కామాక్షి సహస్రం:----తమిళనాడులోని కంచిలో కామాక్షి అమ్మవారి దేవాలయం ఉంది. కంచినే కాంచీపురమని, కాంజీవరమని కూడా అంటారు. ఈ నగరం చారిత్రకంగా ప్రసిద్ధి చెందిన పవిత్ర నగరాల్లో ఒకటి. కాంచీపురం రాజధానిగా పరిపాలించిన పల్లవ రాజులే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పుకుంటారు. ఏడు మోక్ష పురాలలో దక్షిణాదిన ఉన్న కంచి ఒకటి. కంచి అంటే వడ్డాణం అని అర్థం. కాంచీపురం భూదేవికి నాభిస్థానమని పురాణాలలోనూ, పురాతన గ్రంథాలలోనూ ఉన్న మాట. కంచిలో కామకోటి పీఠం ఉంది. ఇది అద్వైత సంప్రదాయానికి ప్రధాన కేంద్రం. శ్రీ కాంచీపుర కామకోటి పీఠ జగద్గురువులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాములవారి అనుగ్రహ ఆశీస్సులతో మా నాన్నగారు "కామాక్షీ సహస్రం" రాశారు. అంతకుముందు శ్రీ వేంకటేశ్వర సహస్రంలో లేని వృత్తాలు కొన్నింటిని కామాక్షి సహస్రంలో ఉపయోగించారు. ఒక్కో శతకంలో పదేసి స్తబకాలున్నాయి. ఒక్కో స్తబకులో పదేసి పద్యాలు ఉన్నాయి. నవమ శతకంలోని ఏడవదైన శార్దూల విక్రీడితం మాత్రం అందరికీ సుపరిచితం. శ్రీ కాంచీపుర కామాక్షమ్మకు అంకితం చేస్తూ శ్రీ జగద్గురు స్తుతితో ఈ సహస్ర రచనకు శ్రీకారం చుట్టారు. జగద్గురు స్తుతి ... కామకోటి పీఠ శంకరాచార్యం కలయే శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీం హృదయే మానుష రూపేణ చరద్దైవం శ్రుతి రూపం భారతార్ష విజ్ఞాన ప్రకటిత హృద్దీపమ్! శ్రీమత్కాంచీ కామకోటి పీఠ సంస్థాన నాయకం జగద్గురుం సదా వందే శ్రీ జయేంద్ర సరస్వతీమ్ సావిత్రి, చంద్రవదన, సింహరేఖ, వితాన, మణిరంగ, కాంతి ఇలా రకరకాల వృత్తాలతో కామాక్షి సహస్ర రచన కొనసాగించారు. ద్వితీయ శతకంలోని మధుమతీ వృత్త స్తబకంలోని ఒకటి రెండు పద్యాలు... 1లలిత భాషిణియై వెలయు శ్రీ జననీ కలిత హాసము మమ్మెలమి కన్గొనుతన్ 2 లలిత కాంచిపురీ కలిత కామ కళా ఫలిత పుణ్లతా బలమె మా బలమౌ ఇలా వెయ్యి పద్యాలున్న ఈ కావ్యాన్ని శ్రీ బి.వి.ఎస్.ఎస్. మణిగారు స్వధర్మ స్వరాజ్య సంఘం (మద్రాసు) తరఫున 1984 లో ముద్రించారు. ఈ పుస్తకం ఖరీదు పదిహేను రూపాయలు.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు