మానేరు ముచ్చట్లు-రామ్మోహన్ రావు తుమ్మూరి -కథ చెప్పటం వేరు.చరిత్ర చెప్పటం వేరు.చూసిన విషయాలను తెలియజేయటం వేరు.నేను తలకెత్తుకున్న ఈ ముచ్చట్ల పని కొంత ప్రయాసతో,కొంత సజావుగా సాగుతూ వస్తున్నది. చరిత్ర పరంగా గతంలో రుద్రదేవుడు,అతని సోదరుడు మహా దేవుడు యాదవరాజైన జైతుగి తో తలపడి మరణించినట్లు,మహాదేవుని కుమారుడైన గణపతి దేవుడు యాదవ రాజు నిర్బంధంలో ఉండగా రేచర్ల రుద్రునివంటి విశ్వాసపాత్రులైన మంత్రులు దేవగిరి పాలకుడైన జైత్రపాలుడు లేదా జైతుగి తో సంధి చేసుకుని గణపతి దేవుని త్రిలింగాధి పతిగా చేశారు.ప్రతిభాశాలియైన గణపతిదేవ చక్రవర్తి తన అసమాన పరాక్రమాలతో కాకతీయ సామ్రాజ్యాన్నివిస్తరింపజేసి ఆరుదశాబ్దాలకాలం పరిపాలించాడు.అతని పరిపాలనా కాలంలోనే పురుషరూపంలో రుద్రదేవు డనే పేరుతో గణపతిదేవుని కుమార్తె రుద్రమదేవి తన శక్తిని చాటుకున్నది. తండ్రి వృద్ధాప్యకారణంగా క్రీ.శ.1262లో రాణీ రుద్రమ కాకతీయసింహాసనాన్ని అధిష్టించింది.తెలుగు దేశచరిత్రలోనే ఒక మహిళ సమర్థవంతంగా పరిపాలిం చి పేరు ప్రఖ్యాతులు వహించటం అపూర్వం.రుద్రమ దేవి వివాహం చాళుక్యరాజైన వీరభద్రునితో జరిగింది.వీరికి పురుష సంతానం లేదు.ముగ్గురు కూతుళ్లే. ముమ్మడమ్మ, రుద్ర మ్మ, రుయ్యమ్మ లలో ముమ్మడమ్మను కాకతీయ వంశానికి చెందిన మహాదేవునికిచ్చి పెండ్లి చేయగా వారి సంతానమైన ప్రతాపరుద్రుడుని తనవారసునిగా చేసింది.ఈమె పరిపాలన 1289 వరకు సాగింది. అనంతరం రాజైన ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తానులను ఎదుర్కోవలసి వచ్చింది.మొదట మామ జలాలుద్దీన్ ఖిల్జీని చంపి రాజైన అల్లావుద్దీన్ ఖిల్జీ పేరుతో రాజైన గరషాస్ప్ మాలిక్ కన్ను దక్షిణ దేశంపై పడింది.అంతకు మునుపే అతడు దేవగిరిపై దాడి చేసి అపార ధనసంపదను కొల్లగొట్టుకోవ డంతో ఆ ప్రమాదం ఎప్పుడైనా తమకు చుటిటరోవచ్చునని ప్రతాపరుద్రుడు సర్వ సన్నద్ధుడై తొలుత వారికి బలమైన పోటీగా నిలిచినా తరువాతి కాలంలో రాజైన మహమ్మద్ బిన్ తుగ్లక్ (ఉలగ్ ఖాన్) చేతిలో బందీయై ఢిల్లీకి కొనిపోయే మార్గ మధ్యంలో నర్మదానదిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నాడు.ఆ విధంగా 1323 లో ఓరుగల్లు మొదటి సారి మహమ్మదీయుల కైవసమయింది.గణపతి దేవుని పెదనాన్న రుద్రదేవుని కాలంలోనే సబ్బిసాయిర మండలానికి కొంత గుర్తింపు కలిగింది.గణపతి దేవుని పరిపాలనలో అతని సైన్యాధ్యక్షుడైన మల్యాల వంశీయుడు చౌండసేనాని కాలంలో కొన్ని శాసనాలు తొలి దశాబ్దంలో కనిపిస్తున్నాయి. అలాంటి వాటిలో క్రీ.శ.1202 నాటి ఎలగందుల చింతామణి చెరువు కట్టమీది శాసనమొకటి.నిజానికి కాకతీయుల కాలంలో సబ్బిసాయిరమండలానికి చెందిన చరిత్ర లేదనే చెప్పాలి. అంటే ఎవరో పరిపాలనాధికారులు ఉండి ఉండవచ్చు.కాని ఏ శాసనాధారం లేకుండా ఏమీ చెప్పలేని పరిస్థితి.ఒకటి రెండుచోట్ల లభించిన తామ్ర శాసనాల ఆధారంగా అక్షయ చంద్రదేవుడు పరిపాలకుడుగా తెలుస్తున్నది.బాగా ఆలోచించినట్లయితే వేములవాడ చాళుక్యుల కాలం నుండికూడా సబ్బిసాయిరం ధాన్యోత్పత్తికి ఆలవాలమైన ప్రదేశంగా కనిపిస్తుంది.పంటలు పండించే రైతుల కనీసావస రాలకోసం వివిధ వృత్తులవారు వారి నాశ్రయించి ప్రశాంత గ్రామ స్వరాజ్య జీవన విధానంలో కొనసాగినట్లుగా అనిపిస్తున్నది. పరిపాలనాధికారులు గ్రామ తగాదాలను పరిష్కరించడానికిపన్నులు వసూలు చేసి బొక్కసాన్ని సమృద్ధి చేయడానికి యాంత్రికంగా ఉండి ఉంటారనిపిస్తుంది. కొంతమేరకు మల్యాల వంశీయుడై న చౌండ సేనాని ప్రభావం ఉండి ఉండవచ్చునని ఇక్కడ ఇప్పటి వరకూ ఉన్న మల్యాల వంశీయులను బట్టి గాని,ఈ ప్రాంతములో మల్యాల పేరుతో పలు గ్రామాలు ఉండటంవల్ల గాని తెలుస్తున్నది.(సశేషం)


కామెంట్‌లు