ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
78. వినదగు నెవ్వరు చెప్పిన...1992 అక్టోబరు 29న బొబ్బిలి విజ్ఞాన వివర్ధిని వారి సాహితీపురస్కార మందుకున్నాక స్థానికంగా మిత్రసాహితి , సాహితీలహరి సంస్థలు అభినందన సభలేర్పాటు చేశాయి.డిశంబరు 31 న అరకులోయ రైల్వే ఉద్యోగుల ఆధ్వర్యంలో నడపబడుచుండే ఒక నాటక సంస్థ వారు అభినందనసభ ఏర్పాటు చేసి ఆహ్వానించారు.అక్కడకు వెళ్ళాను.చాలా ఘనంగా సభ ఏర్పాట్లు చేశారు. సభయ్యాక అక్కడే పనిచేస్తున్న మా బావమరిది చంద్రమౌళీశ్వరరావు గారింట ఆ రాత్రి వుండి మర్నాడు పార్వతీపురం బయలుదేరాను.అభినందన సభలో వేసిన సంపెంగి పూలదండమా బావమరిది గారింట్లో ఉంచేయాలనుకున్నాను.కాని ఆయన మా చెల్లి సరదాపడుతుంది పార్వతీపురం తీసుకువెళ్ళండని చెప్పారు. మధ్యాహ్నానికి పార్వతీపురం చేరుకున్నాను.సాయంత్రం మా ఫేమలీ డాక్టర్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి హాస్పిటల్ కి వెళ్ళాను.ఇంటికి తిరిగి వచ్చేసరికి మా ఆవిడ ముఖం బాగు లేదు.ఏమయిందని అడిగాను.చిన్న వయస్సులో సన్మానాలు,సత్కారాలు మంచివికావని ఎవరో ఇంటికి వచ్చి మరీ చెప్పారట! దండ చూసి మరీ అన్నారట! ఆ మాట విని భయపడిపోయింది. ఎవరలా అన్నారని అడిగి తెలుసుకున్నాను. వినదగు నెవ్వరు చెప్పిన పద్యం గుర్తుకొచ్చింది. అప్పటికి చిన్న వయస్సు నాది కాదు.నలబై దాటింది.అయినా మనసులో ఏదో తెలియని సంశయం.వెంటనే మాకు దగ్గర వీధిలోనే వుంటున్న శ్రీ కూర్మాపు నారాయణ మూర్తి మాష్టారు దగ్గర కెళ్ళాను.ఆ ఇంటి పిల్లలకు నేను ట్యూషన్ టీచర్ని.నన్ను చూసి మాష్టారు ఈరోజు మీరు రారని పిల్లలు సినిమాకి వెళ్ళారు మాష్టారూ అని అన్నారు. ట్యూషన్ చెప్పడానికి నేను రాలేదండి.చిన్న సందేహం తీరుస్తారని వచ్చానన్నాను.ఆయన స్వాతంత్ర్య పోరాట యోధులు. టీచరుగా రిటైరయ్యి అప్పటికి 15 సంవత్సరాలయింది.నా మాటలన్నీ విన్నారు. లోకం సంగతి మీకు తెలియదా ఓర్వలేని తనంకొందరి సహజ గుణం.ఇలాంటి మాటలతో బెదర గొట్టడం వాళ్ళకు ఆనందం. అవేవీ పట్టించుకోకండి.మీకు జరిగిన సత్కారం మీలో ఉన్న ప్రతిభకు మాత్రమే. మీకు కాదు. దండ వేసి గౌరవించడం శాలువాతో సత్కరించటం మన భారతీయ సంప్రదాయం. మరొక విషయం చెబుతాను వినండి. ఇతరులకు చేసిన గౌరవాలు చూసి మరికొంతమంది ప్రతిభావంతులు తయారవుతారని మన పెద్దలు ఈ ఆచారం పెట్టారు. మా అమ్మాయికి మనసులో ఇదేమి పెట్టుకోవద్దని చెప్పండి అని నా సందేహంతీర్చారు. ఇంటికొచ్చి మాష్టారు చెప్పినదంతా చెప్పాను.నేనేమీ అయిపోను నేను రాయవలసిన కథలు చాలా వున్నాయి భయపడకు అని ఆమెకుధైర్యం చెప్పాను.(సశేషం)బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 3, 2020 • T. VEDANTA SURY • Memories