టెన్షన్ తో నిరీక్షణ ----- 3 ---------------------------------- ఏప్రిల్ 15, 1972 వ తేదీ. సాయంత్రం 5 అయింది. జిల్లాపరిషత్ ఆఫీసు స్టాఫ్ అంతా ఇంటిదారి పడుతున్నారు. పి ఇ వో గారు ఇక వచ్చేదేముందిలే ! అనుకొని ఎడ్యుకేషన్సెక్షన్ గుమస్తా సత్యనారాయణగారు వారితో పాటు వస్తున్నారేమోననుకొని ఆఫీసు గేటుదగ్గర ద్వారపాలకునిలాకాసాను. అంతా వెళ్లి పోయారు. సత్యనారాయణ ముందుగానే వెళ్లిపోయారా ఇంకా వెనక్కి ఆఫీసులోఉండిపోయారా అనే సంశయం నాలోకలిగింది. అతని ఆఫీసు గదికి వెళ్ళి చూసాను. అతను ఏవో ఫైల్స్ సర్దుకుంటున్నాడు. అతని కార్యదీక్ష నాకు నచ్చింది. అదెందుకో నామనసు మొదటి నుండీ కోరుకునేది ఒక్కటే ! ఎవరి పనివారు నిర్ణీత కాలంలో చేసుకుపోతే ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఆదుర్దా అంతకన్నా కలగదు.జరగవలసిన పనులన్నీ త్వరత్వరగా అయిపో తాయి కూడా ! ఎడ్యుకేషన్ గుమస్తా సత్యనారాయణ దగ్గరకు వెళ్ళాను. మా ఇద్దరమే ఆ గదిలో ఉన్నాం. అటెండర్ వరండాలో ఇటూఅటూ తచ్చాడుతున్నాడు. " సార్ ! అంతా వెళిపోయారు. మీరు కూడా వెళిపోయి ఉంటారనకున్నాను.! పి ఇ వో గారు రాలేదండీఅన్నాను. లేదండీ అంటూ మీరు సోమవారం రండి. పి ఇ వో గారొస్తారు అన్నాడతను. ఇతని మాటలను చూస్తుంటే పని జరగబోతున్నట్టు అనిపించింది. కానీ మరో ప్రక్క మూడు రంగుల సి‌రా పెన్నుల కథ గురించి అడగాలను కున్నాను. లేనిపోని విషయాన్ని తన దృష్టికి ఎందుకు తేవడం ? ఎన్ని రకాల రంగుల పెన్నులు వాడుకుంటే మనకు వచ్చే నష్టమేముంది? మన పని జరిగితే చాలు అనుకు న్నాను. .ఎడ్యుకేషన్ సెక్షన్ గుమస్తా సత్యనారాయణ ఒంటరిగా ఉన్నారు. పల్లి శివున్నాయుడుగారు గతరాత్రి మా ఇంటి నుండి వెళ్లిపోతూ వెళ్లిపోతూ మళ్లీ వెనుదిరిగి వచ్చి ఆ గుమస్తా సత్యనారాయణకు ఒక ఇరవైరూపాయలు చేతికి ఇచ్చిరా అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఇంతకీ ఆ 20 రూపాయలను అతను అంగీకరిస్తే ఫర్వాలేదు. ఏమైనా రివర్స్ లో తీసుకున్నాడనుకుందాం అప్పుడు మన పని అవుట్. ఇరవైరూపాయలను ఎరచూపి ఉద్యోగానికి కావల సిన బండెడు చాకిరీ చేయించుకోవడం బాగుంటుందా ? తను చిన్నతనంగా భావించుకోడా ? అలా అని తులం బంగారం 300 రూపాయలు ఉన్న రోజుల్లో 20 రూపాయ లంటే తక్కువేంకాదు. కానీ అతను డబ్బులు ఆశిస్తున్నాడో లేదో,అతని మనసులో ఏముందో పసిగట్టలేకపోయాను. ఈ సంశయంతో 20 రూపాయలు ఇచ్చే సహసం చేయలేదు. అతనూ నన్నేమీ అడగలేదు. వస్తానని చెప్పి ఆఫీసు బయటకు వచ్చేసాను. బాగా సాయంత్రం అయింది. కొమరాడలో గల ఇంటికి వెళ్ళి సోమవారం వస్తే బాగుంటుందేమోనని అనుకున్నాను. కానీ అతి కష్టం మీద అప్పుచేసి తెచ్చిన సొమ్మును ఇలా ఖర్చు చేయడం, తరువాత ఇబ్బందులపాలవడం నాకిష్టం లేదు. పైగా ఊ‌రంతా ఎదురుచూస్తున్నది నా ఉద్యోగుపుటుత్తర్వుల గురించి. అవిలేకుండా తిరిగి ఇంటికి వెళ్ళడం ఏం బాగుంటుదని నాకునేనుగా ప్రశ్నించుకున్నాను. ఏదైనా లాడ్జీ తీసుకుని ఉందామంటే లాడ్జీ ఖర్చులు, టిఫిన్, భోజనం ఖర్చులు తడిసి మోపెడు అయిపోతాయని భావించాను. మరో గత్యంతరంలేని పరిస్థితులు నెలకొన్నాయి.నా బుర్రకుఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే పల్లి.శివున్నాయుడు గారి రెండో అబ్బాయి గోపి శ్రీకాకుళం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో బి.ఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతను కాలేజ్ లో జాయిన్ అయి రమారమీ ఎనిమిది నెలలు దాటింది. ఎప్పుడైనా శ్రీకాకుళం వచ్చేటప్పుడు తన కాలేజ్ హాస్టల్ కు రమ్మనమని చాలాసార్లు కోరాడు. కానీ పనిలేనిదే వెళ్లి వాళ్ళను డిస్టర్బ్ చెయ్యడం నాకిష్టముండేది కాదు. అయితే ఈరోజు వెళ్ళక తప్పదు అనుకున్నాను. అనుకున్నట్టుగానే వెళ్ళాను. గోపీ నన్ను చూసి చాలా సరదా పడ్డాడు. ఏంటి ఇలా వచ్చేసావని ఆలింగనం చేసుకున్నాడు.తోటి హాస్టల్ పిల్లలకు మాఊరి మాష్టారబ్బాయని అమితానందంతో పరిచయం చేసాడు. స్నానం చేసి భోజనానికి వెళ్ళాం. అట్నుండి వచ్చిన తరువాత , గోపి స్నేహితులు, గోపి, నేను చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుతూ నిద్రపోయాం. ( సశేషం )-శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి, ఫోన్: 701 3660 252.


కామెంట్‌లు