10. బాలసాహిత్యంలో మొదటి అడుగు---1976లో గెంబలివారి వీధి పాఠశాల నుంచి దుగరాజుపేట పాఠశాలకు నాకు బదిలీ అయింది. దుగరాజుపేట పాఠశాల ఎలిమెంటరీ స్కూల్.ప్రధానోపాధ్యాయులతో కలసి నలుగురమే స్టేఫ్.అక్కడ ప్రధానోపాధ్యాయులు శ్రీ భమిడిపాటిసుబ్రహ్మణ్యం గారు. ఆయన కాకుండా నా చిన్ననాటి మిత్రుడు ఆర్వీ రమణమూర్తి నాతో పాటు బదిలీ అయిన మంథా భానుమతి మేడం గారు అక్కడ సహోపాధ్యాయులు. ప్రధానోపాధ్యాయులు నాకు 3వ తరగతి పూర్తిగాను 4వ తరగతి తెలుగు, సాంఘిక శాస్త్రం అదనంగా చెప్పమన్నారు.ఆ పాఠశాల రాయఘడ రోడ్ లోని ఒక పెంకుటిల్లులో ఉండేది.అక్కడకు నాకు బదిలీ కాక ముందు మా చిన్నన్నయ్య వరహా నరసింహారావు గారు అక్కడ కొన్నాళ్ళు ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు.అప్పటి నుంచి ఆ పాఠశాల అక్కడ విద్యార్థులు నాకు పరిచయమే.ఆ పాఠశాలకు వచ్చే విద్యార్థులు ఎక్కువ మంది బాగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారు. తల్లిదండ్రులు కూలీనాలీ చేసేవారే ఎక్కువ. తరువాత స్థానం బస్సుల్లో లారీల్లో పనిచేసే వారిది.కళాసీ పని చేసేవారు కూడా ఉండేవారు. ఎక్కువ మంది నిరక్షరాస్యులుండే వారు.పిలిపిస్తే కానీ బడికి రాని పిల్లలే ఎక్కువ.బడి ఉండే ఇంటి ఓనర్ ఇల్లు సొంతానికి వాడుకుంటామని బడి ఖాళీ చేయించారు. బడిని అక్కడ నుంచి కొత్త వీధికి మేనేజ్మెంట్ వారు తరలించారు..కొత్త వీధి లో కూడా ఒక ఇల్లు లాంటిదే బడి నిర్వహించడానికి దొరికింది. ఒక పాత భవనమది.మెట్లు లేని డాబా ఇల్లు.పక్కన ప్రసిద్ధి కెక్కిన శ్రీ త్రినాథస్వామి వారి దేవాలయం.కొత్త విద్యా సంవత్సరం ఆరంభం కాగానే నేను ప్రధానోపాధ్యాయులు వద్ద 1వ తరగతి చెబుతానని కోరాను. అందుకాయన సమ్మతించారు. దాంతో నేను 1వ తరగతి క్లాస్ టీచర్ నయ్యాను.ఆ పై నాలుగో తరగతితెలుగు, సాంఘిక శాస్త్రం చెప్పాలి. నేను 1వ తరగతి చెప్పాలనుకోడానికిముఖ్యమైన కారణముంది.ఆ పసిపిల్లలు నా ద్వారా ప్రాథమికంగా భాషానైపుణ్యాలు పొందాలి.వాళ్ళు అక్షరాలు రాసే విధానం నా ద్వారా తెలుసుకోవాలి.ఒకొక్క అక్షరం వాళ్ళు నేర్చుకొని ఆనందం పొందుతూంటే ఆ ఆనందం చూసి నేను సరదా పడాలి.ఒకొక్కపదం వాళ్ళు కూడబలుక్కొని చదువుతూంటే 1వ తరగతి ఉపాధ్యాయుడికి అంత కంటే ఆనందం ఏముంటుంది?ఆ ఆనందాన్ని మాటల్తో కొలవలేం. అది అనుభవైకవేద్యమే. ఆ కోరిక నాకు బాగానే తీరింది.అలా రెండు సంవత్సరాలు గడిచాయి.1979 ఫిబ్రవరిలో ఒక సంఘటన జరిగింది. ఉదయం పూట మొదటి పీరియడ్ లో 1వ తరగతి పిల్లలచే వర్ణమాల చదివించడం ఒక గుణింతం చదివించడం నాకు అలవాటు. ఆ రోజు తరగతి గదిలో ప్రవేశించి ఎప్పటిలా వర్ణమాల పిల్లలచే చదివించుతున్నాను.పిల్లలు నేనుచెబుతున్న అక్షరాలు పలకకుండా బయటకు ఎగిరెగిరి చూస్తున్నారు. ఒక పిల్లడు చిలక చిలక అని అరిచాడు.