ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
79.బాలగేయాల వైపు మనసు మళ్ళింది: ఏకంగా కథలలో పడిపోయిన నాకు పాఠశాలలోని చిన్న తరగతుల పిల్లలు బాలగేయాలను గుర్తు చేశారు. కొన్నైనా కొత్తవి తయారు చెయ్యాలను కున్నాను.బాలసాహిత్యం లో చిలక ఊసు పట్టకుండా ఉండే కవి గాని రచయిత గాని ఉండరేమో!మరి నా మొదటి గేయాన్ని రాయించినది చిలకే కదా.మరొక కోణంలోచిలక గురించి ఆలోచించాను.పిల్లలు సరదాగా చిలుకను పిలిచి దానితో మాట్లాడేటట్టు పాట రాశాను. రామచిలుకా అని పేరు పెట్టాను.పాటలోకి వెళ్దామా మరి!//రావే రావే రామచిలుకా/ తోటకు పోదాం రామచిలుకా/తియ్యని పళ్ళూ రామచిలుకా/కొరికీ ఇవ్వవె రామచిలుకా/ఎక్కువఇవ్వవె రామచిలుకా/అమ్మకు ఇస్తా రామచిలుకా/అమ్మకు ఇస్తే రామచిలుకా/లడ్డూ ఇచ్చును రామచిలుకా/లడ్డూ ఇస్తే రామచిలుకా/నీకే ఇస్తా రామచిలుకా//ఈ గేయం లో 4+4+3+4 మాత్రలతో పాదాలున్నాయి.అందుకే లయ కుదర గలిగింది. ఈ గేయం ఆంధ్ర ప్రభ వారపత్రిక జనవరి 20 - 26 , 1993 లో వచ్చింది. మార్చి1993 తెలుగు విద్యార్థి పత్రిక లో జ్ఞానేంద్రియాలుఅనే అభినయగీతం వచ్చింది. ఒకరోజు వెన్నెల మీద గేయం తయారు చేయాలనుకున్నాను.మాదలంగి ఊర్లో కలిగిన వెన్నెల అనుభవాలను నెమరువేసుకొని గేయంతయారు చేశాను.మనసు పాడిన పాట అని పేరు పెట్టాను.బాలజ్యోతి పత్రికలో ఆ పాట వచ్చింది. వెన్నెల మత్తు ఆవహించిందేమోగేయానికి పేరివ్వడం మర్చిపోయారు.ఇక ఆ గేయం లోకి వెళ్దామా ... వెన్నెల లో తడిసి పోదామా...//ఇసుక తిన్నెల మీద/యేటి జలములలోన/ఆటలాడగ రండి/పాట పాడగ రండి// పూల తోటల మధ్య/గున్న మామిడి క్రింద/ఆటలాడగ రండి/పాట పాడగ రండి//వెన్న ముద్దలవర్షం/వెండి మబ్బుల దృశ్యం/మనసు పాడునుపాట/వయసు ఆడును ఆట//పొన్న పువ్వుల అందం/చల్ల గాలుల చందం/మనసు పాడునుపాట/వయసు ఆడును ఆట// పాటకు మంచిరంగుల చిత్రం పత్రిక వారు వేశారు. ఆడపిల్లలుమగపిల్లలు చేతులు కలిపి వెన్నెల్లో ఆడుకుంటున్నచిత్రమది. 3 + 4 + 3 మాత్రా ఛందస్సుతో రాయడం వల్ల లయాన్వితంగా గేయం కుదిరింది.ప్రచురణ బాలజ్యోతి మే 1993. 1వ తరగతిపిల్లల కోసం అల్లరి ఎలుకలు గేయం రాశాను.//పొరుగు యింటి ఎలుకలన్ని /ఇంటికొచ్చాయి/ఇంటి కొచ్చి అవి అన్నీ/చిందులేశాయి/దాచుంచిన సరుకులన్ని/ పాడు చేశాయి/నాన్న గారి కాగితాలు/కొరికి వేశాయి/అమ్మ చేసిన లడ్డూలు/మెక్కి వేశాయి/ఎదురింటి నల్లపిల్లిని/తెచ్చి వదిలాము/పిల్లి దుముక ఎలుకలన్ని/మాయమయ్యాయి// ఈ గేయం లో ఎలుకలుచేసే అల్లరి విని పిల్లలిష్టపడతారు.ఇలాంటి గేయాలు 1993 లో మరికొన్ని రాయడం జరిగింది.(సశేషం) బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 4, 2020 • T. VEDANTA SURY • Memories