన దృశ్యాల నిలయంగా మేము వెళ్తుండే మార్గం మారి పోయింది. పెళ్లికి ముందు చాలా సార్లు వాళ్ళన్నయ్య గారింటికి వెళ్ళి రావడం వల్ల మా ఆవిడ ఆ మార్గంలో కనిపించే అందమైన దృశ్యాలను పిల్లలకు చూపించి వివరిస్తుంది. ఆమె పిల్లలకు చెబుతున్న విషయాలు వింటూనే ఇంకా ఏవేవో ఆ ప్రకృతిలో వెతుకు తున్నాను.ఎంత విన్నా ఎంత చూసినా తనివి తీరని ప్రకృతది !అంత సరదా అనిపిస్తుంది ఆ ప్రయాణం! రైలు ఆ కొండల నడుమ నేలమట్టానికి చాలా ఎత్తుగా ఉన్న వంతెనలు నుంచి పోతూంటే అందమైన కొండలు ఆ కొండల మధ్య లోయలు ఆ లోయల మధ్య ఉండే పచ్చదనం బయళ్ళు కనుల పండుగచేస్తున్నాయి!అక్కడక్కడ బొమ్మరిల్లు లా కనిపించే గిరిజన గూడేలు వింతనిపించాయి! రైల్వే స్టేషన్లు దగ్గర దుప్పటి ఒంటి నిండా కప్పుకున్నగిరిజనులు రైలుపెట్టెలో ఉన్న ప్రయాణికులను వింతగా చూస్తూ నిలబడి ఉండడం మేం సరదాగా చూశాం! వంకర వంతెనల వద్ద ఒకవింత కనిపించేది.కిటికీ నుంచి చూస్తే ముందున్న రైలింజను వెనుకనున్న గార్డు పెట్టె కనిపిస్తుండేవి! అంత వంకర వంతెన మీద నుంచి వెళ్తుంటే భయం కలుగుతుండేది! మార్గం లో మధ్య మధ్య వచ్చే సొరంగాలు మరీ అబ్బురపరిచాయి!రైలు సొరంగం లోకి వెళ్ళేసరికిపెట్టె లో కటిక చీకటి కమ్మేసేది.పిల్లలు ముందుభయపడి తరువాత ఆ చీకటికి అలవాటు పడ్డారు.సొరంగం దాటగానే వెలుతురు రావడంపిల్లలకు సరదా అనిపించేది. ఆనందంతో చప్పట్లు కొట్టేవారు. అంత కంటే సరదా పడే దృశ్యం పిల్లలకు కనిపించింది! చెట్ల కొమ్మల మీద కొండల బండల మీద కోతుల గుంపులు కనిపించాయి.రైలు పెట్టె లో ఉన్న పిల్లలంతా ఆనందం తో కేరింతలు కొట్టారు!చప్పట్లు చరిచారు! ఆ ఆనందంలో ఉంటూండగానే బొర్రాగుహలు స్టేషన్ వచ్చింది!బేగులు పట్టుకుని గబగబ దిగిపోయాం! స్టేషన్ లో దిగగానే మాఅబ్బాయి ప్రదీప్ సొరంగాలు 42 అని అరిచాడు.ఎంత శ్రద్ధగా లెక్క పెట్టాడు అనుకున్నాను! టైం చూశాను.11 అయింది.పిల్లలుమామయ్యలను చూసి వాళ్ళ ను చేరడానికి పరుగెత్తారు.స్టేషనుకు దగ్గర లోనే రైల్వే క్వార్టర్స్! క్వార్టర్స్ చేరుకున్నాం!స్నానం చేయడానికి బాత్ రూం కి వెళ్ళాను!కుండీలోనీళ్ళు ఐసుగడ్డలుంచే నీళ్ళలా ఉన్నాయి! బకెట్ లో వేణ్ణీలుంటాయి వాటిని వాడండి అన్న కేకఇంటి నుంచి వినిపించింది!(సశేషం)- బెలగాం భీమేశ్వరరావు 9989537835
July 23, 2020 • T. VEDANTA SURY • Memories