స్మృతి పథంలో అమ్మమ్మ ! ----------------------------------- శనివారం,15 ఫిబ్రవరి 1972 రాత్రి హాస్టల్ లో నిద్ర పోయాను. శరీరం బాగా అలసుంది. గాఢ నిద్రలోకి వెళ్లి పోయాను.వేకువజామున3,4 గంటల మధ్యన మాఅమ్మమ్మ కలలోకి వచ్చింది. ఆ కలలో నేను6 సంవత్సరాల కుర్రాడిలా ఉండి ఒకటోతరగతి చదువుతున్నానట. నేను బడికి వెళ్లి ఇంటికి వచ్చేసరికి అమ్మమ్మ నాకు ఎదురుగా వచ్చి నా పుస్తకాల బ్యాగ్ అందుకొంది. అమ్మమ్మను చూసి ఆశ్చర్య పోయాను. " అమ్మమ్మా ! ఎప్పుడొచ్చావ్ "అని అమ్మమ్మ రెండు కాళ్ళు పట్టుకుని గట్టిగా ఆప్యాయంగా పట్టేసాను. అమ్మమ్మ నన్ను తన రెండు చేతులతో ఎత్తుకొని గట్టిగా పట్టుకొని ఊపిరాడనీయకుండా ఎన్నో ముద్దులు పెట్టింది. అమ్మమ్మ బుగ్గమీద పెట్టిన ముద్దులను ఎడమ చేత్తో యాంత్రికంగా చెరిపేసుకున్నాను. అమ్మమ్మ నన్ను దగ్గరగా తీసుకొని వంటింట్లోనున్న అమ్మకు అప్పజెప్పిది. అమ్మమ్మ ముఖంలోకి చూస్తూ"అమ్మమ్మా ఎప్పుడొచ్చావు?" అన్నాను. నా మాట వినిపించుకోకుండా గదిలోకి వెళ్లి ఒక సంచి తెచ్చింది. అందులోనుండి సున్నుండలు,. అరిసెల వాసనొస్తుంది. వాటిని సంచి నుండి బయటకు తీసింది. అమ్మమ్మ నాకు కొత్త బట్టలు, బొమ్మలు కూడా తెచ్చింది. వాటిని కూడా సంచిలో నుంచి తీసిచ్చింది. వాటిని చూసి నేను గంతులేసాను. అమ్మమ్మ తెచ్చినవన్నీ నా చేతిలో పెట్టి " చూడు నాన్నా నీకెన్ని తెచ్చానో ! అవన్నీ తీసుకుని నీవు బాగా చదువుకోవాలి. మంచి మార్కులు తెచ్చుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి. అలా ఉద్యోగం చేసి వచ్చిన జీతంతో అమ్మకు , నాన్నకు, నాకు మంచి మంచి బట్టలు కొనాలి. సరేనా ! " అంది. " ఆ...... అలాగే......అమ్మమ్మా ! " అని అమ్మమ్మ తెచ్చినసున్నుండ తినడం మొదలు పెట్టాను.గొంతులో సున్నుపిండి అడ్డొచ్చినట్టుంది. " అమ్మా ! నీరు....నీరు....." అంటూ ఏడవడం మొదలు పెట్టాను. అమ్మమ్మ గాబరా పడింది. దాంతోగాఢ నిద్రలోనున్న నాకు మెలకువ వచ్చింది. లేచి కూర్చున్నాను. అమ్మమ్మ కలలోకి కూడా వచ్చి మంచి ఉద్యోగం చేసి మరీ చీరకొనమంటుందేమిటి ? అసలు ఈ ఉద్యోగానికే కదా ఇన్ని తిప్పళ్ళు పడుతున్నది.ఇదెలాగూ స్వర్గంలోఉందికదా ! తన శక్తులు ఉపయోగించి ఉద్యోగం ఇచ్చే వారి మనసులో దూరి పని చేయించొచ్చుకదా !నన్ను నిద్ర పోనివ్వకుండా చేసి పైసా సంపాదన లేనివాడి దగ్గరకొచ్చి చీరకొను అంటే ఎలాకొనేది? ఈ అమ్మమ్మ నాచిన్నతనంలో కూడా నానా కోరికలు కోరేది. దీనికి పూజలు పిచ్చి అధికం.మా ఊరులో నాగావళి నది ఉండేది. మా ఇంటికి అర కిలోమీటర్ పైబడిన దూరం ఉంటుంది. నదీ స్నానం పుణ్యమంటూ నదిలో స్నానం చేస్తా మనేది. బాగానే ఉంది. కానీ నన్ను తనకు తోడుగా రమ్మ నేది. వెళ్ళేవాడను. ఎందుకంటే అమ్మమ్మ ఉపవాసం చేసేటప్పుడు రాత్రికి "సొజ్జి "అనే ప్రసాదం చేసేది. వేపుడు బియ్యం నూక, కొబ్బరికోరు, పాలు, బెల్లం, ఏలకలు, జీడి పప్పు, కిసిమిసి వాటిని కలిపి దగ్గరకు చేసేది. తను తిని, మా పిల్లలకు ఇచ్చేది. నాకు చాలా ఇష్టం. అందరికంటే నాకు కొద్దిగా ఎక్కువ వేసేది. అందుకే అమ్మమ్మ ఉపవాసం చేస్తోం దంటే చాలా సరదా పడేవాడిని.