ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
76. కాలమా నీ కొక నమస్కారం:--కాలం విలువ అమూల్యం. దానిని సద్వినియోగంచేసుకున్న వాడే విజేత. దుర్వినియోగం చేసుకున్న వాడు పరాజితుడు. విద్యార్థులు ఈ విషయం గ్రహించి మెలిగితే బంగారు భవిష్యత్తు వారి కోసం నిరీక్షించి వుంటుంది. అక్కున చేర్చుకొని అందలమెక్కిస్తుంది.అమాయకత్వం వల్లనో నిర్లక్ష్యం వల్లనో కాలం విలువను కాల రాసి విద్యార్థులు చదువుకు దూరంగా వుంటే వారి జీవితం చుక్కాని లేని నావే అవుతుంది. కౌమార దశ లోని పిల్లలు ఉన్నత విద్య నేర్చుకొనే పిల్లలు ఆ విలువను తెలుసుకోవాలనే లక్ష్యంగా కాలంవిలువ పేరుతో కథ రాశాను.కథ లోకి వెళ్తే...విజయనగరాన్ని రాజా ఆనంద గజపతి రాజ్యమేలుతున్న రోజులవి. అతడికి విద్యంటేమక్కువ. ప్రతి యేడాది అధిక మార్కులు తెచ్చుకున్న విద్యార్థిని ఎంపిక చేసి ఉన్నత విద్యకు విదేశాలకు పంపేవాడు.అలాంటి అవకాశం అందిపుచ్చుకోడానికి జయసూర్య అనే విద్యార్థి సిద్ధంగాఉన్నాడు. ఒక రోజు జయసూర్య ఇంటికి నాగరాజు అనే వ్యక్తి వస్తాడు. జయసూర్య తల్లి వర్ధనమ్మతో అతడు "అమ్మా ! జయసూర్య వంటి తెలివైన అబ్బాయిని కన్నందుకు మీకు అభినందనలు" అని, పక్కనే చదువుకుంటున్న జయసూర్య తో"వచ్చే ఆదివారం పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం.నీవు వచ్చి పుస్తక ప్రయోజనాలు గురించి ఉపన్యాసమివ్వాలి" అని కోరేడు.జయసూర్య తల్లి వైపు చూశాడు. వర్ధనమ్మ తటాపటాయిస్తుంటే నాగరాజు చొరవ తీసుకుని "అమ్మా ఒక గంట పని.మీరు కాదనరాదు."అని నచ్చజెప్పి ఆమెచే సరే అనిపించుకున్నాడు. ఆదివారం వచ్చింది. జయసూర్య తరగతి పుస్తకాలు తీయలేదు.సాయంత్రం ఇవ్వబోయే ఉపన్యాసం గురించి ఆలోచిస్తూ కూర్చుండి పోయాడు.సాయంత్రమయింది. పుస్తక ప్రదర్శనకు వెళ్ళాడు. అక్కడ నాగరాజు జయసూర్య ను వచ్చే యేడాది విదేశీ విద్యకు వెళ్ళబోతున్న విద్యార్థిగా పరిచయం చేశాడు.అందరూ మెచ్చుకుంటుంటే జయసూర్య ఎంతో సరదాపడ్డాడు.ఆ రోజు జయసూర్య ఇచ్చిన ఉపన్యాసంఅందరినీ ఆకట్టుకుంది. జయసూర్య ఇంటికిబయలుదేరుతుండగా నాగరాజు చలపతి అనేవ్యక్తిని పరిచయం చేశాడు. చలపతి పేరు పడ్డచదరంగం ఆటగాడు. అతడు జయసూర్య తో"చదరంగం ఆట మీ లాంటి వారి మెదడుకుపదునుపెడుతుంది.విదేశాల్లో చదరంగం మీదమోజు చూపుతారు. మీరెలాగూ విదేశాలకువెళ్ళబోతున్నారు.మా ఇంటికి వచ్చి నేర్చుకోండి."అని కోరాడు.జయసూర్య సందేహిస్తుంటే నాగరాజు ఔననిపించాడు.ఇంటికి ఆ రోజు ఆలస్యంగా చేరాడు జయసూర్య. వర్థనమ్మ ఆందోళన పడింది.రోజూ జయసూర్య నాగరాజుచలపతి లు కలుస్తున్నారు. చదరంగం ఆడుతున్నారు.రోజూ సాయంత్రం ఆలస్యంగావస్తున్న కొడుకును చూసి వర్ధనమ్మ కీడు శంకించింది.కొడుకుతో " కాలం చాలా విలువ కలది.గడిచిన కాలాన్ని మనం తీసుకురాలేం.నీ దృష్టిని కేవలం చదువు మీద పెడితేనే ఈ యేడాదిప్రథముడిగా రాగలవు.విదేశీ చదువుకు అర్హతపొందగలవు.ఆ అర్హత ఇప్పుడు సాధించక పోయావా మరి జీవితంలో ఆ అవకాశం రాదు.నాన్న పోయాక నా ఆశలన్నీ నీ మీదే పెట్టుకున్నాను." హెచ్చరించినట్లు మాట్లాడింది.జయసూర్య కు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తెల్లవారేకపుస్తకాలు తీశాడు కాని చదువర్థం కాలేదు.చలపతి తో మాట్లాడితే మనసు తేలిక పడుతుందనుకున్నాడు.పాఠశాలకు వెళ్ళేటప్పుడుఒక గంట ముందు బయలుదేరి చలపతి ఇంటికివెళ్ళాడు. మెట్లెక్కుతున్న జయసూర్యకు చలపతినాగరాజు ల సంభాషణ చెవిన పడింది." మనమింకా జయసూర్య సమయాన్ని వృధాచెయ్యాలి. చదువు మీద అతడి దృష్టి ని తగ్గించాలి.అప్పుడే మార్కులు తెచ్చుకోవడం లో మన కోశాధికారి కొడుకు మొదటి స్థానాన్ని దక్కించుకోగలడు.విదేశీ విద్య అవకాశం చేజిక్కించుకోగలడు.అది జరిగితే మనకు కచేరీలో ఉద్యోగాలు ఖాయం.కోశాధికారి మాట తప్పడు."నాగరాజు చలపతితో అన్నాడు.జయసూర్య కుతల తిరిగి నంత పనయింది.ఇలాంటి వారి మాయలో పడ్డానా అనుకున్నాడు. రాత్రి తల్లి చేసిన హితబోధ గుర్తుకొచ్చింది.కాలం వృధా చేయను అనే దృఢ దీక్షతో జయసూర్య పాఠశాల వైపు అడుగులు వేశాడు. ఈ కథ 1992 ఏప్రిల్ బాలజ్యోతి లో వచ్చింది.(సశేషం)-బెలగాం భీమేశ్వరరావు9989537835
August 1, 2020 • T. VEDANTA SURY • Memories