మానేరు ముచ్చట్లు-రామ్మోహన్ రావు తుమ్మూరి .-చరిత్రతో సంబంధం లేక పోతే మడికి సింగన వెలిగందల కందనల విషయంలో పేచీ ఉండదు.కానీ చరిత్రకు అన్వయించాల్సి వస్తే కొన్ని చిక్కులు కనిపిస్తున్నాయి.తొలిదశలో కందుకూరి వంటివారు కవుల పరంగా వారు రాసిన కావ్యాల ఆధారంగా కవుల జీవిత చరిత్రరాశారు.అలాగే చరిత్ర కారులు శాసనాల ఆధారంగా చరిత్రను లిఖించారు. అక్కడ క్కడ చరిత్రకారులు కావ్యాలను,సాహిత్య పరిశోధకులు శాసనాలను ఆధారం చేసుకోవటం కూడా జరిగింది.ఇందులో స్థానిక చరిత్రకారులు,అన్యమత చరిత్రకారులు,విదేశీవచరిత్రకారులు ఎవరి పరిశీలనను బట్టి వారురాసారు.ఎవరి దృక్పథాన్ని బట్టి వారు కొన్ని అంశాలకుప్రాధాన్యతను ఇచ్చారు.అది అనివార్యమైన అంశం కూడా.ఇంకొక పెద్ద చిక్కఏమిటంటే చాలా వరకు ఒకే పేరు చాలా మందికి ఉండటం.రుద్రదేవుడనే పేరు కాకతీయుల్లోనే కాక వేరే వంశీయులలో ఉన్నది.అనపోతనాయకుడు అటు ముసునూరి నాయకులలో ఉన్నాడు. ఇటు రేచర్ల వెలమ నాయకులలో ఉన్నాడు.గణపతి దేవ చక్రవర్తి తండ్రిమహాదేవుడే.రుద్రమ కాలంలో దేవగిరి పాలకుడు మహాదేవుడే.శాసనాలలో కొన్ని తేదీలు లేని శాసనాలు,అక్షరాలు క్షతమైన శాసనాలు,అలాగే తాటాకుల గ్రంథాలు కొన్ని ఖిలమైనవి,పూర్తి వివరాలు లేనివి అప్పుడప్పుడూ తికమక పెడుతుంటాయి.ఒక దాన్ని బలపరచాల నుకుంటే ఇంకొకటి అడ్డం తగులు తుంది.ఊహించి రాయలేం.అసమగ్రం తో సంతృప్తి పడలేం.ఇంకా కొన్ని విషయాలు చదువుతుంటే వారు లోతుగా పరిశీలించక కొన్ని వివాదాలు సృష్టించడం కూడా జరిగింది. ఇంతకీ ఇంత ఉపోద్ఘాతం దేనికోసమనే సందేహం మీకు తప్పక కలుగు తుంది.అదే వివరించే ప్రయత్నం చేస్తాను. ముప్పభూపాలుడు,కందన మంత్రి, మడికి సింగన వీరి మువ్వురి వంశావళికి,చారిత్రక సంఘటనలకు,సాహిత్య సన్నివేశాలకు ఓ పట్టాన పొంతన కుదరక చరిత్రకారులు,సాహిత్య చరిత్ర కారులు మల్లగుల్లాలపట్టడం కనిపిస్తుంది.డా.కుసుమాబాయి గారి మడికి సింగన పరిశోధన గ్రంథంలో ఈ చర్చలన్నీ వివరించబడ్డాయి కూడా.కందనకు మడికి సింగనకూ వారి తాతముత్తాతల వంశ చరిత్రల ఆధారంగా వయసులు ఇంచుమించు సరిపోతున్నాయి. ముప్పభూపాలని విషయమే అందులో స్పష్టంగా తేల్చలేదు.కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో ఆయనకు తోడుగా ఉండి ఆయనతో పాటు యుద్ధాలలో పాల్గొని బిరుదులు వహించిన ముప్పభూపాలుడు,రామగిరిపాలించిన ముప్పభూపతి ఒక్కరవడానికిఅవకాశం తక్కువగా ఉంది.కాని ఆయన మనుమడైతే చక్కగా సరిపోతుంది.అది ఎవరూ నిర్ధారించలేదు.మడికి సింగన పద్యం ‘కూనయ మప్పనృపాలకసూనుశ్రీ తెలుగు నృపతి సుదతీ మల్లాం బానందనుడగు ముప్పయభూనాథుని సుకవి వరుడ బుధసన్నుతుడన్ ‘స్పష్టంగా ముప్పనృపాలకుని మనుమడు ముప్పభూపతి యని ఉంది కదా!మరొక విషయం కాంచీ పాండ్యరాజు చనిపోతే వీరపాండ్యుడు,సుందర పాండ్యుడు రాజ్యాధికారం కోసం తగవులాడుతూ,అందులో సుందర పాండ్యుడు తనకు సహాయమందించ వలసిందిగా అప్పటి ఢిల్లీ పాలకుడు అల్లాఉద్దీన్ ఖిల్జీని కోరుతాడు.