కానీ తను నాగావళి నదికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు తనతోపాటు రమ్మంటేనే వెళ్ళడానికి దొంగెత్తులు ఎత్తేవాడిని. దానికి కారణం నదికి వెళ్ళేట ప్పుడు అమ్మమ్మ నా చేయిపట్టుకు తీసుకువెళ్ళేది. నాకు కూడా అమ్మమ్మ చేయిపట్టుకు నడవడమంటే చాలా సరదాగా ఉండేది. కానీ తన స్నానమనంతరం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు"మడి" అని తన చేయి పట్టుకోనిచ్చేదికాదు. తనతోపాటూ నన్నూ స్నానం చేయించేది. అయినా దూరం దూరం అనేది. ఆ ఒక్క క్షణంకు దూరంగా వెళ్లి అమ్మమ్మ ప్రక్కకుచేరి అనుకోకుండా అమ్మమ్మను ముట్టుకునేవాడిని. నన్ను తిట్టుకొని మళ్లీ నదికి స్నానం చెయ్యడానికి వెళ్ళాల నేది. అప్పటికే నది నుండి సగం దూరం వచ్చేసేవాళ్ళం. అమ్మమ్మ ఛాదస్తంతో మళ్లీ నదికి వెళ్లి స్నానం చేద్దాం అనేది. రెండోసారి నదిలో తనూ స్నానం చేసింది. నాచే కూడా స్నానం చేయించేది. అలా ఇంటికి ఇద్దరం నడక ప్రారంభిం చాం. నేను అమ్మమ్మకు దూరంగా, దూరంగా నడుస్తూ మళ్లీ అమ్మమ్మను ముట్టేసాను. ఈసారి అమ్మమ్మకు విపరీతమైన కోపం వచ్చింది. మళ్ళీ స్నానం చేస్తానంది. " అమ్మమ్మా ! కాలు పీకేస్తున్నాయే " అన్నాను. " నాయనా ! మెల్లిగా కష్టపడురా "అంది. కాలు పీకేస్తు న్నాయే అన్నాను.అయితే నన్ను ఎలా చావమంటావు చెప్పు అంది. దీనితో లాభంలేదనుకుందో ఏమో తను ఒంటరిగానే స్నానం చేయడానికి బయలుదేరింది. అమ్మమ్మను చూసి జాలేసింది. అమ్మమ్మ వెనకాల వెళ్ళాను. మూడోసారి తనూ స్నానం చేసింది. నాచే కూడా స్నానం చేయించింది. ఇంటికి బయలుదేరాం. దగ్గర దగ్గర ఇంటికి చేరుకున్నాం. అమ్మమ్మను మళ్ళీ ముట్టేసాను. అమ్మమ్మ ఈసారి నన్ను ఏమీ అనలేదు. ఆ భగవంతుడే ఉన్నాడనుకొని వ్రతం చేసుకుంది. నా చిన్ననాటి సంఘటనను తలచుకుని అమ్మమ్మకు ఎంత కష్టపెట్టాను అనుకున్నాను. ఈ ఉద్యోగవిషయంలో కనికరించి సాయం చెయ్యమని అమ్మమ్మను ప్రార్థించాను. 16 ఏప్రిల్ 1972. ఉదయం కార్యక్రమాలు బ్రేక్ ఫాస్ట్ తో సహా అన్ని కార్యక్రమాలు ముగించుకున్నాం. ఉదయం 8 గంటలైంది." గదిలో కూర్చొని ఏం చేస్తాం.అలా జిల్లాపరిషత్ ఆఫీసుకు వెళ్దాం పద ! " అన్నాడు గోపి. " ఈరోజు ఆదివారం. శలవు. ఎవరిని కలవగలం ? " అన్నాను. " నైట్ వాచర్‌, అటెండర్ లాంటివారు ఎవరైనా ఉండక పోతారా ! పోనీ ఒకసారి వెళ్తే ఏం పోయింది. బయలుదేరు" అన్నాడు గోపి. ఒక అరగంటలో జిల్లాపరిషత్ ఆఫీసుకు చేరుకున్నాం. ( సశేషం )శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్ : 701 3660 252.


కామెంట్‌లు