ఒక సంపూర్ణ జీవితానికి బాల్యం పునాది. బాలల లో దీక్ష,పట్టుదల, స్థిరత్వం జ్ఞానార్జన వంటి మంచి సుగుణాలు పెరగడానికి పురాణ కథలతో పాటు ఆధునిక కథలు ఎంతో ప్రాముఖ్యతను, సంతరించుకున్నాయి బాలల వికాసానికీ తగినన్ని పరిశోధనలు జరగడం లేదు. బాలల అభివృద్ధికి కేవలం నీతి కథలు వీటితో పాటువైజ్ఞానిక కథలు అవసరం ఎంతైనా ఉంది. బాల సాహిత్యం అనేది బాలల కోసం పెద్దలు రాయడం ఒక సాంప్రదాయం. ఇది సనాతనంగా వస్తుంది.ఇక రెండవది పిల్లల కోసం పిల్లలే రాయడం మరో సంప్రదాయం. ఈ విధమైనటువంటి రచనావ్యాసంగం చైనా రష్యా వంటి సామ్యవాద దేశాల్లో ఎక్కువగా కనబడుతుంది. ప్రస్తుతం మన దేశంలో కూడా బాలలు రాసే పుస్తకాలు అనేక భారతీయ భాషల్లో విరివిగా వెలువడుతున్నాయి. ప్రస్తుతం మనం తెలుగులో కూడా కేవలం బాలలు రాసే గేయ, కథా సంకలనాలు చాలా వస్తున్నాయి. ప్రాథమిక పాఠశాలలో బాలల రాసే ఈ సాహిత్యాన్ని ఉపాధ్యాయులు సంకలన రూపంలో తెస్తున్నారు. ఇది హర్షించదగ్గ విషయమే.బాలసాహిత్యంలో కథా సాహిత్యం పద్య సాహిత్యం గేయ సాహిత్యం అలాగే నటనా సాహిత్యం వివిధ ప్రక్రియలుగా శాఖోపశాఖలై ఉన్నాయి.ఇందులో లో కథా సాహిత్యం ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకున్నది. బాలల కథలు వినడం ఒక అనుభూతి అయితే కథని చెప్పడం ఒక నైపుణ్యం.కథని చెప్పేటప్పుడు బాలలకు ఉత్సాహం కలిగించే టట్లు శ్రద్ధగా వినేటట్లు చెప్పడం అదో ప్రత్యేకత. తీసుకున్న ఇతివృత్తం కూడా దశలవారీగా ఒక క్రమంలో చెప్పాలి. లేదంటే అసలుకే ముప్పు వస్తుంది. బాలలలో ఆలకించే ఆ శక్తి తగ్గి పోతుంది. ఒకప్పుడు ఇంట్లో పిల్లలకు తాతయ్యలు నాయనమ్మలు బాలల మనస్తత్వాన్ని అద్దంపట్టే పురాణాల కథలు చెప్పేవారు. ఈ కథలు ప్రతిరోజు రాత్రిపూట చెప్పేవారు. అంటే అధునాతన సీరియల్సు‌తో మనం సరి పోల్చుకోవచ్చు, ఎంతటి పెద్ద కథలైనా చెప్పడానికి ప్రత్యేక రీతులు అనుసరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉత్సాహంతో పాటు, అర్థమయ్యే విధంగా చెప్పాలి. అలా ప్రత్యేకతతో చెప్పడం వల్ల మరి పదిమంది పిల్లలు చుట్టూ చేరే అవకాశం ఉంది.ఈ కథలు వివిధ రకాలుగా మనకు కనిపిస్తాయి 1. పురాణ కథలు 2. జానపద కథలు 3. చారిత్రక కథలు 4. దేశ నాయకుల కథలు 4. వీరగాధలు 5. కాల్పనిక కథలు 6. వైజ్ఞానిక కథలు 7. ఆత్మకథలు 8. భౌగోళిక కథలు ఇవిగాక అనేక విభాగాలు మనం గమనించవచ్చును. ముఖ్యంగా బాలల మనస్తత్వానికి అనుగుణంగా ఈ 8 విభాగాల విభజన సరిపోతుందని చెప్పుకోవచ్చును. మొదటి విభాగంలో రామాయణ మహాభారత భాగవత కథలేకాక అష్టాదశ పురాణాలు కూడా ఇందులోకి వస్తాయి.రామాయణంలో కథలు చెప్పేటప్పుడు బోధకునికి రామాయణ కథ పై పూర్తి అవగాహన ఉండాలి.లేదంటే పాత్రల పేర్లు మారిపోయే ప్రమాదం కూడా ఉంది. శ్రీరాముని గురించి చెప్పేటప్పుడు ఆతని లో గల సద్గుణములు మనసులో పెట్టుకొని కథను జాగ్రత్తగా చెప్పాలి. సీత అలాగే లక్ష్మణ భరత శత్రుఘ్నుల హనుమంతుడి పాత్రలే గాక రావణాది పాత్రలపై పరిపూర్ణ జ్ఞానంతో విశదీకరించి చెప్పాలి. మహాభారత కథను చెప్పేటప్పుడు కౌరవ పాండవులు ఇంకా ఇతర పాత్రలపై పూర్తి అవగాహన తో పాటు వారి గుణ గణాలు చెప్పడంలో బాలల ఆసక్తి కలిగించాలి, మరియు నాటి సాంప్రదాయాలను అంతర్లీనంగా మంచి చెడు లక్షణాలు బోధిస్తూ, ఆదర్శవంతులుగా తీర్చిదిద్దడంలో ఈ కథలు ఉపయోగపడాలి. ఇక భాగవతం తీసుకుంటే భక్తి జ్ఞానంతో పాటు మానసిక శక్తి పెంపొందించాలి. ఇవి దృష్టిలో పెట్టుకొని పురాణ కథలు పిల్లలకు చెప్పినప్పుడే సత్ఫలితాలను ఇస్తుంది.(ఇంకా ఉంది)--బెహరా ఉమామహేశ్వరరావు పార్వతీపురం-535501సెల్ నెంబర్: 9290062336


కామెంట్‌లు