ఒక పాప పచ్చగుందని అరిచింది. ఎగిరిపోయిందిరా అని మరో విద్యార్థి అన్నాడు. ముక్కు ఎర్రగా ఉందని ఇంకొక పాపంది.ఇంకొకడు మరో అడుగు ముందుకు వేసి అదీ...చిలక ముక్కు ఎర్రగా ఉంది కాకి ముక్కు నల్లగా ఉందన్నాడు.పాఠం వినడం లేదని నాకు కోపం రాలేదు. పిల్లలు చూసే వైపు చూశాను. మర్రిచెట్టు మీద చిలుక వాలుతుంది ఎగురుతుంది. కీర్ కీర్ అంటుంది.అంతలో ఒక కుర్రాడు చిలక్కి పళ్ళంటే ఇష్టం అన్నాడు.ఆ దృశ్యం చూసి పిల్లలతో పాటు నేనూ ఆనందించాను.అంతటితో ఆగకుండా అప్రయత్నంగా ఎదురుగా కూర్చున్న కుర్రాడి పలకా బలపం తీసుకొని పిల్లలు అనే మాటలతోనే గబ గబ ఒక గేయం పలక మీద రాశాను.చిలక ఎటో ఎగిరిపోయింది. పిల్లలు చప్పున చల్లారి పోయారు.తరగతిలో కేకలు వేసినందుకు కోప్పడతానేమో అని అనుకున్నారేమో నిశ్శబ్దమైపోయి నా వైపు చూస్తున్నారు. అప్పుడు నేను రాసిన పాట పాడాను.పిల్లలు సరదా పడ్డారు. కోరస్ గా పాడించాను చిలక వాలిన చెట్టును చూపిస్తూ.ఆ చెట్టు మీద ఇంకా ఆ చిలక ఉన్నట్టే భ్రమిస్తూ పిల్లలు ఉత్సాహంగా పాడారు. చిలుక!చిలుక! పచ్చని చిలుక! ఆకాశాన ఎగిరే చిలుక! ఆకుల్లోన కలిసే చిలుక! చక్కని పలుకులు పలికే చిలుక! తీయని పళ్ళు కొరికే చిలుక! నీ ముక్కు ఎరుపు! కాకి ముక్కు నలుపు!! అదండీ ఆ రోజు పిల్లల సాక్షిగా తయారయ్యే పాట!ఆ పాట నెందుకు అంతగా పిల్లలిష్టపడ్డారు అని ఆలోచిస్తే నాకు మూడు విషయాలు తట్టాయి.మొదటి విషయం పిల్లలు అమితంగా ఇష్టపడే చిలక మీద రాశాను.అందునా వాళ్లు ప్రత్యక్షంగాచూసిన చిలక మీద! రెండవది వాళ్ళు చిలకనుచూసి అప్రయత్నంగా పలికే మాటలతోనే పాటరాశాను! మూడవది పాటలో లయ ఉంది.ఆ మూడు విషయాలు అనుకోకుండా పాటలో ఒదిగి పోయాయి. మర్నాడే విశాఖపట్నం నుంచి శ్రీ మసూనా(మండా సూర్యనారాయణ)గారిసంపాదకత్వం లో వెలువడే శుభోదయ అనే ఒక పక్ష పత్రిక కు ఆ పాటను పంపేను.ఫిబ్రవరి చివరి వారంలో పంపిన ఆ పాటను మార్చి నెలమొదటి పక్ష పత్రిక లో వేసి కాంప్లిమెంటరీ కాపీని పంపేరు.అదండీ అచ్చయిన తొలి బాలగేయం!అచ్చయిన తొలి రచన కూడా అదే!! నాన్న గారు ఆ గేయం చూసి సంతోషించారు.రెండవ పూట స్కూల్ కి వెళ్ళినప్పుడు ఆ పత్రిక పట్టుకుని వెళ్ళాను.టీచర్లు పిల్లలుసరదా పడ్డారు.ఇదండీ నా తొలి బాలగేయం కథ!నా విద్యార్ధి బాలదేవుళ్ళే నా బాలసాహిత్యం దారికి దారి దీపాలయ్యారు. ఒకముఖ్య విషయం ఈ సందర్భంగా చెప్పలేకుండా ఉండలేక పోతున్నాను.అప్పుడు నేను పని చేసే స్కూల్ కి ఎదురుగున్న ఇల్లే నేను ఇల్లు కొనాలనుకున్న సమయంలో తారసపడింది.ఇంటి బయటకొస్తే చాలు అప్పటి బడి ఉండేచోటు కనిపిస్తాది.కాని ఆ బడి మాత్రం లేదు.అప్పటి ఆ జాగాలో ఒక పెద్ద భవనమే వెలిసింది. అయినా అటు చూడగానే ఆ మధుర సంఘటన జ్ఞాపకం రాకుండా ఉండదు! (సశేషం) -బెలగాం భీమేశ్వరరావు పార్వతీపురం 9989537835


కామెంట్‌లు