ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
77. తొలి సాహిత్య పురస్కారం:--దసరా సెలవులిచ్చారు.ఒక రోజు పోస్ట్ మేన్ ఒక ఎన్వలప్ కవరిచ్చారు.ఫ్రం అడ్రస్ చూశాను. విజ్ఞాన వివర్ధిని పరిషత్, బొబ్బిలి స్టాంప్ వేసి ఉంది. ఆ స్టాంప్ పై భాగంలో సామవేదుల రామ గోపాల శాస్త్రి అని ఇంకు పెన్నుతో రాసిన పేరుంది.సంస్థ వారు ఆహ్వాన పత్రం పంపి వుంటారని కవరు తెరిచి చూశాను.ఆహ్వాన పత్రం కాదది.అది సాహితీ పురస్కారానికి ఎంపికైనట్లు తెలియపరిచే లేఖ. కిందన సంస్థ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్.వి.ఆర్. సత్యనారాయణ మూర్తి గారి సంతకముంది.ఒక్క క్షణం నాకేమీ అర్థం కాలేదు.ఒకటికి రెండు సార్లు చదివాను. పురస్కారం నాకే ప్రకటించారని నిర్ధారణ చేసుకున్నాను.చాలా ఆనందం కలిగింది. అంగీకారాన్ని తెలుపుతూ లేఖ రాయమని ఆ లేఖలో వుంది. మర్నాడే సంస్థ వారికి లేఖ రాశాను.దసరా సెలవులయిపోయాయి.నేనప్పుడు జగన్నాధపురం పాఠశాలలో పనిచేస్తున్నాను.తరగతి లో పాఠం చెబుతూండగా మా ప్రధానోపాధ్యాయులు శ్రీ ఓలేటి గుంపస్వామి గారు ఒకాయనను నా తరగతికి తీసుకువచ్చారు.ఖద్దరు లాల్చీ, పంచె కట్టుతో ఆయనున్నారు.చూడగానే పుంభావ సరస్వతి లా కనిపించారు. అప్రయత్నంగా రెండు చేతులు జోడించి నమస్కరించాను. ఆయనెవరో నాకు తెలియదు.నమస్కారం చెయ్యాలనిపించింది చేశాను.అప్పుడు మా హెడ్మాష్టారు "బొబ్బిలి నుంచి మీ కోసం వచ్చారు. సామవేదుల రామ గోపాల శాస్త్రి గారట" అని పరిచయం చేశారు. అంత పెద్దాయన నా కోసం వచ్చేసరికి దిగ్భ్రాంతి చెందాను. మరోసారి నమస్కారం చేశాను.ఇదే మిమ్మల్ని చూడడం అని మాత్రమే అనగలిగాను.అంతకు మించి నోట మాట రాలేదు.ఆయన చిరునవ్వు నవ్వుతూ "మా విజ్ఞాన వివర్ధిని సంస్థ వారు ఈ యేడాది పురస్కారానికి మిమ్మల్ని ఎంపిక చేశారు.పురస్కార ప్రదానోత్సవం అక్టోబర్ 29. మీరు, మీ ఉపాధ్యాయబృందం, పార్వతీపుర మిత్ర బృందం రండి.లేఖ ద్వారా మీకు తెలియపరిచినా స్వయంగా ఆహ్వానించడం మా సంప్రదాయం. అందుకే బొబ్బిలి నుంచి వచ్చాను."అని నా చేతికి కొన్ని ఆహ్వాన పత్రాలందించారు.కూర్చోమని చెప్పినా ఆయన కూర్చోలేదు.సూర్యపీఠం ఇప్పుడు వెళ్ళాలి అని చెప్పి వెంటనే బయలుదేరిపోయారు.మొదటి సాహిత్య పురస్కారం ఆనంద దాయకం.మిత్రులకు ఆహ్వానపత్రాలిచ్చి పురస్కార సభకు రమ్మన్నాను.ఆ నెల 29 వ తేదీన నాగులు చవితి పడింది. అయినా బంధు మిత్రులు మా సోదరులు ఆ సాయంత్రం సభకు వచ్చారు.నాతో మా అబ్బాయి ప్రదీప్ బొబ్బిలి వచ్చాడు.ఆనాటి సభ బొబ్బిలి కాలేజీ ప్రిన్సిపాల్శ్రీ చెలికాని చెల్లారావు అధ్యక్షతన జరగలసి వుందికాని ఆయన అనివార్య కారణాల వల్ల గ్రామాంతరం వెళ్ళవలసి వచ్చింది. నా అదృష్ట మేమో ఆ రోజు ప్రముఖ కథారచయిత శ్రీ చాగంటి సోమయాజులు(చాసో)గారు బొబ్బిలి లో ఉన్నారు.సభాధ్యక్షులు గా ఆయనను సంస్థ నిర్వాహకులు కూర్చుండబెట్టారు.ముఖ్య అతిథిగా ప్రముఖ సాహిత్య విమర్శకులు శ్రీ కోడూరుశ్రీరామమూర్తి గారు వచ్చారు. సభలో వక్తలు చాసో గారిని కథాచక్రవర్తి అని సంబోధిస్తే ఆయన ఏ చక్రవర్తి నీ కాను నేను కేవలం మాటలు పేర్చే మాటల మేస్త్రీని అని చాలా నిరాడంబరంగా తనను గూర్చి చెప్పుకున్నారు.అంతటి నిగర్వి ఆయన. కోడూరు వారు బాలసాహిత్యం రాయడానికి చక్కని సూచనలిచ్చారు. ఉపన్యాసాలనంతరం వేద మంత్రాల మధ్య ఆ యేడాదిపురస్కారాలకు ఎంపిక చేసిన శ్రీమతి కందాళ తాయారమ్మగారిని స్వర్గీయ సామవేదుల వేంకట రత్నం పేరున పురస్కారదాతలు నాగపూర్ వాస్తవ్యులు శ్రీఅవధానుల జగన్నాధరావు శ్రీ మతి విజయలక్ష్మి దంపతులు పురస్కార మందజేశారు. ఆ తరువాతస్వాతంత్ర్య సమరయోధులు శ్రీ అయ్యగారి నారాయణ మూర్తి గారి పేరున న్యూయార్క్ వాస్తవ్యులు పురస్కారదాతలు శ్రీ కే.శ్రీనివాస్ శ్రీమతి వసుంధర దంపతులు నాకు పురస్కారమందించారు.బ్రహ్మశ్రీ సామవేదుల రామ గోపాల శాస్త్రి గారు వేద వచనాలతో ఆశీర్వదించారు. నా సాహిత్య ప్రయాణంలో ఆ పురస్కారమే తొలి పురస్కారం!ఆ రోజువేసిన శాలువానే మొదటి శాలువ! సంస్థ ప్రధానకార్యదర్శి శ్రీ ఎన్.వి.ఆర్.సత్యనారాయణ మూర్తిగారు పుట్టపర్తి వెళ్ళడం వల్ల ఆరోజు సభలో లేకపోవడం చాలా లోటనిపించింది.సభ అయ్యాక అందరం బొబ్బిలి నుంచి తిరుగుప్రయాణమయ్యాం.(సశేషం) బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 2, 2020 • T. VEDANTA SURY • Memories