ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
84.మన స్థాయి తెలిసి మసలాలి:--గొప్పవారిని చులకన చేసి మాట్లాడడం కొందరికి గొప్ప ఆనందం. నా ముందు వారెంత అని విర్రవీగి వినోదపడుతుంటారు.నా గొప్ప ముందు ఎవరి గొప్ప కూడా దిగదుడుపే అని ఆత్మానందంపొందుతారు. అందరి వద్ద వారిని తూలనాడి తమనుతాము గొప్పగా చిత్రించుకోడానికి నానాతంటాలు పడుతుంటారు.ఇలాంటి వారికి అన్ని వేళలు ఒకేలా వుండవు. ఎప్పుడో ఒకసారి వారుభంగపడక తప్పదు.అంతవరకు మనం మౌనంగావారి అతిశయోక్తులు వినవలిసిందే! అటువంటివింత మనస్తత్వం ఆవిష్కరించే కథే ఈగ గర్వభంగం!కథలోకి సంక్షిప్తంగా వెళ్తే... పూర్వం దండకారణ్యంలో అమృతకాసార మనే ఒక సరస్సుండేది.ఆ సరస్సులో మధుర జలాలు తాగడానికి రకరకాల జంతువులు, పక్షులు వస్తుండేవి.ఆ ప్రాంతం లోనే ఒక ఈగ ఉండేది.అది చాలా గర్విష్టిది.ఒకరోజు సరస్సుకు వచ్చినఒక కుందేలుతో "నేను గొప్ప దానిని. ఏ జంతువునైనా కుట్టి బాధించగలను.ఒకసారి ఏనుగు కంటినేకుట్టి ఆ కొండంత ఏనుగును హడలెత్తించాను.అందువల్ల నీవు నన్ను గౌరవించాలి.నేను కనిపించగానే నమస్కారం చేయడం అలవాటు చేసుకో"అని అంది.కుందేలు వెంటనే "అమ్మకు నమస్కరిస్తాను.నాన్నకు నమస్కరిస్తాను.ఇతరులను బాధించి ఆనందించే నిన్ను మాత్రం నమస్కరించను." అని అక్కడి నుంచి తుర్రున పారిపోయింది.ఈగ కోపంతో కుతకుతలాడిపోయింది.మర్నాడు కుందేలుకుఈగ మళ్లీ ఎదురయింది." నేను గొప్ప దానిని.మృగరాజు కూడా నాకెక్కువ కాదు.అది తినబోయేఆహారం ఎంగిలి చేయగలను.నేను ఎంగిలి చేసిన ఆహారం అంత గొప్ప మృగరాజు తింటుంది.అది నా గొప్ప కదా.అందుకే నేను కనిపించగానే నమస్కారం చెయ్యాలి"అని అంది.కుందేలు అంతకు ముందు లాగే "అమ్మకు నమస్కరిస్తాను.నాన్నకు నమస్కరిస్తాను. కాని నీ వంటి నీచునకునమస్కరించను."అని సమాధానమిచ్చి పారిపోయింది. మూడో రోజు కూడా కుందేలుకుఈగ కనిపించింది. ఈసారి అది కుందేలుతో "నేను క్రూర మృగాల మధ్య కూడాతిరగ గలను.ఒకసారి పులుల గుంపు లోకి వెళ్ళాను.పులిరాజు చెవిలో దూరి నానా అల్లరిచేశాను.అంత గొప్ప పులి నా ధాటికి తట్టుకోలేకఅడవి దద్దరిల్లినట్టు బాధతో గాండ్రు పెట్టింది.అందువల్ల నా గొప్పతనం అంగీకరించి నాకు నమస్కరించు."అని అంది.కుందేలు ఈగ మాటలకు విలువి వ్వలేదు."నీవెన్ని చెప్పు నీవుఅల్పుడివి.నీ బుద్ధి నీచమైనది." కుచ్చుతోక ఆడించుకుంటూ పారిపోయింది కుందేలు.ఇలా ప్రతి రోజు ఈగకు కుందేలుకు వాదన జరుగుతోంది. ఒకరోజు కుందేలుకు ఒక జింకతోస్నేహం కుదిరింది. ఈగ గురించి అంతా చెప్పింది. జింక ఈగ పోరు లేకుండా చెయ్యడానికి కుందేలుకు ఒక ఉపాయం చెప్పింది. మర్నాడు కుందేలు ముందు ఈగ వాలింది. హిహిహి అంటూపాత పాటే పాడింది.అప్పుడు కుందేలు " రోజూ వాదనలెందుకు? నేను పరుగెత్తగలను.నువ్వు ఎగర గలవు.మనలో ఎవరు గెలిస్తే వారు అవతలివారికి నమస్కరించాలి." అని జింక చెప్పినట్టుపందెం పెట్టింది. ఈగ సరేనంది.దూరంగా వున్నమర్రిచెట్టునుచేరాలి. కుందేలు చెంగు చెంగునదుముకుతూ పరుగుతీసింది.తుప్పలు, డొంకలుఅవలీలగా దాటిపోతుంది.ఈగకు తనదే గెలుపని నమ్మకం. గర్వంతో కళ్ళు నెత్తి కెక్కాయి.ముందున్నది చూడలేదు.జుయ్ అంటూ ఎగురుతూ ఒక సాలెగూడులో చిక్కుకుని గిజ గిజ లాడసాగింది. కుందేలది చూసింది. ఆగి " ఏనుగుకన్నునే కుట్టావు? సింహం ఆహారాన్నే ఎంగిలి చేయగలిగావు?పులి చెవిలో దూరి హడలెత్తించావు?అంత గొప్పదానివి ప్రాణం లేనిసాలెగూడుకు భయపడుతున్నావేమి?"అనిఅడిగింది. కుందేలు తనను పందేనికి రెచ్చగొట్టిఎందుకు ఆ దారిన తెచ్చిందో ఈగకు అర్థమయింది. సాలీడు దాడి చేస్తే తన పని సరిఅనుకుంది. కుందేలుతో కాళ్ళ బేరానికి దిగింది." నన్ను క్షమించు.నా గొప్పతనం ఏపాటిదోఅర్థమయింది. ఈ సాలెగూడు నుంచి నన్ను రక్షించు."అని వేడుకుంది.కుందేలు కుచ్చుతోకతో సాలెగూడును కొట్టింది. ఈగ గూడు నుంచి తప్పు కొంది.అప్పటి నుంచి ఈగ కుందేలు కనిపించగానే నమస్కారం చెయ్యడం ఆరంభించింది.కుందేలు వద్దన్నా నమస్కారం చెయ్యడం మానలేదు ఈగ! ఈ కథ ఆంధ్రప్రభ లోబాలప్రభ శీర్షికన 1993 ఆగస్టు 22 న వచ్చింది.(సశేషం) బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 8, 2020 • T. VEDANTA SURY • Memories