భక్తి ప్రపంచంలో కబీర్ దాస్ ఓ ఆణిముత్యం. ఇంతకూ కబీరుదాసు అంటే అర్థమేమిటీ అని తరచి చూడగా తెలిసింది"గొప్ప జ్ఞాని" అని. కాశీలో పుట్టి పెరిగిన కబీర్ తల్లిదండ్రులెవరో తెలీదు. కానీ ఆయనను ఓ నిరుపేద చేనేత ముస్లిం దంపతులు చేరదీసి పెంచారు. ఆ దంపతుల పేర్లు నీమా, నీరూ!కబీరుకి పెళ్ళవుతుంది. కానీ భార్య చనిపోతుంది. దాంతో మళ్ళీ పెళ్ళి చేసుకుంటాడు. ఈ రెండో భార్య గయ్యాళి! ఆమెతో వేగలేక జీవితంపై విసిగిపోయిన కబీరు ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అనేక ప్రదేశాలకు వెళ్తాడు. రకరకాల వ్యక్తులను కలుస్తాడు. కబీరు చదువుకున్న వాడు కాదు. అయినా ఆయన చెప్పిన ఉపదేశాలను శిష్యులు అక్షరరూపంలో భద్రపరుస్తారు. దాని పేరే "కబీరు బీజక్". రామానంద శిష్యుడిగా ఉండిన కబీర్ దాస్ రామభక్తుడు. గురువు ద్వారా పొందిన జ్ఞానోపదేశంతో తన జీవితాన్ని పావనం చేసుకుంంటాడు. కబీర్.కబీర్ దాస్ మరణించినప్పుడు ఆయన భౌతికకాయం కోసం హిందువులు, ముస్లింలు తగువులాడుకుంంటారు. కబీర్ ముస్లిం అని, కాదు కాదు హిందువని వారు మధ్య ఘర్షణ జరుగుతుంది. కబీర్ భౌతికకాయం మాయమై అక్కడ పువ్వులు ఉంటాయి. దీంతో కబీరుని మహిమాన్వితుడిగా గుర్తిస్తారు. కబీర్ వంద గీతాలను విశ్వకవి రవీంద్రనొథ్ ఠాగూర్ తొలుత.బెంగాలీలో అనువదించారు. సూఫీ ఇజం, హిందూత్వ తత్వాల సమ్మిళితమే ఈ గీతాలన్నీ. తర్వాత ఠాగూరే ఈ కవితలను ఇంగ్లీషులో అనువదించగా ఈవ్లిన్ అండర్హిల్ పీఠిక రాయగా మెక్మిలన్ (న్యూయార్క్) ముద్రించింది. ఈ పుస్తకాన్నే పర్షియన్ భాషలో లెయిలా ఫర్జామీ అనువదించారు. 1915 లో ఠాగూర్ రాసిన "కబీర్ సాంగ్స్" పుస్తకానికి 79 ఏళ్ళ తర్వాత ప్రముఖ రచయిత చిక్కాల కృష్ణారావు గారు స్వేచ్ఛానువాదం చేసారు. ఈ గీతాలను ఆయన భగవాన్ రమణ మహర్షికి సమర్పించారు. కృష్ణారావుగారు 2015 డిసెంబర్ 30వ తేదీన తుదిశ్వాస విడిచిన విషాదకర సమాచారాన్ని నాకు అదేరోజు రాత్రి మిత్రురాలు మాధవీలతగారు ఫోన్ చేసి చెప్పారు. ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు. ఖలీల్ జిబ్రాన్ పుస్తకాలను ఆయన చేసిన అనువాద శైలి నన్నెంతో ఆకట్టుకున్నాయి. సుప్రసిద్ధ రచయిత చలంగారికి అత్యంత సన్నిహితులైన కృష్ణారావు గారు చేసిన అనువాదంలోంచి ఔ రెండింటిని చూద్దాం..... 1 పూలతోటలోకి వెళ్ళవద్దు ఓ సాధూ! అక్కడకు వెళ్ళకు. నీ దేహంలోనే పూలవనం వుంది. సహస్రదళ పద్మంపై ఆసీనుడవై అనంతమైన ఆ సౌందర్యాన్ని వీక్షించు. 2 మనం ఎప్పటికీ దేనినైతే చూడలేమో, దాన్ని పరబ్రహ్మ సృష్టి రూపంలోకి తీసుకొచ్చి అసలు తానేమిటో వ్యక్తమౌతాడు. మొక్కలో విత్తనం చెట్టులో నీడ ఆకాశంలో శూన్యం ఆ శూన్యంలో అనంత రూపాలు వున్నట్లు నిరక్షరుని నుంచి అక్షరుడు ఆ అక్షరుని నుంచి క్షరుడు విస్తరించాడు. పరమేశ్వరునిలో జీవుడు జీవునిలో పరబ్రహ్మ ఉన్నారు. వారు విడిగా వున్నా ఎప్పుడూ కలిసే వుంటారు. ఆయనే వృక్షం, అంకురం. ఆయనే పుష్పం, ఫలం, చాయ. ఆయనే ఆదిత్యుడు, కాంతి, ప్రకాశం. ఆయనే పరబ్రహ్మ‌, జీవుడు, మాయ. ఆయనే ప్రాణం, శబ్దం, అర్థం. ఆయనే మితం అమితం ఆయన ఆ రెండింటికీ అతీతంగా శుద్ధ బ్రహ్మగా వున్నారు. బ్రహ్మలో జీవునిలో ఆయన శుద్ధ మనసుగా వున్నారు. ఆత్మలో పరమాత్మ, పరమాత్మలో బిందువు, బిందువులో ప్రతిబింబం దర్శనమౌతుంది. ఆ దివ్య దృశ్యాన్ని దర్శించిన కబీరు ధన్యుడు. ఇవి చిక్కాలవారి అనంవాద సరళి. - నేనూ ఓ నాలుగైదు అనువదించాను. కానీ కృష్ణారావుగారి రచన చదివిన తర్వాత నేనిక ముందుకు వెళ్ళలేకపోయాను. పైగా ఇంగ్లీషుకూడా అంతంత మాత్రమే రావడంవల్ల పూర్తి అనువాదానికి సాహసించలేకపోయాను. నేను చేసిన అనువాదాలలో మచ్ఛుకి ఓ రెండు ఇక్కడ ఇచ్చాను..... 1 ఓ సేవకుడా! నన్నెక్కడ చూడాలనుకుంటున్నావు నేను నీ పక్కనే ఉన్నాను. నేను ఆలయంలో లేను. మసీదులో లేను. కైలాసంలోనూ లేను. నేను సంప్రదాయాలలోనో లేక సంస్కారాలలోనో లేక యోగంలోనో లేను. నిజంగా నాకోసం అన్వేషిస్తున్నవా అలాగైతే నన్ను ఏదో ఒక క్షణంలో తప్పక కలుస్తావు! కబీరు అంటున్నాడు కదా, ఓ సాధువా! జీవులందరికీ ఆ భగవంతుడే జీవుడై ఉన్నాడు!! 2 ఓ సాధువుని నీ కులమేమిటని అడగటం అనవసరం. మతాచార్యుడైనా సైనికుడైనా వ్యాపారి అయినా ఇలా ఎవరైనా ఒక్క తీరులోనే ఆ పరమేశ్వరుడికోసం అన్వేషిస్తారు! కనుక సాధువుని నీ కులమేమిటని అడగటం పనికిరాని పని. క్షురకుడికీ ఆ దేవుడే కావాలి. రజకుడికీ ఆ దేవుడే కావాలి. కంసాలికీ ఆ దేవుడే కావాలి. ఇలా ప్రతి ఒక్కరూ ఆ దేవుడి కోసం అన్వేషించిన వారే! హిందువులైనా ముసల్మానులైనా అంతిమంగా ఒకే రీతిలో ఆ దేవుడి పాద సన్నిధికి చేరారు!! - యామిజాల జగదీశ్


కామెంట్‌లు