అలిశెట్టి ప్రభాకర్ తను శవమై ఒకరికి వశమై తనువు పుండై ఒకడికి పండై ఎప్పుడూ ఎడారై ఎందరికో ఒయాసిస్సై.... నేను మొట్టమొదటగా చదివిన అలిశెట్టి ప్రభాకర్ కవిత ఇదే. అదీనూ హైదరాబాద్ రాంనగర్లో పాత్రికేయులు జి. కృష్ణగారింటికి భుజాన ఓ కెమేరా తగిలించుకుని వస్తున్నప్పటి నుంచీ ఎరుగుదును. ప్రభాకర్ నివాసముండిన ఇల్లు కృష్ణగారింటికి వెనకాతలే ఉండేది. ఒకటి కాదు రెండు కాదు తరచూ కృష్ణగారింటికి వచ్చివెళ్తుండేవారు ప్రభాకర్. వాళ్ళావిడ భాగ్యలక్ష్మిగారూ పిలల్లలూకూడా వస్తుండేవారు. కృష్ణగారికి ఓమారు ప్రభాకర్ ఓ చిన్ని కవితల పుస్తకం ఇవ్వగా అందులో "వేశ్య" కవిత చూసి బలే రాశారనుకున్నాను. క్రమంగా అలిశెట్టి ప్రభాకర్ అభిమానినయ్యాను. కానీ నేను ఆయనతో మాట్లాడింది చాలా చాలా తక్కువ. కృష్ణగారింటే కాదు రాంనగర్ రోడ్లల్లో ఎక్కడైనా కనిపిస్తే ఒక్క నవ్వు నవ్వేవాడిని.ఏడేళ్ళ క్రితం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్బులో జనవరి 12వ తేదీన అలిశెట్టి ప్రభాకర్ కవితా సర్వస్వం ఆవిష్కృత సభ జరిగితే నేనూ రేణుకా వెళ్ళాం. ఆరోజు సభలో ఎవరెవరు ఏం మాట్లాడారో గుర్తుకు రావడం లేదు కానీ అలిశెట్టివారబ్బాయ్ సంగ్రామ్ తో మాట్లాడాను. పుస్తకం కొన్నాను. సంగ్రామ్ చాలా చిన్నవాడు నేను రాంనగర్లో చూసినప్పుడు. అలిశెట్టి కవితా సంపుటిలో మొత్తం ఏడు పుస్తకాల సమాహారం. మరో మాటలో చెప్పాలంటే మూడు వందల ముప్పై అయిదు పేజీలలోని ప్రతి మాటా ప్రభాకరంటే ఎవరో తెలియని వాళ్ళకీ తెలియచెప్తుంది. తన భార్య భాగ్యలక్ష్మి గారి గురించి ఓ కవిత రాశారు..... "నాకు బెర్నార్డ్ షాలు, షేక్ స్పియర్ లూ తెలియదు తనకు గుడిపాటి వెంకటాచలం, గురజాడా తెలియదుఇద్దరం ఉత్త పిచ్చివాళ్ళంకాని - అడుగంటిన కిరసనాయిలు స్టవ్ తో అన్నం ఎట్లా ఉడికించాలో తనకు తెలుసు దగ్గు తెరల నెత్తుటి రెపరెపల ఊపిరితిత్తుల్తోకవిత్వమెట్లా రాజేయాలో నాకు తెలుసు...."ఇలా తమకేం తెలీదు ఏం తెలుసువంటివి చెప్తూ ..."గాజుకుప్పెల్లాంటి నా కళ్ళల్లోనే ఆశల అగరొత్తులు వెలిగించుకుందే తప్పతులతూగే ఐశ్వర్యమో తులం బంగారమో కావాలని ఏనాడూ ప్రాధేయపడలేదు" అని రాసుకున్న మాటల్తో ప్రభాకర్ జీవనశైలీ, నిజాయితీ, పట్టుదల విదితమవుతాయి. మరణం నా చివరి చరణం కాదు అనే విభాగానికి రాసుకున్న ముందుమాటలో ప్రభాకర్ ... "వేదనాభరితమైన నా కవితాక్షరాన్ని వేశ్యా వాటికనే పలకమీద దిద్దుకున్నప్పుడూ అక్షరనేత్రం తెరిచి ఆనాటి దొరతనాన్ని ఆగ్రహించినప్పుడూ బహుశా నాకు పద్దెనిదేళ్ళు" అని చెప్తూ కుంచె నుంచి ప్రవహించే చైతన్యం ఘనీభవించి కెమేరా ముందు సృజనాత్మకత ఒక అపరిపక్వ స్వప్నంగానే చితికిపోయి నానాటికీ దారిద్ర్యమనే ఊబిలోకి దిగబడి బహుశా ఏ పౌరుడూ పాత్రికేయుడూ పడనన్ని కష్టాలతో చితికి చితికి చివరికి పత్రిక పారితోషికమే జీవనాధారంగా స్వీకరిస్తున్న నేపథ్యంలో హృదయం విప్పి నన్నీ నాలుగు మాటలు చెప్పుకోనివ్వండీ అన్నారు ప్రభాకర్! చిత్రలేఖనంలో చమత్కారంతో పాటు పదునైన