ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
69.పొట్టి వాడు గట్టి వాడే! (మొదటి భాగం): --కొత్త వలసలో పనిచేసిన కాలం తక్కువైనా అక్కడ ఉపాధ్యాయులతో విద్యార్థులతో అనుబంధంమరచి పోలేనిది! ఇద్దరు ప్రధానోపాధ్యాయులు దగ్గర పని చేశాను.ఒకరు శ్రీ శర్మ మాష్టారు. మరొకరు శ్రీ సత్యానందం మాష్టారు.సత్యానందంమాష్టారు నా చిన్ననాటి ప్రధానోపాధ్యాయులు.ప్రముఖ నటులు. సహ ఉపాధ్యాయుడిగా నాతో పని చేసే బెహరా చంద్రశేఖరరావు హైస్కూల్ సహాధ్యాయి! రెండే రెండు సంవత్సరాలు పని చేసినా అక్కడ పాఠశాల వాతావరణం అక్కడి విద్యార్థుల గురుభక్తి నేను మరిచిపోలేనివి.ఇప్పటికీ ఆ విద్యార్థులు ఎంతో గౌరవ భావంతో పలకరిస్తారు.ఆ పాఠశాల వాతావరణం తో కొన్ని సాంఘిక కథలు ఆ రోజుల్లో రాశాను.అక్కడ నుంచి 1985 లో జగన్నాథపురం పాఠశాలకు బదిలీ చేశారు. నేను వెళ్ళి నప్పుడు చెళ్ళపల్లి రాజ గోపాల రావు గారు ప్రధానోపాధ్యాయులు! ఆయన ప్రత్యేకత గణిత బోధన!అందులోకి సంఖ్యామానం,సంజ్ఞామానం చెప్పడంలో దిట్ట!విద్యార్ధికి ఆ మానాలు నేర్పడానికి సామ దాన భేద దండోపాయాలు వుపయోగించేవారు!ఆయన బదిలీ అయ్యాక ఓలేటి బుచ్చిబాబు గారు(వి.బి.ఎస్.కె.శర్మ)ప్రధానోపాధ్యాయులుగా వచ్చారు.ఆయన ప్రముఖ నాటక రంగ దర్శకులు!ఆ పై రచయిత కూడా!సినీ రచయిత గణేష్ పాత్రోకి సన్నిహితులు!ఆయన బోధన విచిత్రంగా ఉండేది. ప్రధానోపాధ్యాయుడైనా పెద్ద తరగతి తీసుకోలేదు. ఒకటవ తరగతి తీసుకున్నారు.ఆ చిన్నారి పిల్లలతో ఆడుకొనే వారనే చెప్ప వచ్చు.ఉదయంమధ్యాహ్నం ఇంటర్వెల్ వరకు నోటి పనే!పాటలు,పద్యాలు, మోనో ఏక్షన్లు ,ఏక పాత్రాభినయాలు... తరగతి స్థబ్దతగా ఉంచేవారుకాదు. పిల్లలకు అక్షరాలు నేర్పడానికి రెండో తరగతి మాష్టారు అధికారి సింహాచలం మాష్టారికిఅప్పజెప్పేవారు.ప్రధానోపాధ్యాయులు రెండో తరగతికి వెళ్ళేవారు.ఒకసారి ఆయన పిల్లలకు ఒక పొట్టోడి కథ చెప్పారు. కథ లోని పొట్టోడు ఆ ఊర్లో ఎవరూ ఓడించలేని ఒక పొరుగూరి వస్తాదును ఉపాయంతో ఓడించి ఊరి గౌరవం నిలుపుతాడు.ఎలా అది సాధ్యపడిందంటే ఆ బుడతడు వస్తాదుతో పోటీకి వెళ్ళినప్పుడు జేబుల్లో ముక్కుపొడుము పట్టుకు పోతాడు. మైదానం లోకి వెళ్ళిఒరేయ్ వస్తాదు నీకు దమ్ముంటే నా కెత్తుకోరా అనివస్తాదును రెచ్తగొడతాడు. వస్తాదు అమాంతంగా పొట్టోడు దగ్గరకు పరుగెత్తుకు వెళ్ళి ఎత్తుకుంటాడు.పొట్టోడు వెంటనే పిడికిళ్ళులో దాచిన ముక్కు పొడుము వస్తాదు ముక్కు లోకి కళ్ళలోకి విసురుతాడు.ఇంత వస్తాదు హతాశుడవుతాడు.ముక్కు వెంట తుమ్ములు... కళ్ళేమోమంటలు.ఏదీ ఆగలేదు. ఆ బాధ తట్టుకోలేక వస్తాదు పొట్టోడిని కింద పడేసి కూర్చుండి పోతాడు.అప్పుడు పొట్టోడు వస్తాదును నేల మీదకు తోసేస్తాడు.గెలుపు పొట్టోడిదే అని పెద్దలు ప్రకటిస్తారు.ఊరి పరువు నిలబెట్టాడని ప్రజలుజేజేలు కొట్టారు. మాష్టారు చెప్పే కథలో సాధ్యాసాధ్యాలు వదిలిస్తే పిల్లలు హాయిగా సరదాగా చప్పట్లు చరుస్తూ వినే కథ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆ కథా వస్తువు నాకునచ్చింది.అదే సమయంలో బాలజ్యోతి వారుఅనుబంధ నవలల పోటీ పెట్టారు. మరోకోణంలోఅంటే సాహస కోణంలో మరుగుజ్జు పాత్రను ఆధారంగా కథ తయారు చేసి అనుబంధ నవలలపోటీ కి పంపాలనుకున్నాను. అదే విషయం మిత్రులు సామవేది గారికి చెప్పాను.అడవి వర్ణనగుహ వర్ణన బాగుంటే మీరనుకున్న వజ్రాల గుహకథ బాగా రాగలదని శుభం పలికారు. కథ తయారు చేసే పనిలో పడ్డాను!(సశేషం)-- బెలగాం భీమేశ్వరరావు 9989537835
July 26, 2020 • T. VEDANTA SURY • Memories