పశ్చాతాపం అతనొక వ్యాపారి. భవిష్యత్తులో ఓ గొప్ప పారిశ్రామికవేత్తగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానం పొందాలనుకున్నాడు. అయితే అందుకు తగినట్లు అతను ప్రణాళిక రూపొందించకపోవడంతో అతను పెను నష్టాన్ని చవిచూడవలసి వచ్చింది. దాంతో ఓ రోజు అతను ఇంటికి వెళ్ళడం ఇష్టం లేక ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఊరికి దూరంగా ఉన్న ఓ నదీతీరానికి వెళ్ళాడు. అక్కడ ఇసుకను ముద్దాడిన వెన్నెల వెలుగులో కూర్చుండిపోయాడు. ఏవేవో ఆలోచించసాగాడు. వ్యాపారంలో ఓడిపోవడాన్ని ఆలోచించాడు. భాగస్వామలు తనను ఎలా మోసగించారోనని ఆలోచించాడు. నమ్ముకున్న వాళ్ళే తన గొంతు కోసారనుకున్నాడు. ఇలా ఏవేవో ఆలోచిస్తూ వేదనలో కూరుకుపోయాడు. ఇక తాను జీవితంలో నిలదొక్కుకోవడం కష్టమేనా...వ్యాపారం ఎలా కొనసాగించాలి....కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి....ఇలా ఏవేవో ఆలోచిస్తూ పరధ్యాన్నంలో ఉండిపోయాడు. అతని కుడి చెయ్యి అతనికి తెలియకుండానే ఇసుకలోని ఉన్న చిన్న చిన్న రాళ్ళను తీసి నదిలో విసురుతోంది. ఆ విధంగా రాత్రంతా అక్కడే గడిపాడు. తెల్లవారింది. ఉషోదయం అతనిని స్పర్శించింది. నదిలో విసరడానికి ఇక రాళ్ళేవీ మిగలలేదు. అతను తన చేతిలో చివరగా మిగిలి ఉన్న ఓ రాయిని చూశాడు. ఆశ్చర్యపోయాడు. విస్తుపోయాడు. నోట మాట లేదు. కారణం, అది సాధారణమైన రాయి కాదు. విలువైన వజ్రం అది. దొంగలెవరో తమకే తెలియకుండా వజ్రాలతో ఇటొచ్చి కొన్ని ఇక్కడ పడేసి వెళ్ళిపోయారు. వాటినే అతని కుడి చేయి ఏరి చీకట్లో చూసుకోకుండా నదిలోకి విసిరిందన్న మాట. ఛ ఛ ఎంత పని చేశాను. తాను ఇంత సేపూ విసిరినవి ఒట్టి రాళ్ళు కావన్న మాట. అవన్నీ ఖరీదు కట్టలేని వజ్రాలన్న మాట అని బాధ పడ్డాడు. అతనొక్కడే కాదు, మనలో చాల మందిమి ఈ వ్యాపారిలాంటి వారమే. గతాన్ని మరచిపోలేక వాటినే తలచుకుంటూ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని ఆలోచిస్తూ వర్తమానమనే వజ్రాన్ని పట్టించుకోకుండా వృధా చేస్తుంటాం. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు