రేడియో తాతయ్య----మద్రాసులో నా చిన్ననాట మా నాన్నగారి (యామిజాల పద్మనాభస్వామిగారు)తో కలిసి రేడియో స్టేషన్ కి వెళ్తుండే వాడిని. అప్పట్లో రేడియో స్టేషన్ చూడాలనే ఆశ కన్నా అక్కడి క్యాంటీన్లో మా నాన్నగారు పెట్టించే ఇడ్లీ సాంబార్ తిని ఓ కప్పు కాఫీ తాగడంపైనే మనసుండేది. పోను పోను అనిపించింది, నాకూ మా నాన్నగారిలా రేడియోలో నా స్వరం వినిపించాలని. కానీ ఎలా రేడియో కార్యక్రమంలో పాల్గొనాలా అని ఆలోచించాను. మా నాన్నగారిని అడగడానికి భయమేసి మా ఇంటికి దగ్గర్లోనే ఉండే మల్లాది రామకృష్ణ శాస్త్రిగారింటికి వెళ్ళి మల్లాది మంగతాయారుగారిని కలిసి మనసులో మాట చెప్పాను, ఆవిడ రేడియోలో ఆదివారం పూట వచ్చే ఆటవిడుపు కార్యక్రమానికి పిల్లలను తీసుకువెళ్ళి వారి గొంతు వినిపించేలా చేయిస్తుండేవారని తెలిసే నా మాట చెప్పాను. ఆవిడ పిల్లల కోసం నాటికలు కూడా రాస్తూ ఉండేవారు. వాటిలో నాకూ ఓ అవకాశం ఇప్పించమని అడిగాను. సరేనన్నారు ఆవిడ.ముందుగా ఓ ఆదివారం కొందరితో కలిసి నన్నూ రేడియో స్టేషన్ కి తీసుకువెళ్ళి రేడియో తాతయ్యగారికి పరిచయం చేశారు. శుక్లాంభరధరం శ్లోకం చెప్పించారు. అప్పట్లో నేను చెప్పింది ఎవరికీ అర్థం కాకపోవచ్చనే నా గట్టి నమ్మకం. ఎందుకంటే నేను మంగతాయారు గారితో వెళ్ళడమైతే వెళ్ళాను కానీ కార్యక్రమం జరిగే హాల్లో ప్రవేశించేసరికి దడ పుట్టింది. అక్కడ బోలెడు మంది పిల్లలు. వారి ముందు ఏం చెప్పగలనా అనిపించింది. ఆ రోజు కార్యక్రమం ముగిసి బయటకు వస్తుంటే తాతయ్యగారు "మాస్టర్ గారి కొడుకా" అంటూ దగ్గరకు తీసుకుని భుజం మీద చేయేసి "ఈసారి వచ్చినప్పుడు బాగా ప్రాక్టీస్ చేసి నిదానంగా చెప్పడం అలవాటు చేసుకురా" అని సలహా ఇచ్చారు. అలాగే అన్నాను. కానీ అప్పటికే మనసులో అనుకున్నాను, ఇక ఒంటరిగా శ్లోకాలో పద్యాలో చెప్పడం వద్దనుకున్నాను. ఆరోజు మంగతాయారుగారితో గట్టిగా చెప్పాను "మీరు రాసే నాటికల్లో ఏదైనా ఓ చిన్న పాత్ర, అదీనూ ఎక్కువ డైలాగులు ఉండకూడదు" అని స్పష్టం చేశాను. అలాగే అని మరో వారం పది రోజులకల్లా ఆమె రాసిన నాటికలో ఓ పాత్ర ఇచ్చారు. అలాగే అదే నాటికలో ఓ ముగ్గురు నలుగురితో కలిసి ఒక్కటిగా " దొంగా దొంగా...పట్టుకోండి....మమ్మల్ని కాపాడండి" అని అరవాలి. కానీ నలుగురితో కలిసి సరిగ్గా మాటలు చెప్పలేక సిగ్గేసింది. నా వల్ల మూడు టేకులుపైనే పట్టింది. నా వైఫల్యానికి సిగ్గేసింది. ఆ తర్వాత ఒకటి రెండు సార్లే ఆటవిడుపులో పాల్గొన్నాను. అనంతరం నా బెరుకుతనంతో ఇక లాభం లేదనుకుని తప్పుకున్నాను. నిజానికి రేడియో తాతయ్యగారు చేసిన సూచనలు పాటించకపోవడమే నా వైఫల్యానికి కారణం.