ALL Story Talent Poem Videos Memories Quotations Book Review health tips News Serial
89.దురాశ పనికి రాదు:--1996 సెప్టెంబరు 17 న ఇండియన్ సొసైటీ ఆఫ్ఆథర్స్ , న్యూ ఢిల్లీ వారు హైదరాబాద్ లోని ఆంధ్ర మహిళాసభ కాలేజీ కేంపస్ లో నిర్వహిస్తున్న సెమినార్ కమ్ వర్క్ షాప్ కు ఆహ్వానించారు.ఆ వర్క్ షాప్ లో గ్రామీణ పిల్లల కోసం నూతన వయోజన అక్షరాస్యుల కోసం పుస్తకాలు తయారీ పై శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.ఆ సమయంలో మా బావమర్ది మధుసూధన గారు వరంగల్ జిల్లా లోని ములుగులో పని చేస్తున్నారు.హైదరాబాద్ వెళ్ళేటప్పుడు ములుగు రండి.చుట్టుపక్కల ప్రాంతాలు చూద్దురని ఉత్తరంరాశారు. అలాగే వెళ్ళాను.ములుగు వెళ్లిన మర్నాడు మధుసూధన గారు నేను కలసి రామప్పగుడి,రామప్ప చెరువు, వేయి స్థంభాల మండపం,ఓరుగల్లు కోట చూశాం.ఓరుగల్లు కోట చూస్తున్నప్పుడు ఒక ముసలామె ఆ కోట ప్రాంతంలో ఎప్పుడో జరిగిన ఒక సంఘటన చెప్పింది. ఆమె చెప్పిన సంఘటనఆధారంగా చేసుకొని ఒక కథ తయారు చేశాను.కథకు పేరు ప్రాణం తీసిన దురాశ అని పెట్టాను. సంక్షిప్తంగా కథ ఏమంటే... కృష్ణరాయపురానికి రెండు మైళ్ళ దూరాన ఒక పాడుబడ్డ కోట వుంది.ఆరేడు శతాబ్దాల కిందట కోటది.రాజయ్య మేకలకాపరి.ఒక రోజు మేకలను కోటకు తోలుకు వెళ్ళాడు. మేకలు పచ్చి రొడ్డ మేస్తూ వుంటే రాజయ్య ఒక మర్రిచెట్టు నీడన చేరి ఊసుపోక అక్కడున్న కుండ పెంకు తో మట్టి తవ్వడం ఆరంభించాడు.అలా తవ్వుతుంటే ఒక రాతిపలకఅడ్డు వచ్చింది. తుళ్ళి పడ్డాడు.పలక పై కొట్టాడు.లోపల గుల్లనిపించింది.నిధి గాని ఉందా అనుకున్నాడు.అంతలో పశుల కాపర్ల అలికిడికావడంతో ఎప్పటిలా మట్టి కప్పేసి అందరితో పాటు ఊర్లోకి వెళ్లి పోయాడు.ఇంటికి చేరి భార్యతోజరిగింది చెప్పాడు.ఆమె ఆ మాటలు నమ్మలేదు.నిధీ లేదు గిధీ లేదు భోంచేసి హాయిగా పడుకో అనిరాజయ్య తో అంది.రాజయ్య భోజనమయ్యాక నాయుడు గారింటికి వెళ్ళొస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. ఒక దీపం బుడ్డీ చిన్నపలుగూ పట్టుకున్నాడు. ఆ రాత్రి వేళ కోటకు చేరుకున్నాడు.దీపం వెలిగించి రాతి పలక మీద మట్టి తీశాడు. పలకను పక్కకు నప్పి చేయి దూర్చాడు. చేతికి నాణేలు తగిలాయి.బయటకుతీసి దీపం వెలుగులో చూశాడు. బంగారం, వెండినాణేలు కలగలిపి వున్నాయి. అందినంతవరకునాణేలు తీసి మీద కప్పుకున్న కంబలిలో మూటచుట్టాడు.సొరంగంలో ఇంకేముందో చూడాలనిదీపం పెట్టి చూశాడు. కళ్ళు జిగేలుమన్నాయి.లోపల రత్న రాశి వుంది. గబగబా పైకప్పు మూసిఇంటికి వచ్చాడు.భార్యకు నాణేలు చూపించాడు.ఆమె గజగజ వణికిపోయింది. తెల్లవారి గ్రామాధికా‌రికి ఈ నిధి విషయం చెప్పేద్దామంది.రాజయ్య సరే అన్నాడు కాని అతడి మనసునిండ రత్న రాశే! భార్య నిద్ర పోయాక మళ్లీ కోటకు బయలు దేరాడు. సంపద మీద ఆశ వల్ల రాత్రిభయం పోయింది. రత్నరాశి కొంతైనా తెచ్చి ఇంట్లోపాతిపెట్టాలని అతడి ఆరాటం! కోటకు చేరి రాతిపలకను పక్కకు కదిపాడు.తలదూర్చగలిగే సందు ఏర్పడింది. రత్నరాశి ఎంతుందో చూద్దామని సొరంగం లోకి తల దూర్చి చూశాడు.రత్నరాశే కాదు వజ్రాలు కూడా కనిపించాయి.ఆనందం తో అరవబోయాడు.ఊపిరి తీయడం కష్టమనిపించింది.తల బయటకు తీయబోయాడు.రాలేదు. గుండె గతుక్కుమంది. మళ్ళీ ప్రయత్నించాడు.తల బయటకు రాలేదు.అతడిమనసులో మరి వజ్రాలు లేవు.రత్నాలు లేవు.భార్యాబిడ్డలు గుర్తుకొచ్చారు.తల బయటకు తీసేప్రయత్నం లోనే అతడు నిర్జీవుడయ్యాడు...ఇదీకథ.ఈ కథ 1997 ఆగస్టు బాలజ్యోతి లో వచ్చింది.(సశేషం)బెలగాం భీమేశ్వరరావు 9989537835
August 12, 2020 • T. VEDANTA SURY • Memories