అతని పేరు కరుణో లేక ధర్మమో:-ఆయన మళయాల రచయిత. పేరు వైకోమ్ ముహ్మద్ బషీర్. ఆయనను బేపోర్ సుల్తాన్ అని పిలుస్తారు. 1908 లో జన్మించిన బషీర్ 1994లో మరణించారు. ఆయన తన జీవిత చరిత్రను రాస్తూ ఓ సంఘటన చెప్పారు.ఓరోజు ఏదో రాస్తూ ఉన్న బషీర్ కి ఆకలేసింది. కాగితాలూ కలమూ పక్కన పెట్టారు. లుంగీ కట్టుకున్నారు.లాల్చీ వేసుకున్నారు. లాల్చీ జేబులో ఓ పర్సు పెట్టుకుని ఇంటికి దగ్గర్లోనే ఉన్న హోటల్ కి వెళ్ళారు. మసాలా దోసె అడిగి తెప్పించుకుని తిన్నారు. ఆరోజుల్లో అంటే ఆయన కాలంలో మసాలాదోసె ఖరీదు ఒట్టి రెండు రూపాయలే. చేతులు కడుక్కుని క్యాష్ కౌంటర్ దగ్గరకు వేళ్ళారు. జేబులో ఉన్న పర్సు తీసి రెండు రూపాయలు ఇవ్వాలనుకున్నారు. కానీ జేబులో పర్సు లేదు. ఇంట్లోంచి వస్తున్నపప్పుడు పర్సుతోనే వచ్చానని, కానీ పర్సు పోయిందని ఆన్నారు.ఆయన మాటలో ఓ తొట్రుపాటు. ఇంటికెళ్ళి డబ్బులు పట్టుకొచ్చి ఇచ్చెస్తాను అన్నారు బషీర్.కానీ క్యాష్ కౌంటర్లో ఉన్నతను హేళనగా నవ్వి "చాల్లేవోయ్ కథలు" అని కర్కశంగా మాట్లాడాడు.అతని ధోరణితో తాను తిన్న దోసెకు పిండి రుబ్బడమో బల్లలు తుడవడమో పాత్రలు కడగటమో వీటిలో ఏదో ఒక పని చెయ్యకతప్పదనుకున్నారు బషీర్. అప్పటికీ బషీర్ మరోసారి చెప్పడానికి ప్రయత్నించారు. ఇంటికెళ్ళి రెండు రూపాయలు తీసుకొచ్చి ఇస్తానని. కానీ క్యాష్ కౌంటర్లో ఉన్న వ్యక్తి మరింత కఠినంగా మాట్లాడుతూ "లాల్చీ విప్పు" అన్నాడు. ఆ మాటతో కంగుతిన్నారు. వెనక్కు తిరిగి చూసారు. కనీసం ఓ యాభై అరవై మంది తింటున్న వాళ్ళు బషీర్ చొక్కా విప్పితే చూడడానికి ఉవ్విళ్ళూరుతున్నారే తప్ప వారిలో ఒక్కరుకూడా రెండు రూపాయలిచ్చి బషీర్ ను శిక్ష నుంచి తప్పించే ఆలోచనలో లేరు. అటువంటి వారికోసమా తాను కథలు రాస్తున్నానా అనుకున్నారు బషీర్. చేసేదేమీ లేక బషీర్ చొక్కా విప్పి అక్కడి టేబుల్ ఫైన ఉంచారు. క్యాషియర్ అక్కడితో ఆగలేదు. లుంగీ విప్పమన్నాడు. దాంతో బషీర్ తన పరువు పోబోతోందని అనుకున్నారు. తాను విప్పకుంటే క్యాషియరే లుంగీ విప్పేస్తాడేమో అనుకుని బషీర్ లుంగీ విప్పడానికి సిద్ధపడుతుంటే బయటి నుంచీ ఓ మనిషి పరుగు పరుగున వచ్చి కౌంటర్లో ఉన్నతనిని ఎంతయ్యా ఈ పెద్దమనిషి ఇవ్వాల్సి ఉంది అని అడిగాడు. రెండు రూపాయలు అన్నాడు క్యాషియర్. వెంటనే ఆ మనిషి రెండు రూపాయలు క్యాషియర్ కి ఇచ్చాడు."రావయ్యా" అంటూ బషీర్ భుజంమీద చెయ్యేసి బయటకు తీసుకుపోయాడు. ఓ పది పదిహేను అడుగులు వేసిన తర్వాత రోడ్డు పక్కన ఓ చెట్టుకింద నిల్చుని తన దగ్గర ఉన్న ఇరవై పర్సులు చూపిస్తూ వీటిలో నీదుంటే తీసుకో అన్నాడు. నిజానికి వాటిలో బషీర్ పర్సూ ఉంది. కానీ లేదని చెప్పారు.అతను అక్కడి నుంచి ముందుకెళ్ళి పోతుంటే బషీర్ అతనిని పిలిచి ధన్యవాదాలు చెప్పాలనుకున్నారు. కానీ అతని పేరు తెలియక పోవడంతోపాటు బషీర్ గొంతు పెద్దగా అరిచి పిలవలేకపోతోంది. అతను చాలా దూరం వెళ్ళిపోయాడు. అయితే బషీర్ అంటారిలా "బహుశా అతని పేరు కరుణో లేక ధర్మమో అయిండాలి. లేకుంటే తన పర్సుని చాకచక్యంగా కొట్టేసిన అతని ప్రతిభను మనసులో ప్రశంసించి ముందుకు అడుగులేశారు.- యామిజాల జగదీశ్


కామెంట్‌లు