ఒక సర్వే ప్రకారం... పెద్దలు పిల్లలకి రోజుకి సగటున పాతిక పైగా సలహాలిస్తారట. అలాంటి సలహాలు పిల్లలు మనకిస్తే...? ఉదాహరణకి ‘మందూ, సిగరెట్లూ మానేసి (లేదా ఆ అయ్యప్ప భజనలూ, సాయి కోటీ మానేసి) పేద పిల్లలకి చదువు చెప్పొచ్చు కదా / ఆ చెత్త సీరియల్స్ చూడటం మానేసి వంట మీద కాన్సన్ట్రేట్ చెయ్యి... ఇంటర్నెట్లో ఎన్నెన్ని కొత్త వంటకాలు వస్తున్నాయో చూడు / నెలకో కిలో పెరుగుతున్నావు., తిండి సగం తగ్గించి, రోజూ గంటసేపు యోగా చెయ్యొచ్చు కదా…’ అని పిల్లలు చెప్తే మనం వింటామా? పాటిస్తామా? మీ తండ్రిగారు ఆలోచించినంత మెచ్యూరిటితో మీరు ఆలోచించగలరా? ఆయన చెప్పిన సలహాలూ, నిర్ణయాలూ మీకు ‘ఆ రోజుల్లో’ నచ్చేవా? పెద్దగా అనుభవం లేనివారు పిల్లలు. చిన్నచిన్న తప్పులకే వారిని విమర్శించో, మందలించో, తమ అసంతృప్తులని వెల్లడి చేయడం మొదలుపెడితే, కొంతకాలానికి వారు మనల్ని గౌరవించడం మానేస్తారు. You may not agree with some points I am herewith proposing, but think. మెచ్యూరిటి అంటే తమ విధానాలను ‘తరచూ’ మార్చకుండా ఉండటo. అందుకే ఋషులు, జ్ఞానులూ తమ విశ్వాసాలను అంత తొందరగా మార్చుకోరు. పిల్లలు అనుభవం లేనివారు. మెచ్యురిటి ఉండదు. అందుకే వారి అభిరుచులు, అలవాట్లు తొందర తొందరగా మారిపోతూ ఉంటాయి. స్కూల్లో టీచర్ని అమిత శ్రద్ధతో నమస్కరిoచే కుర్రవాడు, కాలేజిలో లెక్చరర్ని అసలు గౌరవించడు. గొట్టం పాంట్ల నుంచి జీన్స్‌కీ, జీన్స్ నుంచి షార్ట్స్‌కీ వేగంగా మారిపోతాడు. కొన్నాళ్ళు గెడ్డం పెంచుతాడు. మరి కొన్నాళ్ళు క్రాఫు పెంచుతాడు. ఇదంతా సహజమే కానీ పెద్దలు తనకి ఇచ్చే సూచనలు తరుచు మారిస్తే మాత్రం కన్‌ఫ్యూజ్ అయిపోతాడు..! ఉదాహరణకి ఒక తండ్రి పిల్లలతో కలిసి T-20 మ్యాచ్ మూడు గంటల పాటు ఎంజాయ్ చేశాడు. రెండ్రోజులు పోయాక, ‘రోజుకి అరగంట కన్నా ఎక్కువ సేపు టి.వీ చూస్తే కళ్ళు పాడైపోతాయి’ అనకూడదు. “ఎప్పుడన్నా ప్రత్యేక సందర్భాలు ఉన్నప్పుడు చూసినా తప్పు లేదు” అనాలి. (కానీ జాగ్రత్త సుమా. పిల్లలు చాలాతెలివైన వాళ్ళు. అలాంటి ‘ప్రత్యేక సందర్భాల్ని’ తరుచు కల్పించుకునే అవకాశం ఉంది). “రాత్రి పదిoటి వరకూ ఆ టి.వీ ఏమిటి? తొమ్మిదింటికల్లా పడుకోవాలి” అని ఒకసారి అని, “మరీ అంత పెందరాలే నిద్రేమిటి? పదింటి వరకూ చదువుకోవచ్చుగా” అని మరొకసారి అంటే కన్ఫ్యూజ్ అవుతారు. జీన్స్-ప్యాంటు వేసుకున్నప్పుడు ‘బాగున్నావమ్మా’ అని, ఆ తరువాత పది రోజులకి కత్తెరతో చిoపుకున్న డ్రెస్ వేసుకున్నప్పుడు ‘ఇదేమిటి? ఇంత దరిద్రపు టేస్టులు నువ్వూను’ అని తిడితే, ఇలా పదిసార్లు తిట్టేసరికి, ఎవడో స్నేహితుడు ‘నేనున్నా’నంటూ జీవితంలోకి ప్రవేశిస్తాడు. పెద్దల దగ్గర చెప్పుకోలేని తన అభిప్రాయాలు అతడితో పంచుకోవటం ప్రారంభిస్తుంది. అడ్వాంటేజ్ తీసుకుంటాడు. పెద్దల అలవాట్లే పిల్లలకి వస్తాయంటారు. కొందరు పెద్దల నోరు చెరుకు మిషన్. నిరంతరం దవడలు కదుల్తూ ఉండాల్సిందే. వాళ్ళు అలా ఒంటెల్లా నేమరేస్తూ ఉంటే పక్కనున్న పిల్లవాళ్ళకు ఎలా ఉంటుంది? పిల్లలకి కూడా అదే అలవాటు చేస్తారు. ‘హేల్దీ ఫుడ్ వేరు, జంక్‌ఫుడ్ వేరు’ అన్న తేడా తెలుసుకోకుండా, ‘ఎదిగే వయసులో పిల్లలు తినకపోతే ఎలా?’ అని వాదిస్తారు. ఆ తరువాత ఒబెసిటి గురించి బాధ పడతారు. రైలు ప్రయాణాల్లో కుప్పలుగా ఇలాంటి తల్లిదండ్రులని చూడవచ్చు. పెద్దల్లో మేచ్యురిటి లేకపోతే పిల్లలు సరిగ్గా పెరగరు. ఒక్కోసారి మనం ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తామoటే అది మనకే అర్థం కాదు. ఉదాహరణకి, ఏ ఛానెల్ చూడాలన్న విషయమై మీ ఇద్దరు కొడుకులూ గొడవ పడుతూ ఉన్నారు. పెద్దవాడు రెండోవాడిని కొట్టి రిమోట్ లాక్కున్నాడు. చిన్నవాడికి మెడ దగ్గర గాయమై రక్తం వచ్చింది. మీరు ఆవేశం ఆపుకోలేక “నీకన్నా చిన్నవాడిని అలా కొట్టవచ్చా?' అంటూ చెంప ఛెడేలుమనిపించారు. నిజమే. పెద్దవాడు బలంగా ఉన్నాడు. చిన్నవాడు అర్భకుడు. వాడిని కొట్టకూడదు. తప్పు చేసాడు. కానీ వాడి కన్నా బలంగా ఉన్న మీరు చేసింది ఏమిటి? నిజంగా మీరు మేచ్యూర్డేనా? కోపం తెచ్చుకోకుండా ఆలోచించండి. ఇలాంటి మెచ్యురిటి ఎలా వస్తుంది? సెల్ఫ్-అనలైజేషన్... ఆత్మ విమర్శ ద్వారా వస్తుంది. మంచి మార్కులు రావటం లేదని పిల్లవాడిని కౌన్సిలర్ దగ్గరకు తీసుకు వెళ్ళారు. ఆయన మిమ్మల్ని "ఆఫీస్ ఎన్నింటికి అయిపోతుంది? మీరు ఎన్నింటికి ఇంటికి వస్తున్నారు? మీ పిల్లలు చదువుకుంటూ ఉండగా మీరు ఎంతసేపు వారి పక్కన కూర్చుంటున్నారు?” అని అడిగాడు. (“ఈ వాదన వాస్తవం కాదు. చిన్నప్పటినుంచి అలవాటు చేస్తే, ఒంటరిగా కూర్చుని చదువుకోవటం అదే వస్తుoది” అని కొందరు వాదిస్తారు). వారికి చదువు చెప్పనవసరం లేదు కానీ పిల్లలు పదో తరగతికి వచ్చే వరకూ, పెద్దలు పక్కన ఏ పుస్తకమో చదువుతూ కూర్చుంటే, ‘అమ్మ (లేక నాన్న) కూడా నాతో ఉన్నారు’ అన్న రక్షణ/ సంతృప్తి ఫీలింగ్ కలుగుతుంది. పిల్లలకోసం కొన్ని త్యాగాలు తప్పవు. రెండు రోజుల నుంచీ తిండిలేక మీరు ఆకలితో నకనకలాడుతూ ఉన్న సమయంలో, విందు భోజనాలతో మీ ‘పక్క పోర్షన్‌’ వారు గోల గోల చేస్తూ ఉoటే మీకెలా ఉంటుందో... మీరూ మీ స్నేహితులూ టి.వీ. చూస్తూ బిగ్గరగా మాట్లాడుకుంటున్నప్పుడు పక్కగదిలో పిల్లలకి కూడా అలానే ఉంటుంది.’ రాత్రి సమయంలో స్నేహితులతో కబుర్లు పక్కగదిలో చదువుకుంటున్న పిల్లల ఏకాగ్రతను తగ్గిస్తాయి. సెల్‌ఫోన్‌లో గంటల తరబడి మాట్లాడుతూ ఉంటే, 'మేము ఇక్కడ కష్టపడి చదువుతూ ఉంటే, వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. నేను తప్ప ప్రపంచమంతా ఆనందంగా ఉంది ' అన్న అన్న డిప్రెషన్ తో ఏకాగ్రత నిలవదు- యండమూరి వీరేంద్రనాథ్


కామెంట్‌లు