ఎటువంటి వారినైనా తీర్చిదిద్దగల శక్తి రేడియో తాతయ్యగారికి ఉండేది. ఆయనకు తెలుగు భాష మీద గట్టి పట్టుంది. అభిమానముంది. అంతేకాదు, డైలాగులు చెప్పించడంలో ఆయనకాయనే సాటి. నూటికి నూరు శాతం పెర్ఫెక్షన్ కోసం తంటాలు పడేవారు. మాడ్యులేషన్ కోసం ఎక్కడా రాజీ పడేవారు కాదు. ఆయన చేసే ప్రోగ్రాములపై వేలెత్తి చూపించే అవకాశం ఎవరికీ ఇచ్చేవారు కాదు. ఆ విధంగా ఆయన మద్రాసు ఆలిండియా రేడియో నుంచి ప్రసారమయిన తెలుగు కార్యక్రమాలకు విశేష ఆదరణ, గుర్తింపు లభించేవి.సెలవు రోజులలో పిల్లలు, వారి తల్లిదండ్రులతో రేడియో స్టేషన్ కిటకిటలాడేది. పిల్లల మధ్య కూర్చుని రేడియో తాతయ్య కథలు కబుర్లు చెబుతున్నప్పుడు సమయం ఇట్టే గడిచిపోయేది. వృద్ధుని గొంతును అనుకరిస్తూ పిల్లలతో ఆయన చెప్పే సరదా కబుర్లు మరచిపోలేనిది. పిల్లలూ....బాగున్నారా....నేనొచ్చేశా....మీ రేడియో తాతయ్యను వచ్చేశా అంటూ మూడు పదుల యువకుడు వార్దక్యం మీద పడిన వృద్ధుడిలా గొంతు మార్చి ఆయన మాట్లాడుతుంటే ఎవరూ నమ్మలేకపోయేవారు. ఇంతకూ ఆ రేడియో తాతయ్య ఎవరో చెప్పలేదు కదూ. ఆయనే మల్లంపల్లి ఉమామహేశ్వర రావుగారు.చరిత్ర పరిశోధకుడు రచయిత అయిన మల్లంపల్లి సోమశేఖర శర్మ సోదరులైన ఉమామహేశ్వరరావుగారు 1911 మే 12న పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం తాలూకాలోగల పెనుమంచిలిపాటి అగ్రహారంలో జన్మించారు.ఉమామహేశ్వరరావుగారు అప్పట్లో మద్రాసు హైకోర్టు ఎదురుగా ఉన్న క్రిస్టియన్ కాలేజీ హైస్కూలులో ఎస్ఎస్ఎల్ సీ చదివారు. ఇంటర్ తోనే చదువు ముగించి తాపీధర్మారావుగారు నిర్వహణలోని జనవాణిలోఎం ఉపసంపాదకుడిగా ఆయన తమ ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అప్పటి రేడియో కార్యక్రమ నిర్వాహకులలో ఒకరైన కీ.శే. ఆచంట జానకీరాం గారు ఓరోజు ఆ పత్రికా కార్యాలయానికి వచ్చి ఉమామహేశ్వరరావుగారి దస్తూరి చూసి బాగుందనన్నారు. ఇష్టముండే పక్షంలో ఆలిండియా రేడియోలో డ్రామాల స్క్రిప్ట్ కాపీ చేసే పనికి రావచ్చన్నారు. ఉమామహేశ్వరరావుగారు తమ సంపాదకులైన తాపీ ధర్మారావు గారు సమ్మతిస్తే వస్తానని జానకీరాంగారితో చెప్పారు. అయితే తాపీ ధర్మారావుగారు ఓ షరతు పెట్టారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ తమ పత్రికాఫీసులో పని చేయాలని, మధ్యాహ్నం రెండు గంటల నుంచి రేడియో స్టేషన్ కి వెళ్ళవచ్చన్నదే ఆ షరతు. ఆ విధంగా ఉమామహేశ్వరరావుగారు ఆలిండియా రేడియోలో డ్రామాల స్క్రిప్ట్ కాపీ చేసిపెట్టే పనికి 1937 డిసెంబరులో చేరిన రేడియో తాతయ్యగారికి దాదాపు నలభై ఏళ్ళు రేడియోతో మంచి అనుబంధముండేది. మద్రాసు రేడియో స్టేషన్లో తెలుగు కార్యక్రమాలకు మొదటి అనౌన్సరుగా పని చేసిన వ్యక్తిగా చరిత్ర పుటలకెక్కిన ఉమామహేశ్వరరావుగారిలో (రేడియో తాతయ్య) మంచి రచయిత కూడా ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆయనే నాటకాలు రాసి పిల్లలతో నడిపించిన సంఘటనలున్నాయి. ఘంటసాల రత్నకుమార్, ఐవీజే ప్రదీప్, కొచ్చర్లకోట కృష్ణప్రసాద్ (కెకె ప్రసాద్), అల్లు వేంకటేష్ (అల్లు రామలింగయ్య గారి కుమారుడు), ధూళిపాళ కుమారుడు ప్రసాద్, రాజర్షి (బద్రి) ఇలా ఎందరెందరో ఆటవిడుపు నాటకాల్లో పాల్గొన్నవారే.ఓ మారు ఆయన గ్రాంధిక శాస్త్రి అనే నాటకాన్ని రాసి ప్రదర్శించిన తీరుతెన్నులను కెకె ప్రసాద్, ప్రదీప్ చెప్పుకుని ఎంతగానో ముచ్చటపడ్డారు. గ్రాంధిక శాస్త్రిగా ఘంటసాల రత్నకుమార్, బండ శిష్యుడిగా ప్రదీప్, బక్క శిష్యుడిగా కెకెకె ప్రసాద్ నటించారు. గ్రాంధిక పదాలను పలకడం కష్టంగా ఉందని పారిపోతే రేడియో తాతయ్యగారు పట్టు బట్టి వారితో ఒక్కొక్క మాటా పలికించి ప్రదర్శించిన తీరు విశేషం. రత్నకుమార్, ప్రదీప్, కెకె. ప్రసాద్ లోకల్ ట్రైన్లో ఎగ్మూరులో దిగి అక్కడి నుంచి దివాన్ రామయ్యంగార్ వీధిలో ఉండిన తాతయ్య గారింటికి వెళ్ళి రెండు మూడు గంటలు ఈ నాటకాన్ని ప్రాక్టీస్ చేసేవారు. అక్కడే కాఫీ టిఫిన్లు కానిచ్చుకుని పిల్లలు తిరిగొచ్చేవారు. ఈ నాటకాన్ని స్టేజి మీద ప్రదర్శించినప్పుడు విశేష ఆదరణ లభించింది. చివరి సన్నివేశంలో గురువు పాత్రలో నటించిన రత్నకుమారుని తేలు కుట్టినప్పుడు అమ్మా వెళ్ళి త్వరగా వైద్యుడ్ని తీసుకురండర్రా అని వ్యావహారిక భాషలో మాట్లాడంతో కథ క్లైమాక్స్ కు వచ్చిందని ప్రసాద్ చెప్పారు. ఉమామహేశ్వరరావుగారే మరొక సాంఘిక నాటకాన్ని కూడా రాసి పిల్లలతో స్టేజీమీద ఆడించారు.అలాగే ఆటవిడుపు మరొక వినూత్న కార్యక్రమాన్ని కూడా శ్రోతలకోసం ప్రవేశపెట్టింది. ప్రముఖలైన చిత్తూరు వి. నాగయ్య, ఘంటసాల, ఎస్. జానకి, జమున, ఎస్, వరలక్ష్మి. పి.వి. రామన్నార్, బి.ఎవ్. రెడ్డి, సాలూరు రాజేశ్వరరావు, అల్లు రామలింగయ్య, కాంచన, సూర్యకాంతం తదితరుల ఇళ్ళకు పిల్లలందరినీ ఆయన దగ్గరుండి ఆలిండియా రేడియో వారి వ్యానులో తీసుకువెళ్ళి వారితో ప్రశ్నలు అడిగించి వాటికి సమాధానాలు రాబట్టించి ఆటవిడుపులో ప్రసారం చేసేవారు. పెద్దలను పిల్లలు ఇంర్వ్యూ చేయడం అనే వినుత్న కార్యక్రమం అప్పుడే మొదలైంది. ఆ ఘనత రేడియో తాతయ్యగారికే దక్కింది. అటువంటి "రేడియో తాతయ్య"గారిని రేడియో స్టేషన్ కి మా నాన్నగారితో వెళ్ళినప్పుడల్లా చూడగలగడం నా అదృష్టం.ఆ రోజుల్లో మద్రాసు ఆలిండియా రేడియోలో మధ్యాహ్నం పూట తెలుగు సినిమాలు ప్రసారమయ్యేవి. ఆ కార్యక్రమాన్ని రేడియో సంక్షిప్త శబ్ద చిత్రం అనే వారు. అంటే మూడు గంటల సినిమాను ఒక్క గంటకు కుదించి ప్రసారం చేసే బాధ్యతనుకూడా రేడియో తాతయ్యగారే చేపట్టారు. థియేటరుకి వెళ్ళి మొత్తం సినిమాను రికార్డు చేసుకొచ్చి కథ చెడకుండా ప్రధాన పాటలను విడిచిపెట్టకుండా కుదించే వారు. ఈ విధంగా ఎడిటింగ్ లోనూ, రికార్డింగులోనూ తనకున్న ప్రతిభను నిరూపించుకున్న రేడియో తాతయ్య ఉమామహేశ్వరరావుగారు, ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన టెన్సింగ్ నార్కే, ప్రముఖ సంగీత విద్వాంసురాలు డీకే పట్టమ్మాళ్, ఎం. ఎస్. సుబ్బలక్ష్మి, ద్వారం వెంకటస్వామి నాయుడులాంటి దిగ్గజాలను ఇంటర్వ్యూ చేసిన సందర్భాలున్నాయి.ఆయన 1977 మే 31వ తేదీన పదనీవిరమణ చేశారు. కొన్ని నెలలు డిల్లీలో కూడా పని చేసిన ఆయన రేడియో తాతయ్యగా ఎనలేని పేరుప్రతిష్టలు పొందారు."చెన్నయ్ ఆకాశవాణిలో వినిపించిన తొలి తెలుగు అనౌన్సర్ కంఠం (రేడియో తాతయ్య)" 2011 జూలై 13వ తేదీన మూగబోయింది. ఉమామహేశ్వరరావుగారి కుమార్తె వల్లీగారినడిగి కొన్ని విషయాలు రాయగలిగాను. అందుకు ఆమెకు కృతజ్ఞతలు. అలాగే గ్రాంధిక శాస్త్రి నాటకం గురించి తమ అనుభవాలు చెప్పిన కెకెకె ప్రసాద్, ప్రదీప్ లకు కూడా ధన్యవాదాలు. - యామిజాల జగదీశ్
Popular posts
భాషా భూషణం ఏసీపి నాగభూషణం!!?:- డా.ప్రతాప్ కౌటిళ్యా.
• T. VEDANTA SURY
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
చిత్రం : బృంద -ఎనిమిదవ తరగతి -జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళిఘనపూర్-మెదక్ జిల్లా
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
మా ఊరి చెరువు ( బాల గేయం ) : డాక్టర్. కందేపి రాణి ప్రసాద్
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి