సాధు సందేశం.బేతాళకథ-----బెల్లంకొండ. పట్టువదలని విక్రమార్కుడు బేతాళుని బంధించి భుజాన వేసుకుని మౌనంగా బయలుదేరాడు. విక్రమార్కుని భుజంపైనున్న శవాన్ని ఆవహించి ఉన్న బేతాళుడు'మహీపిల నీశ్రమా,పట్టుదల మెచ్చదగినవె!నీవు సకల విద్యా పారంగతుడవేకాదు,అభిషేక,అలంకార,యోగ,వివాహ,ఆస్ధాన,వసంత,గీష్మ,వార్షక,కార్తీక,విహార,జప,డోలా,శయన,నిత్యోత్సవ,అధ్యాయన,వాహన,ప్రణయకలహ,ప్లవోత్సవ,దమనకోత్సవ,మాసోత్సవ,పాలకోత్సవ,వార్షకోత్సవ,నైమిత్తికోత్సవ,అఖేట మండపాలు కలిగిన నీ ఉజ్యయిని రాజ్య గొప్పదనం లోక విదితమే.మన ప్రయాణంలో నీకు అలసట తెలియకుండా కథ చెపుతాను విను... అమరావతి నగర పొలిమేరల్లో ఆశ్రమం నిర్మించుకుని విద్యాదానం చేస్తుండే సదానందుడు ఆశ్రమ నిర్వాహణ సమర్ధవంతమైన వారికి అప్పగించి కొందరి శిష్యులతో కలసి కాలినడకన కాశీయాత్రకు బయలుదేరాడు. ఆ ప్రయాణంలో వచ్చే గ్రామాలలో ప్రజలకు పురాణ సంబధింత విషయాలను వినిపిస్తు, అక్కడి ప్రజలు ఇచ్చే కానుకలు,ఆహార పదార్ధాలు స్వీకరించి ఆరాత్రి అదేగ్రామం లోని దేవాలయంలో బసచేసి మరుదినం తన ప్రయాణం కొనసాగించే వాడు. మరుదినం జాగర్లమూడి అనే గ్రామం వెళ్ళగా అక్కడి ప్రజలు సదానందునికి ఘన స్వాగతం పలికి గొప్ప విందు ఏర్పాటు చేసి సదానందుని ప్రసంగం వినడానికి గ్రామప్రజలు అందరూ తరలివచ్చారు. 'నాయనలారా మనకు సహాయంచేసిన వారికి తిరిగి సహాయంచేయడం సహజమైనది. అపకారికికూడా ఉపకారం చేయడమే 'క్షమాగుణం' సుధాంవినా న ప్రయ యుర్విరామం ననిశ్చితార్ధా ద్విరమస్త ధీరాః తము అనుకున్న కార్యాన్నిసాధించేవరకు ధీరులు పట్టువదలరు.విజయానికి నిర్విరామంగా కృషి చేస్తారు.అందుకే దేవతలు అమృతాన్ని సాధించ గలిగారు.కార్యసాదనలో మనిషిని మూడు విధాలుగా చెప్పుకోవచ్చు.అధములు తాము కార్యం ప్రారంభించకముందే ఆటంకము,శ్రమ కలుగుతుందేమో అని ఏపని ప్రారంభించరు.మధ్యములు తాము తలపెట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడటంతో భయపడి దాన్ని అలానే వదిలి వేస్తారు.కాని కార్యసాధకులైన ఉత్తములు ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం సాధించేంతవరకు విశ్రమించరు.మీ గ్రామప్రజలు దేశం అంతటా విద్య,వ్యాపార,వివాహాది సంభంధిత విషయాలు విరివిగా పెంపొందించుకొండి శుభం'అన్నాడు సదానందుడు. ఆరాత్రి అదే గ్రామంలోని దేవాలయ మండపంలో విశ్రమించాడు. మరుదినం తన శిష్యులతో కలసి మరో గ్రామంలోని ఆలయ మండపంలో చేరాడు.ఆగ్రమంలోని ప్రజలు సదానందుని రాకకు ఎవ్వరూ స్పందించలేదు. కనీస అవసరాలైన ఆహారం,నీరుకూడా లభించలేదు. తమవద్దఉన్న వాటితోనే ఆరోజుకు ఆహారం ఏర్పాటు చేసుకున్నారు సదానందుని బృందం. సాయంత్రం సదానందునీ ప్రసంగం వినడానికి ఆ గ్రామ ప్రజలు అందరు ఎటువంటిపండ్లు,ఫలహారాలు వంటి ఆహార పదార్ధాలు,కానుకలు లేకుండా వట్టి చేతులతో వచ్చారు. 'నాయనలారా మాత్రుదేవోభవ,పిత్రుదేవోభవ,ఆచార్యదేవోభవ,అతిథిదేవోభవ అన్నారుపెద్దలు. తిథి చూడకుండా వచ్చేవాడే అతిథి. 'సవై స్వయం తదన్ని యాదతిధిం యన్న భోజయేత్ ధాన్యం యశస్య మాయుష్యం స్వర్గం బాతిధి పూజనమ్!' అతిధులకు పెట్టని ఆహార పదార్ధాలు గృహస్తులు భుజింపరాదని,అతిధులు భుజింపగా ఇంట మిగిలిన పదార్ధాలు అమృతతుల్యం అని విజ్ఞులు అంటారు.అతిధికి భోజనం పెట్టి ఆశీర్వాదం పొందటంవలన ధనం,కీర్తి,ఆయుష్సు పెరుగుతుందని మనుస్శృతిలో చెప్పబడింది. మీరంతా గ్రమం విడిచి దూర ప్రాంతాలలో స్ధిరపడకండి.ఎన్నడు మీ సంబంధ బాధవ్యాలను పొలిమేరలు దాటనివ్వకండి. వివాహాది శుభ కార్యాలలో మీగ్రామంలోనే ఇచ్చి పుచ్చుకుంటూ హాయిగా జీవించండి శుభం'అని తన పరివారంతో ఆలయ మండపంలో నిద్రకు ఉపక్రమించాడు సదానందుడు. విక్రమార్క మహారాజా నాసందేహం ఏమిటి అంటే మోదటిగ్రామ ప్రజలను దేశం అంతటా విస్తరించమని,రెండో గ్రామ ప్రజలను పొలిమేరలు తాటి సంబంధ బాంధవ్యలు జరపవద్దని ఎందుకు చెప్పాడు.నాఈ ప్రశ్నకు సమాధానం తెలిసి చెప్పక పోయావో తలపగిలి మరణిస్తావు'అన్నాడు శవంలోని బేతాళుడు. 'బేతాళ మొదటి గ్రామ ప్రజలు పెద్దల ఎడల గౌరవం కలిగిన సద్గుణ సంపన్నులు,దయార్ధహృదయులు,ఆకలి తెలిసినవారు.అందుకే వారి సుగుణాలను దేశం అంతటా అందరికి చేరేలా ఉండాలని వారిని అలా సదానందుడు ఆశీర్వదించాడు.రెండో గ్రమ ప్రజలు ప్రవర్తన,వారి లోభితనం,దానగుణహీనులుగా, ఎదటి వారి ఆకలిని గుర్తించక పోవడం,పెద్దలఎడల అగౌరవంగా ప్రవర్తించడంతో వారి అనాగరిక లక్షణాలను వారి గ్రామం వరకే పరిమితిగా మిగలాని ఈ లక్షణం మరోచోట వ్యాప్తి చెందకుండా ఉండేందుకే వారిని పొలిమేరదాటి వెళ్ళవద్దని సదానందుడు సూచించాడు'అన్నాడు విక్రమార్కుడు. విక్రమార్కునికి మౌన భంగం కావడంతో శవంతో సహా మాయమై చెట్టు పైకి చేరాడు బేతాళుడు. పట్టువదలని విక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.


కామెంట్‌లు