*ఇదేమి సావురా దేవుడా ....* నవ్వుల్లో ముంచెత్తే జానపద హాస్య కథ... *డా.ఎం.హరికిషన్- కర్నూలు-9441032212* ************************* ఒకూర్లో వీరయ్య అని ఒకడుండేటోడు. ఆయన ఎంత మెతకో ఆయన పెండ్లాం అంత గయ్యాళి. చీటికి మాటికి గొడవ పడతా కప్పెగిరి పోయేలా అరుస్తా వుండేది. ప్రతిదానికి నోటికొచ్చినట్టల్లా తిడతా వుండేది. ఇట్లా చానాకాలం సాగిపోయింది. రోజూ చిన్న చిన్న దాండ్లకే గొడవలవుతా వుండడంతో విసిగిపోయిన వీరయ్య ఈ సంసారం కన్నా సన్యాసం మేలని నిశ్చయించుకున్నాడు. దాంతో ఒకరోజు ఎవరికీ చెప్పా పెట్టకుండా దూరంగా వున్న ఒక నగరానికి పోయి సన్యాసుల గుంపులో చేరిపోయినాడు. వాళ్ళతోబాటు నున్నగా గుండు కొట్టిచ్చుకోని, తంబూర మీటతా, చిరుతలు వాయిస్తా వాళ్ళు పాడే పాటలన్నీ తానూ నేర్చుకున్నాడు. నెమ్మదిగా చేతిలో వున్న డబ్బులన్నీ అయిపోయినాయి. సన్యాసన్నాక డబ్బులెందుకు. ఓ నాలుగిండ్ల ముందు నిలబడితే చాలు. ఎవరో ఒకరు ఏదో ఒకటి వేస్తారు. అది తింటా దేవున్ని తలచుకుంటా గుళ్ళూగోపురాలు తిరగడమే గదా... అనుకోని ఆరోజు నుంచి భిక్షాటన మొదలు పెట్టాలి అనుకున్నాడు. కొంచం చీకటి పన్నాక ఒక ఇంటిముందు నిలబడి ''చేరుకొంటివా శ్రీరామచంద్రా... జనకుని ఇండ్లు చేరుకొంటివా'' అని సంబరంగా పాట పాడడం మొదలుపెట్టినాడు. ఆ ఇంటి ముందు ఒక ఇరవైయేండ్ల యువకుడు పండుకోని వున్నాడు. వారం కిందట వాళ్ళ అమ్మా నాయనలతో కొట్లాడి ఇండ్లు వదిలి వెళ్ళిపోయినాడు. వాళ్ళు గూడా పోతే పోనీలే... బుద్ధి వస్తాది వెధవకి... సంపాదించి పెడ్తావుంటే తిని అరగక మనకే ఎదురు తిరుగుతా వున్నాడని ఏ మాత్రం పట్టించుకోలేదు. వాడు ఆడా ఈడా తిరిగి తినడానికి తిండిలేక, పడుకోడానికి ఇండ్లు లేక, చేతిలో దుడ్లు లేక నానా అవస్థలు పడి అప్పుడే ఇంటికి తిరిగి వచ్చినాడు. కానీ అమ్మానాయనలకు ముఖం చూపించడానికి సిగ్గేసి ఇంటి ముందే అరుగు మీద పండుకున్నాడు. ఆ పిల్లోని పేరు రామచంద్రుడు. వీరయ్య సరిగ్గా వాని ఇంటి ముందే నిలబడి ''చేరుకొంటివా శ్రీరామచంద్రా... జనకుని ఇండ్లు చేరుకొంటివా'' అని నవ్వుతా పాట పాడతా వుంటే అది విని వానికి ఒళ్ళు మండిపోయింది. ఈ సన్యాసి నన్ను చూసే ఎగతాళి చేస్తా వున్నాడనుకోని ''ఏంరా.... ఒళ్ళుగాని కొవ్వెక్కిందా... నా జనకుని ఇల్లు. నా ఇష్టం. చేరుకుంటే చేరుకుంటా, లేకపోతే వదిలేసి పోతా.... మధ్యలో నీకెందుకు. అడుక్కునేటోనివి అడుక్కోని మట్టసంగా పోకుండా'' అంటా కోపంతో పక్కనే వున్న కట్టె తీసుకొని రపరపరప నాలుగు