తొమ్మిది రోజుల్లో "మెడోస్ టైలర్" అనువాదం---మెడోస్ టైలర్ తెలుగువారికి సన్నిహితుడు. లివర్ పూల్లో జన్మించి 1823 ప్రాంతంలో మన దేశానికి వచ్చి బొంబాయిలో ఓ వ్యాపార సంస్థలో కొంత కాలం పని చేశాడు. అనంతరం నిజాం సైన్యంలో చేరి అచిర కాలంలోనే మహోన్నత పదవిని అధిష్టించిన టైలర్ తన యాత్రానుభవాలను "The sory of my life" అని ఓ పుస్తకం రాశాడు. ఈ పుస్తకాన్ని దిగవల్లి వెంకట శివరావు వద్ద చూశారు జి. కృష్ణగారు. అంతకుముందెప్పుడో ఆ పుస్తకాన్ని చదివిన కృష్ణగారికి దానిని మళ్ళీ చదవాలనిపించింది. ఓమారు ఇస్తే చదివిస్తానన్నారు కృష్ణగారు. అప్పుడు శివరావుగారు "అమ్మో! మీ పత్రికా రచయితలను నమ్మను. అయినా పదిహేను రోజుల్లో చదివి ఇచ్చెయ్యాలి. కావాలంటే నోట్స్ రాసుకోండి. ఎప్పుడైనా పనికిరావొచ్చు" అన్నారు కృష్ణగారికి పుస్తకం ఇస్తూ.కృష్ణగారు పుస్తకాన్ని తీసుకెళ్ళి చదవటమనేది పెట్టుకోలేదు. డాక్టర్ గూడూరు నమశ్శివాయ గారు కృష్ణగారు తెలుగు అనువాదం చెప్తుంటే తాను రాస్తానని సహకరించడంతో కృష్ణగారు ఇక అనువాదాన్ని చెప్పడం మొదలుపెట్టారు. కృష్ణగారు తొమ్మిది రోజుల్లో పుస్తకాన్ని అనువదాన్ని డిక్టేట్ చేస్తుండగా గూడూరు నమశ్శివాయగారు రాయడం మొదలుపెట్టారు. ఆయన అలసినప్పుడు కృష్ణగారి కూతురు రాజీవగారు, కుమారుడు రాజశుక రాసేవారు. రాయడం పూర్తవడంతోనే కృష్ణగారు ఆ రాతప్రతితోపాటు ఆంగ్ల పుస్తకాన్ని తీసుకెళ్ళి దిగవల్లిగారింటికి వెళ్ళారు. దిగవల్లిగారికి ఇంగ్లీష్ పుస్తకం ఇచ్చేసి తెలుగు అనువాద ప్రతిని చూపించారు. అది చూసి దిగవల్లిగారు ఆనందంతో "పత్రికా రచయితలను కూడా విశ్వసించవచ్చు" అన్నారు.అనంతరం దీనిని ఆంధ్రప్రభలో ధారావాహికంగా ప్రచురించారు. కొందరు మెచ్చుకోగా ఇంకొందరు ఈ సోదంతా దేనికీ అని ఈసడించారని కృష్ణగారు చెప్పారు.శాసనాల శాస్త్రిగారుగా ప్రసిద్ధులైన బి.ఎన్. శాస్త్రిగారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. అనంతరం రాజా చంద్ర ఫౌండేషన్ వారు (తిరుపతి) 2011 జులైలో రెండోసారి ప్రచురించారు. ప్రస్తుతం ఈ పుస్తకాన్నే తిరగేస్తున్నాను. - యామిజాల జగదీశ్


కామెంట్‌లు