కవిత్వం రాయడంలో అలిశెట్టి ప్రభాకర్ అందవేసిన చేయి. ఆయన సాహిత్యంలో కవి కాళోజీ భావాలు కనిపిస్తుంటాయి. తాను గీసిన చిత్రానికి తనే కవిత్వం కూడా రాసుకునే ప్రక్రియతో విశేష ఆదరణ పొందిన ప్రభాకర్ మాటలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తాయి. ప్రభాకర్ శారీరకంగా మనతో లేకపోయినా ఆయన తన చిత్రకవితల ద్వారా ఎప్పటికీ సజీవంగానే ఉంటూ ఉంటారు. ప్రభాకర్‌లాంటి సామాజిక స్పృహ కలిగిన కవులు భవిష్యత్ తరాలకు ఎంతో అవసరం. ఆయన మినీకవితలు తెలుగు రాష్ట్రాలలో ప్రఖ్యాతి చెందినవే. జననం, మరణం ఒకే రోజున (జనవరి 12) కావడం యాధృచ్ఛికం. "అలిశెట్టి ప్రభాకర్ ఓ కవిత్వ మాంత్రికుడు. కుంచెని, కెమెరా లెన్సుని, కలాన్ని ఏకం చేసి తెలుగు కవితకు పుష్టి చేకూర్చిన వినూత్నకవి. ఆయన కవిత్వం గోడలపై నినాదాలై, వ్యాసాలకు మొదలు తుదలై, ప్రజల నోటి నుడికారమై మన మధ్యే ఉంటోంది" అన్న జయధీర్ తిరుమలరావు గారి మాట అక్షర సత్యం. శ్రీశ్రీ తరువాత అంత ఎక్కువగా ‘కోట్’ చేసే కవిత్వం ప్రభాకర్‌ గారిది.సమాజ మార్పును ఆకాంక్షిస్తూ 'మరణం నా చివరి చరణం’ కాదని, సమరమే తన అంతిమ చిరునామా అని ప్రకటించిన ప్రభాకర్ మాన్యుల కవి కాదు, సామాన్యుల కవిగా ముద్రపడిన కవి అని ఆయన సన్మిత్రులైన బి. నర్సన్ గారి అభిప్రాయం. ఆయన కవిత్వంలో సూటిదనం, సరళతలతో పాటు ఒకింత సాహసం కూడా ఉండడమే ప్రభాకర్‌ను భిన్న కవిగా, జనపక్షపాతిగా నిలబెట్టిందన్నారాయన. ప్రభాకర్‌ వ్యక్తిత్వమే ఆయన అక్షరాల్లో ప్రతిఫలించి ఆయన్ని ఉద్యమ కవిగా నిలబెట్టిందనికూడా చెప్పారు బి. నర్సన్.తను రాసి గీసిన కవితా చిత్రాల ఫ్రేమ్‌ల అమ్మకానికీ ముందుకు రాలేదు. ఓసారి ప్రభాకర్‌ తన కవితాచిత్రాలను చేతిలో పట్టుకొని స్కూటర్‌ వెనకాల కూర్చున్నారు. కోఠి చౌరస్తా వద్ద సిగ్నల్‌ పడింది. పక్కనే కారులో ఉన్నాయన ప్రభాకర్‌ చేతిలోని చిత్రాలను చూసి సిగ్నల్‌ దాటాక ఆగవలసిందిగా కోరారు.స్కూటర్‌ నడుపుతున్నాయన ముందుకెళ్లి ఆపారు.కారులోంచి దిగొచ్చిన మనిషి ఓ ఫ్రేమ్‌ చూపిస్తూ అది తనకు కావాలని, ఎంతకిస్తారని అడిగారు.కానీ ప్రభాకర్ "అది అమ్మడానికి కాదని జవాబిచ్చారు. కావాలని అడిగిన మనిషి ఎన్టీఆర్‌కు దగ్గరి బంధువు, ఆనాడు పార్లమెంట్‌ సభ్యుడు. స్కూటర్‌పై ప్రభాకర్‌ను తీసుకెళ్లిన ఓ మిత్రుడు నర్సన్ గారికి చెప్పడంతో ఈ విషయం తెలిసింది.స్వస్థలం నుంచిహైదరాబాద్‌ వచ్చాక ప్రభాకర్‌ గారికి ఫొటో స్టూడియో చిరునామాగా మిగిలింది గాని ఆదాయ వనరు కాలేదు. కిరాయి చెల్లించలేక విద్యానగర్‌ నుండి స్టూడియోను నారాయణగూడ నాలా పక్కన పాత దుకాణంలోకి మార్చారు. కవితలతో అందరి అభిమానాన్ని పొందిన ప్రభాకర్ తన 39వ ఏట 1993 జనవరి 12 వ తేదీ ఉదయం తుదిశ్వాస విడిచారు. నాకెంతో ఇష్టమైన కవి. చిత్రకవి. డబ్బుకోసం వెంపర్లాడని ప్రభాకర్ కలాన్ని మాత్రమే అందుకున్న కవి. అక్షరాన్ని నమ్ముకున్న కవి. అంతేతప్ప తనను అమ్ముకోని మహా కవి.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు