బాల సాహిత్యం గురించి చెప్పుకునే ముందు, తెలుగు భాష కావ్య ఆరంభమును గురించి మనం తెలుసుకుందాం. తెలుగు భాష వాగ్రూపం నుండి కావ్య రూపంగా ఉద్భవించిన కాలమాన పరిస్థితులు తెలుసుకుందాం.తెలుగు భాష-లిపి; పుట్టుక పరిణామ దశ లలో మొట్ట మొదటి దశ గురించి మనం తెలుసుకుందాం. 11వ శతాబ్దంలో రాజమహేంద్రవరం రాజధానిగా చేసుకొని పరిపాలించిన రాజరాజ నరేంద్రుడను చక్రవర్తి ఇందుకు మూల పురుషుడు. ఈయన చంద్రవంశంలో జన్మించిన రాజు. ఈయన ఆస్థాన కవి నన్నయ భట్టు.రాజరాజ నరేంద్రుడు తన వంశము వారైనా పాండవుల చరిత్ర అనగా మహాభారతాన్ని తెనిగించమని, ఆస్థాన పండితుడు అయిన నన్నయ భట్టు ను కోరాడు. ఆయన కోరిక ప్రకారం మహాభారతాన్ని ఆంధ్రీకరించారు.నన్నయభట్టు మహాకవి. ఆయన ఉభయ భాషా పండితుడు. ఆయన ప్రజామోదం కోరి తెలుగులో రచించడం జరిగింది. ఆయన సహచరుడు, మరియు ఆప్తమిత్రుడైన నారాయణ భట్టు సహకరించడం జరిగింది.(మొలక న్యూస్ అంతర్జాతీయ పత్రికల్లో ప్రతిరోజు వ్యాసాలు వస్తున్నాయి -11)నన్నయభట్టు గొప్పతనం: మహాభారత రచనలో ఈ కవి గొప్పదనం మనకు కనిపిస్తుంది. ఈయన ఆనాడు అస్తవ్యస్తంగా ఉన్న తెలుగు భాషను ముందుగ సంస్కరించడం జరిగింది. ఈ కావ్య రచన కోసమే ఆంధ్ర శబ్ద చింతామణి అను వ్యాకరణాన్ని రచించారు మరియు లక్షణ సారము అనే ఛందస్సు కూడా రచన చేశారు. ఈయన రాసిన మహాభారతంలో అక్షర రమ్యత కనబడుతుంది.నానా రుచిరార్ధ సూక్తి గోచరిస్తుంది. ఏ కావ్యనికైన అక్షర రమ్యత ఉండాలి. రసయుక్తమై కూడ ఉండాలి.అట్టి లక్షణాలతో నన్నయ్య భట్టు మహా భారత కావ్య రచన చేశారు. ఈయన మహాభారతాన్ని పూర్తిగా ఆంధ్రకరించలేక పోయారు. ఆది, సభ ,అరణ్య పర్వము లోని కొన్ని భాగాలు మాత్రమే తెగించారు. తర్వాత కాలంలో తిక్కన ఎర్రాప్రగడలు అను మరో ఇరువురు కవులు శేష భారతాన్ని పూరించారు.నన్నయ మహా కవి మహాభారతాన్ని ఆంధ్రీకరిచినప్పుడు, మొట్టమొదటిగా ఈ సంస్కృత శ్లోకం తో ప్రారంభించారు. ఇది త్రిమూర్తులను ప్రార్థిస్తూ చెప్పిన మంగళ శ్లోకం: శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు యే/లోకానాం స్థితి మానహ న్త్య విహితం స్త్రీపుం సంయోగ ఉద్భవం/ తే వేదత్రయ మూర్తయ స్త్రీ పురుషా స్సం పూజిత వస్సురై/ ర్భూయాస్సుః పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే// భావం: లక్ష్మి సరస్వతి పార్వతులను ఎవరు అనాదిగా వక్షస్థలము నందును, ముఖము నందును శరీరము నందును ధరించుచూ లోకములను నిరంతరాయంగా నిర్వహించుచున్నారో అట్టి మూడు వేదములను ఆ కారంగా ధరించినవారును. దేవతలచే పూజింపబడు వారైనా అగు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను మువ్వురు పురుషోత్తములు మీకు శ్రేయస్సును కలిగింతురు గాక! నన్నయ భట్టు తన కవిత్వం లో గల మూడు ప్రత్యేక గుణాలను ఈ పద్యం ద్వారా వివరించారు:సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కళితార్థ యుక్తి లో/నా రాసి మేలునా,నితరు లక్షర రమ్యత నాధరింప నా/నారుచిరార్ధ సూక్తి నిధి నన్నయభట్టు తెనుంగున న్ మహా/భారత సంహితా రచన బంధురుడు అయ్యే జగద్ధితంబుగన్//భావం: నన్నయ మహాభారతాన్ని అనువదించటం లో మూడు ముఖ్య విషయాలకు అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. అవి ఏమనగా 1. ప్రసన్నమైన కథాకలితార్థ యుక్తి 2. అక్షర రమ్యత 3. నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వము. భారత ఆంధ్రీకరణ లో ఈ మూడు గుణాలకు నన్నయ్య ప్రాధాన్యత ఇచ్చిన విషయం పై పద్యం ద్వారా మనకు తెలుస్తుంది.మహా భారతంలోని శకుంతల ఉపాఖ్యానము లో సత్య వాక్యము విలువ గురించి మంచి పద్యం ఉదహరించి రాశారు. దుష్యంతునితో శకుంతలకు గాంధర్వ వివాహం జరుగుతుంది. ఇదీ కణ్వ మహర్షి ఆశ్రమంలో జరుగుతుంది. ఈ వివాహానికి సాక్షులు ఎవరూ ఉండరు. కొన్నాళ్ళకు ఆమె తన భర్త అయిన దుష్యంత మహారాజు సభకు వెళుతుంది. ఆయన శకుంతలతో వివాహము జరగలేదని నిరాకరిస్తాడు. అట్టి సమయములో శకుంతల సత్యం పలుకు మని, మరియు సత్యవాక్యం విలువ ఈ పద్యం ద్వారా తెలియజేస్తుంది. నుత జల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సూనృత/వ్రత! యొక బావి మేలు, మరి బావులు నూరిటిమ కంటే నొక్క స/త్కృతు వది మేలు తత్క్రతు శతకంబు కంటే సుతుండు మేలు త/త్సుతు శతకంబు కంటే నొక సూనృతవాక్యము మేలు చూడగన్// భావం: నిండా నీరున్న నూరు గోతుల కంటే ఒక బావి మేలు. నూరు బావుల కంటే ఒక్క క్రతువు (ప్రజాపతి)మేలు. నూరు క్రతువుల కంటే ఒక్కకుమారుడు మేలు. పరిశీలించగా నూరుగురు కుమారులు కంటే ఒకే ఒక్క సత్యవాక్యము మేలు.అతి విలువైనది ప్రియమైనది. నన్నయ్య వ్రాసిన మహాభారతంలోని ఈ పద్యం సత్యము యొక్క విలువ తెలుపుతుంది. ఇటువంటి పద్యములు నాడు 8వ తరగతి 9వ తరగతి వాచ పుస్తకాల్లో ఉండేవి. అవి కంఠస్తం చేయించే వాళ్ళు. ఇవి భవిష్యత్తులో మంచి ప్రవర్తనకు దోహదపడేవి ఇటువంటి పద్యాలు లేకపోవడం నేడు విద్యా ప్రణాళికు లోటు అనిపిస్తుంది.ఆనాడు తెలుగు వాచక పుస్తకాల్లోని పాఠాలలో పద్య విభాగానికి చెందిన కొన్ని ముఖ్య పద్యాలు * ఈ గుర్తు తో ఉండేవి. ఇవి కంఠస్థ పద్యాలు పరీక్షలలో కూడా పద్యాలకు మార్కులు ఉండేవి. ఆ విధంగా పద్యాలు ఉండడం వల్ల చక్కటి పాఠ్య బోధన తో పాటు నాటి పిల్లల నాలుకలపై నాట్యం చేసేవి. బాలలను గుణవంతులుగా తీర్చిదిద్దడానికి ఈ పద్యాలు దోహదపడేవి.మన పిల్లలకు రామాయణం మహాభారతం భాగవతం లోని పద్యాలు కంఠస్తం చేయించడం ఎంతో సుగుణం. నేడు కూడా అతి కొద్దిమంది ఇలా పిల్లలచే పద్యాలు కంఠస్తం చేయిస్తున్నారు. అభినందనీయం కదా! --బెహరా ఉమామహేశ్వరరావు. పార్వతీపురంసెల్ నెంబర్ 9290061336


కామెంట్‌లు