ఖిల్జీకి వీలుగాక ఆ పనిని ప్రతాపరుద్రునికి అప్పగిస్తాడు.ఇదే అదనుగా ప్రతాప రుద్రుడు దక్షిణ దేశదండయాత్రకు సిద్ధమవుతాడు.అప్పుడు ముప్పసేనాని ప్రతాపరుద్రుని పనుపున దక్షిణదేశ యాత్రకు బయలుదేరుతాడు. అతనికంటే ముందు అతని కుమారుడుపెదరుద్రుడు బయలుదేరుతాడు. 1316లో ముప్పభూపతి నెల్లూరును స్వాధీనం చేసుకోగా అతనిని ప్రతాపరుద్రుడు నెల్లూరు పాలకునిగా నియమించినట్లుచరిత్ర చెబుతున్నది. ఇంతలో ఖిల్జీ మరణ వార్త విని తోడు వచ్చిన ముస్లిం సైన్యం వెనుకకు మరలగా పెదరుద్రునికితోడుగా ప్రతాపరుద్రుడే వెళ్లి కాంచీనగ రం పై కాకతీయ జండా ఎగుర వేసినట్లు కూడా కాకతీయుల చరిత్రలో ఉన్నది. ఇంత చెప్పటంలో ఉద్దేశం 1316 లోనేముప్పభూపతికి యుద్ధం చేయగల కొడుకు కలిగి ఉన్నాడంటే తరువాత ఎప్పుడో 1936లో అదే ముప్పభూపా లుని కాపయనాయకుడు రామగిరికి రాజుగా చేయటం ఎంతవరకు సమంజసం అని నా సందేహం. మరొక చోట 1335 నాటి తెలుగు నృపతి త్రిపురాంతకం శాసనం ప్రస్తావన ఉన్నది.తెలుగు విజ్ఞాన సర్వస్వం సంపుటం-9,ఆంధ్రప్రదేశ్ చరిత్ర (పొ.శ్రీ.తె.వి.వి.) ప్రకారం కాకతీయ ప్రతాప రుద్రుని సేనాని ముప్పభూపాలుడు,గురజాల వంశీయుడైన తెలుగు నృపతి కుమారుడైన ముప్పభూపాలుడు తాతా మనుమలైనా కావాలి లేదా వేరు వేరు కావాలి.దీనిని మనచరిత్ర పరిశోధకులుమరింత క్షుణ్ణంగా పరిశీలిస్తారని భావిస్తున్నాను. ఇక మరొక విషయం 1336 లో కాపయనాయకుని వల్ల ఏర్పరచబడ్డరాజ్యాలన్నీ 1368 వరకు తెలుగు వారి అంతఃకలహాలతో రేచర్ల పద్మనాయకుల విజృంభ ణతో మారిపోయాయి.ఆ తర్వాత బహమనీ రాజుల స్వాధీనంలోకివచ్చింది ఓరుగల్లు రాజ్యం.చిన్న రాజ్యాలన్నీ అధికారమార్పులతో ఎప్పటికప్పుడు నాయకత్వపు మార్పులకు తలఒగ్గవలసిందే.ఓరుగల్లు పాలకులో,దేవగిరి పాలకులో,గోలకొండ పాలకులో,ఢిల్లీ పాలకులో ఎవరి పెత్తనంఉంటే వారి చెప్పుచేతల్లో మెలగవలసిం దే.మడికి సింగన పద్మపురాణోత్తరఖండంక్రీ.శ.1420 లో పూర్తి చేసినట్లుగాను, ఆ తరువాత మిగతా పుస్తకాలు రాసినట్లు గాను,సింగన క్రీ.శ.1432 వరకు జీవించి ఉన్నట్లు గ్రంథాధారాలున్నాయి గనుకఅతడు ముప్పభూపాలుని రాజ్యావసానకాలాన కందనను ఆశ్రయించి వెలిగందలలోనో మొలంగూరులోనో ఉండి యుండవచ్చును.కనుకనే మహా భాగవత కర్త పోతన శిష్యుడైన వెలిగందల నారయకు అంతటి సారస్వత నేపథ్యము కలిగయుండ వచ్చును.పోతనపై మడికి సింగన ప్రభావము కూడా కలదనుటకు తగిన యాధారములు సింగన రచనలు చదివిన వారికి తెలియ వస్తాయి.ఒక్క ఉదాహరణ ఇచ్చి ముగిస్తాను.మనందరికి పోతన పద్యం ‘పలికెడిది భాగవతమట పలికించెడు వాడ రామ భద్రుండట నే బలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ పలుకగనేలా!’ తెలుసు గదా!అలాంటి పద్యం సింగనది చూడండి. కృతిబోధామృత రసమట కృతికథ శ్రీరామచంద్ర కీర్తనమట ద త్కృతినాయకుండు లక్ష్మీ పతియట నాకింత కంటె భాగ్యము గలదే


కామెంట్‌లు