అక్షరాలతో ఎస్రా ప్రయాణం ----------------------------- అవును. ఆయనకు అక్షరాలే శ్వాస. ధ్యాస. అక్షరాలపై ఎనలేని నమ్మకం. అక్షరాలతోనే ఆయన ప్రయాణం దీర్ఘకాలంగా కొనసాగిస్తున్నాడు. వివిధ అంశాలపై కథలల్లుతూ తన రచనాశక్తితో ముందుకు సాగిపోతున్న రచయిత ఎస్. రాకృష్ణన్. నాకిష్టమైన రచయితలలో ఈయన ఒకరు. ఆయనను ఎస్రా అని పిలుస్తారు.తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో గల మల్లన్ కినరు అనే పల్లె ఎస్రా స్వస్థలం. చదువు సంధ్యల తర్వాత ఆయన స్వగ్రామం నుంచి తొలుత ఒక్కరే మద్రాస్ చేరుకున్నారు. మద్రాసు మహానగరంలో తొలి రోజుల్లో రకరకాల సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించి తాను నమ్ముకున్న అక్షరాలకు దూరం కాలేదు. రాయపేటలో అప్పట్లో అనేక ముద్రణాలయాలు ఉండేవి. ఇప్పట్లాంంటివి కావు. అక్షరాలు పేర్చి అవి గ్యాలీలుగా తీసి వాటిలో అచ్చుతప్పులు దిద్ది ఒక్కో కాగితంగా ముద్రించి అన్ని కాగితాలనూ కలిపి కుట్టి కానీ లేదా పిన్ చేసి ముద్రించే రోజులవి. ఎస్రాకు ఎలాగైనా ఓ పుస్తకం అచ్చేయించుకోవాలని ఆరాటం. ఆశ. ఓ ముద్రణాలయంలో తను రాసిన పుస్తకాన్ని ముద్రణకిచ్చారు. ఈ పనులమీద ఆ ప్రెస్సుకి రోజూ వెళ్ళి వస్తున్న ఎస్రాకు ఓ ఆలోచన వచ్చింది. అక్కడ పని చేసే కార్మికుల శ్రమను గుర్తించిన ఆయన వారిని సత్కరించాలన్నదే ఆ ఆలోచన. పైగా ప్రముఖ తమిళ రచయిత జయకాంతన్ చతులమీదుగా సన్మానించాలని. అనుకున్నదే తడవుగా తన పుస్తకానికి ఓ రూపం ఇచ్చిన కార్మికులందరికీ జ్ఞాపికలు, స్వీట్ బాక్సులు జయకాంతన్ తో ఇప్పించి సమ్మానించారు. అప్పుడు వారి కళ్ళల్లో కనిపించిన ఆనందాన్ని చూసి ఎస్రా మైమరచిపోయారు. ఇలా ఆయన పుస్తకరచన శ్రీకారం చుట్టుకున్న తర్వాత కొంత కాలానికి మరొక పుస్తకం రాశారు. దానిని ఆవిష్కరించే తేదీ ప్రకటించేశారు. ఇంతలో భారీ వర్షమొచ్చి మోకాలిలోతు నీరుతో ప్రెస్సులతో సహా అనేక దుకాణాలు తడిసిముద్దయ్యాయి. రేపు సాయంత్రం కార్యక్రమమనగా వానతాకిడికి ప్రెస్సులు గురవడంతో తన పుస్తక విడుదల కార్యక్రమాన్ని వాయిదా వేయడం తప్ప మరో దారి లేదనుకున్నారు. అయితే ఎక్కడైతే తన పుస్తకం తయారుకావలసి ఉందో అక్కడికి వెళ్ళి పరిస్థితిని గమనించారు. ఆయనలోని ఆందోళనను గమనించిన ఓ కార్మికుడు "అయ్యా! మీరు కలతపడకండి. మీకోసం మేమున్నాం. మీ పుస్తకం బైండ్ చేసివ్వడం మా కర్తవ్యం. ఎక్కడో అక్కడ ఈ పని పూర్తి చేసి రేపు సాయుత్రానికల్లా మీకు పుస్తకం మీ చేతుల్లో పెడతాం. కార్యక్రమాన్ని వాయిదా వేయకండి. మాలాంటి చిన్న చిన్న కార్మికుల పనితనాన్ని గుర్తించి శ్రమను చూసి మాకు సన్మానం చేసింది మీరొక్కరే. పైగా జయకాంతన్ లాంటి మహారచయిత చేతులమీదుగా సన్మానం పొందాం. మా జీవితానికా భాగ్యం కల్పించిన మీకు మేమెప్పుడూ రుణపడి ఉంటాం. కనుక రేపు మీ కార్యక్రమం ఆగిపోకుండా మీ పుస్తకం మీకందిస్తాం" అని ఎస్రాకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన ఆ ప్రెస్ కార్మికులు ఓ వంద పుస్తకాలు ముద్రించి పుస్తకావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన స్థలానికి ఆటోలో తీసుకెళ్ళి ఎస్రాకు అందజేశారు. అప్పుడు అటు మాట తప్పని కార్మికులలోనూ, ఇటు పుస్తకాలందుకున్న ఎస్రాలోనూ కనిపించిన ఆనందాన్ని చెప్పడానికి మాటల్లేవు. నాటి ఆవిష్కరణ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. ఈ సందర్భంగా ఎస్. రామకృష్ణన్ కార్మికులందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నారు. అప్పుడే అచ్చయిన కొత్త పుస్తకం పేజీలు తిరగేస్తున్నప్పుడు వచ్చే సువాసన తనకెంతో ఇష్టమని, రాతప్రతికి పుస్తకరూపం ఇచ్చిన కార్మికులను నిండు మనసుతో అనురాగంతో ఆప్యాయతతో స్పృశించినట్లనిపిస్తుందనిఅన్నారు. ఎస్రా సంచారం అనే తన పుస్తకానికి సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. రచనతోపాటు సాహిత్య సభలకు హాజరై ప్రసంగించడం ఆయనకు ప్రాణం. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు