మానేరు ముచ్చట్లు-రామ్మోహన్ రావు తుమ్మూరి - క్రీ.శ.1332లో ముసునూరి కాపయనాయ కుడు ఓరుగల్లు కోటను వశపరచుకొని తన అనుయాయులను ఒక్కొక్కరిని ఒక్కో ప్రాంతానికి అధిపతులుగా చేశాడు.అలాచేసిన వారిలో సబ్బిసాయిర మండలా నికి అధిపతియైన ముప్పభూపతి లేదా ముప్పభూపాలుడు ఒకడు. ముప్పభూ పాలుని తండ్రి గురిజాల వంశానికి చెంది న తెలుగునృపతి. వీరిది గుంటూరు ప్రాంతము. కాపయనాయకునిది కూడా గుంటూరు మండలమే.ముప్పభూపాలుడు రామగిరిని తన తన పాలనా కేంద్రముగా ఏర్పరచుకుని పరిపాలన కొన సాగించాడు.ఈయనకు మంత్రి కేసనామాత్యుడు. కేసనామాత్యు ని తమ్ముడు కందన.కందనామాత్యుని వెలిగందలకు అధిపతిగా నియమించాడు ముప్ప భూపతి.కేసన,కందనలది మొలంగూరు.వాణస వంశీయులు. కాశ్యపగోత్రజులు.వీరి తండ్రి అబ్బయామా త్యుడు.వీరి ప్రపితామహుడు గన్నయ మంత్రి కాకతీయ గణపతిదేవచక్రవర్తి వద్ద పనిచేసి పేరు ప్రతిష్ఠలు పొందిన వాడు.గన్నయమంత్రి తండ్రి రుద్రసచి వుడు మొలంగూరు కధిపతిగా యుండెనని ఈ క్రింది పద్యము వలన తెలియుచున్నది. ‘ఇల వాణస వంశంబున జలరుహభవనిభుడు నీతిచాణుక్యుడు నా జెలువమరు రుద్ర సచివుడు మొలగూరేలుచును సౌఖ్యమున జెలువొందున్’ ఇంతకూ ఈ కందన మంత్రెవరు?ఈ పద్యమేమిటి అనే సంశయం కలుగ వచ్చు కొందరికి. దీన్ని ప్రత్యేకంగా రాయటంలో ఒక విశేషమున్నది.తొలిసారి వెలిగందుల పేరు ఒక కావ్యంలో ప్రస్తుతించబడటం వెలిగందల కందనామాత్యుని వల్లనే. ముప్ప భూపాలుని ఆశ్రయం కోసం వచ్చిన కవి మడికి సింగన.మడికి సింగనకు కవియగు కందనామాత్యునికి స్నేహం కుదిరింది.మడికి సింగన తన పద్మపురాణోత్తర ఖండం అనే కావ్యాన్ని వెలిగందల కందనామాత్యునికి అంకితమిస్తూ కృతిపతి వంశావళి గురించి అనేక పద్యాలు రాశాడు.పైన పేర్కొన్న పద్యము అందులోనిదే. అలాగే కందనను గురించి రాస్తూ- ‘వెలిగందల నరహరి పద జలరుహమకరంద మత్త షట్చరణ గుణో జ్జ్వల నవ్యమకరకేతన విలసిత నవకావ్యగీత విద్యా నిలయా’ మడికి సింగన రాసిన ఈ పద్యం అనేక విషయాలను తెలియపరుస్తున్నది. క్రీ.శ.1202 శాసనాన్ని బలపరుస్తూ వెలిగందల గుట్ట మీద వైభవోపేతంగా నరసింహాలయముండేదని ఒకటి. కందనామాత్యుడు వెలిగందల అధిపతి అనేది రెండు. కందనామాత్యుడు సారస్వతమూర్తి యని మూడు. మడికి సింగననే పేర్కొన్న “అపూర్వ వచనరచనా బంధుర కావ్యరసాభిజ్ఞుడు” అనే మాట కందన కృతిపతి యే కాదు కృతికర్త అని తెలుస్తున్నది. మడికి సింగన మరో సంకలన గ్రంథం సకలనీతి సమ్మతంలో కందన నీతి తారావళి నుండి కొన్ని పద్యాలు ఉట్టంకించబడినవి. 1. అమలమగు సప్త సంతా నములందనిశంబు యశమునకు గుదురై నా శములేక నెగడు సత్కా వ్యము ధారుణిలోన నౌభళార్యుని కందా 2. పలుకులు తీరును సరసము చెలువమున బెడంగు బంధ చిత్రము సొబగున్ గల కలన జూపవలదే కలకంఠియు బోలె గనుక కందనమంత్రీ 3. ధరనొప్పు నీతి మార్గము పరికింపగ దిరుగు మంత్రి పని మంత్రములే కురు విషభుజగము బట్టిన కరణి సుమీ యౌభళార్య కందన మంత్రీ 4. బలవంతుడు మన్నించిన బలహీనుడు బలియుడనగ బడు ధారుణిలో వలరాయుడు చేపట్టిన యలరులు బాణములు గావె యౌభళ కందా 5. తన్నని నమ్మిన బ్రోవక పొన్నాకుల మీద తేనె బూనిన భంగిన్ నున్నని మాటల యన్నల మన్ననలేమందు మబ్బ మంత్రియ కందా ఈ పద్యాలు కందన రాసిన నీతి తారావళి లోనివి.తారావళి అంటే 27 పద్యాల మాలికా కావ్యం. వెలిగందుల గ్రామానికి తొలి కవి వెలిగందల కందనామాత్యుడు అని చెప్పవచ్చు.(సశేషం) రేపటి ముచ్చట్లలో మడికి సింగన గురించి.


కామెంట్‌లు