పెరికినాడు. ఆ దెబ్బలకు కుయ్యో మొర్రో అనుకుంటా వీరయ్య అక్కన్నించి పారిపోయి సత్రానికి చేరుకున్నాడు. రాత్రంతా ఆ దెబ్బలనే తలచుకుంటా ఆకలితో అట్లాగే పండుకొన్నాడు. పొద్దున్నే ఆకలికి తట్టుకోలేక తంబూర మీటుకుంటా ఇంకో వీధిలోకి పోయినాడు. ఒక ఇంటి ముందు నిలబడి ''కనుగొంటినే సీతమ్మ తల్లీ... నిన్నూ కనుగొంటినే'' అంటా పాట పాడడం మొదలుపెట్టినాడు. ఆ ఇంటి కోడలు ఇంటి బైట దాపుగానున్న చోట కూచోని తియ్యని గారెలు తింటా వుంది. వాళ్ళ అత్త పెద్ద గయ్యాళిది. కొసరి కొసరి పెట్టాల్సిన కొత్తకోడలికి గూడా ఏ మాత్రం దయలేకుండా గీచిగీచి పెట్టేది. ఆమె నోటికి భయపడి ఎంత ఇష్టమైనా ఏదీ నోరు తెరచి అడిగేది కాదు. అట్లాంటిది ముందురోజు తనకెంతో ఇష్టమైన గారెలు చేస్తా వుంటే అత్తకు తెలీకుండా ఒక నాలుగు కొంగుచాటున దాచిపెట్టుకోని బైట దాచిపెట్టింది. పొద్దున్నే కోడలు ఐదింటికి లేసి పనులన్నీ చేసినాక అత్త తీరిగ్గా ఏడింటికి లేస్తాది. దాంతో కోడలు పొద్దున్నే లేసి, బెరబెరా ఇంటి ముందంతా కసువు నూకి, ఒక వారగా కూచోని రాత్రి కొట్టేసిన గారెలు సంబరంగా తింటా వుంది. ఆమె పేరు సీతమ్మ. వీరయ్య సరిగ్గా ఆ సమయానికే ఆ ఇంటి ముందుకు పోయి నిలబడి ''కనుగొంటినే సీతమ్మ తల్లీ... నిన్ను కనుగొంటినే'' అంటా పాట పాడతా వుంటే ఆమె అదిరిపడింది. ఎవ్వరికీ తెలీకుండా ఇంత పొద్దున్నే దాచిపెట్టుకోని తింటా వుంటే కనుక్కోడమే గాక, మళ్ళా అందరికీ వినబడేలా గట్టిగా పాట పాడతా వున్నాడు. మా అత్త గనుక వింటే ఇంగేమన్నా వుందా... అనుకుంటా కోపంగా చీపురు తీసుకోని ''ఏంరా... ఏదో నోరు కట్టుకోలేక... తినక తినక నాలుగు గారెలు తింటా వుంటే... అది గూడా ఓర్చుకోలేవా... చూసినా చూడనట్లు గమ్మునుండాలగానీ మా అత్తతో తన్నించడానికి మా ఇంటి ముందే నిలబడి గట్టిగా పాట పాడతావా... వుండు నీ పని చెబుతా'' అంటా చీపురు తిరగేసి రపరపరప నాలుగు పెరికింది. ఆ దెబ్బలకు తట్టుకోలేక వీరయ్య కుయ్యోమొర్రో అనుకుంటా అక్కన్నించి పారిపోయి సత్రానికి చేరుకున్నాడు. ఇదేందిరా నిన్న రాత్రి అట్లా జరిగింది. ఈ పొద్దు ఇట్లా జరిగింది అనుకున్నాడు. ఒకపక్క ఆకలి దంచేస్తావు. మరోపక్క ఒళ్ళు వాతలు పన్నాయి. ఆకలికి తట్టుకోలేక అట్లాగే లేచి తంబూరా తీసుకోని మరొక వీధిలోనికి పోయినాడు. ఒక ఇంటిముందు నిలబడి ''నమ్మిన వానిని మోసము చేయుట... న్యాయము గాదురా రఘునాథా...'' అని పాట పాడటం మొదలుపెట్టినాడు. ఆ ఇంటాయన పెద్ద జమీందారు. చానా మంచోడు. అవసరానికి అందరికీ ధర్మ వడ్డీకంటే తక్కువకే అప్పులిస్తా వుంటాడు. ఆరోజు ఒకడు తాను తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడానికి డబ్బులు తీసుకోని అక్కడికి వచ్చినాడు. జమీందారు ఆ అప్పుకి వడ్డీ లెక్క వేస్తా వున్నాడు. ఆయన పేరు రఘునాథుడు. సరిగ్గా ఆ సమయానికి వీరయ్య అక్కడికి పోయి ''నమ్మిన వారిని మోసము చేయుట న్యాయము గాదురా రఘునాథా'' అని పాట పాడటం మొదలుపెట్టినాడు. ఆ పాట వినేసరికి రఘునాథునికి మండిపోయింది. నా అంత మంచోడు ఎవడూ లేడని చుట్టుపక్కల ఏడేడు పద్నాలుగు వూర్లలో ఎవన్నడిగినా చెబుతారు. అట్లాంటిది నా ఇంటి ముందు నిలబడి నన్నే నమ్మిన వారిని మోసం చేస్తున్నానని తిడతావా... ఎంత కొవ్వురా నీకు... అంటా పక్కనే వున్న కట్టె తీసుకోని రపరపరప నాలుగు పెరికినాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక వీరయ్య కుయ్యోమొర్రో అనుకుంటా ఆన్నించి పారిపోయి సత్రానికి చేరుకున్నాడు. ఇదేం సావురా దేవుడా... ఎవడు చూసినా ఇట్లా యెంటబడి తంతావున్నాడు. మందితో ఇట్లా తన్నులు తినడం కన్నా, పెండ్లాంతో తిట్లు తినడమే మేలు'' అనుకుంటా తంబురా, చిడతలు ఆన్నే పారనూకి మట్టసంగా ఇంటికి పోయినాడు. నెల నుంచీ మొగుడు కనబడకపోయేసరికి పాపం వీరయ్య పెండ్లాం నెత్తీనోరు కొట్టుకుంటా.... అనవసరంగా బంగారంలాంటి మనిషిని నా నోటి దురుసుతో దూరం చేసుకొంటి... పాపం... ఎక్కడున్నాడో... ఏం చేస్తున్నాడో... చీమకు కూడా హాని చెయ్యని మనిషి... అనుకుంటా తిండి గూడా తినకుండా బాధపడతా వుంది. సరిగ్గా ఆ సమయానికి వీరయ్య నున్నని గుండుతో ఇంటికి వచ్చినాడు. మొగున్ని చూడగానే ఆమె సంబరంగా వురుక్కుంటా పోయి ''మళ్ళా ఎప్పుడూ నిన్ను ఇట్లా బాధపెట్టను. ఇంగ నన్నెప్పుడూ వదిలిపోకు'' అంటా గట్టిగా పట్టుకోని ఆగకుండా కండ్లనీళ్ళు పెట్టుకోనింది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఎటువంటి గొడవలు పడకుండా హాయిగా చిలకా గోరింకల్లెక్క జీవితమంతా గడిపినారు.
Popular posts
చెట్లే మనకు రక్ష: ఎస్ అంకిత, 8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిటి పాముల కట్టంగూరు మండల్, నల్లగొండ జిల్లా, తెలంగాణ.
• T. VEDANTA SURY
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
చదువు :- గుండ్ల స్టెల్లా, 8వ తరగతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయిటి పాముల, నల్లగొండ జిల్లా, తెలంగాణ
• T. VEDANTA SURY
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి