రాణీ బుక్ సెంటర్ - ఓ ఆకుపచ్చని జ్ఞాపకం: ---నాకు పుస్తకాలు పరిచయమవడానికి కారకులు ఇద్దరు. ఒకరేమో మా నాన్నగారు. మరొకరు మా రెండో అన్నయ్య ఆనంద్. అలాగే కొందరు రచయితలు తెలిడానికి కారకులూ వీరిద్దరే. అయితే తర్వాతి కాలంలో నాకు అట్లూరి చౌదరాణిగారిని పరిచయం చేసింది మా ఆనందన్నయ్యే. ఇప్పటికీ బాగా గుర్తు. తేదీ తెలీదు కానీ ఓ రోజు సాయంత్రం ఆనందుతో రాణి బుక్ సెంటరుకి వెళ్ళాను. అది చౌదరాణిగారి పుస్తకాలయమే. అక్కడే ఆవిడకు నన్ను పరిచయం చేశాడు ఆనంద్. ఆ తర్వాత నించీ నేను వారానికి మూడు రోజులు రాణి పుస్తకాలయానికి వెళ్ళేవాడిని. ఒక్కొక్కసారి మనసు సరిగ్గా లేకపోతే నన్ను నేను "రీచార్జ్" చేసుకోవడానికి చౌదరాణిగారి దగ్గరకు వెళ్ళే వాడిని. బహుశా రెండోసారో మూడోసారో ఈ పుస్తకాలయానికి వెళ్ళినప్పుడే వారి అబ్బాయి అనిల్ పరిచయమయ్యాడు. సాయంత్రాలు ఈ పుస్తకాలయం ఓ చిన్నపాటి సాహితీ సభలా మారిపోయేది. కవి, పాత్రికేయుడు శ్రీకాంత్ కూడా ఇక్కడే పరిచయమయ్యారు. ఈయనతోపాటు మరికొందరితోనూ స్నేహమేర్పడింది. ఈ పరిచయాల సంగతి అటుంచి పుస్తకాలయం విషయానికొస్తాను.కవిరాజు త్రిపురనేని రామస్వామి, అన్నపూర్ణాదేవి గార్ల కుమార్తె చౌదరాణిగారు. త్రిపురనేని గోపీచంద్ ఈమెకు అన్నయ్య.చౌదరాణిగారి ఎనిమిదో యేట తండ్రి మరణించారు. నేవల్ ఇంజినీర్‌ అయిన అట్లూరి పిచ్చేశ్వరరావుగారి (1924-1966) తో ఆమె వివాహమైంది. అయితే ఆయన ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు. అప్పట్లో సినిమాలు చూసేందుకు ఎడ్ల బళ్ళు కట్టుకుని వెళ్ళిన వాళ్ళున్నారు. వైజాగ్ నుంచి మద్రాసుకి ఒకరాత్రంతా ప్రయాణం చేసొచ్చి సినిమా చూసి అటునుంఛి అటే సెంట్రల్ స్టేష‌న్‌లో పొగబండికి తిరిగెళ్ళిపోయేవారు. ఐతే అటువంటి అవకాశం లేని వారికి అప్పట్లో ఆకాశవాణి వారు ప్రసారం చేసే సంక్షిప్త శబ్ద చిత్రాలు విని సరిపెట్టుకోవలసి వచ్చేది. మరోవైపు, తోటివారికి చదివి వినిపించడానికి వెండితెర నవలలు బలేగా తోడ్పడేవి. అయితే తెలుగు లో వెండితెర నవలకు ఆద్యులుగా అట్లూరి పిచ్చేశ్వర రావుగారిని చెప్పుకోవచ్చు. వారి తొలి తెలుగు ప్రక్రియకు తెరతీసినది గౌతమ బుద్ధ లఘుచిత్రం! ఆయన మార్గంలోనే ముళ్ళపూడి వెంకటరమణ, రావి కొండలరావు, దర్శక రచయిత వంశీ తదితరులు నడిచారు. భర్త గతించిన తర్వాత చౌదరాణిగారు జీవితాన్ని సవాల్ గా తీసుకుని కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచించిన ఆమె సంకల్పబలంతో ముందడుగు వేశారు..తొలుత కొన్ని మాస పత్రికలకు, దినపత్రికలకు కరస్పాండెంటుగా పనిచేసిన ఆమె కోయంబత్తూరు వెళ్లి అక్కడి అంశాలపై కథనాలు అందించారు. అంతేకాకుండా అక్కడి పరిశ్రమల నుంచి ప్రకటనలను కూడా సేకరించి చరిత్ర సృష్టించిన రాణిగారు మద్రాసు పాండీబజార్ (సర్ త్యాగరాయ రోడ్) లో రాణి బుక్ సెంటర్ ను ప్రారంభించారు. (పెనుగొండ నారాయణ చెట్టిగారు చౌదరాణికి దుకాణం కట్టించి అతి తక్కువ అద్దెకు ఇవ్వడం విశేషం). సన్నిహితులందరూ షాపుకి ఆమె పేరునే పెట్టుకోమని సూచించడంతో ‘రాణి బుక్ సెంటర్’ అని పేరు పెట్టారు. 1969 డిసెంబర్ 8 వ తేదీన ఈ పుస్తకాలయం ప్రారంభమైంది.తెలుగు పుస్తకాల ప్రచురణ రంగంలో ఊహకందని మార్పులు తీసుకొచ్చిన కీ.శే.ఎం.ఎన్‌రావుగారు (ఎమెస్కో) ఎంతో ఉదారతతో తమ పుస్తకాలను అప్పు మీద ఈ పుస్తకాలయంలో అమ్మకానికి ఉంచారు. మరికొన్ని సంస్థలుకూడా తమ వంతు సహకారాన్ని అందించాయి. ఆమెను అందరూ ఎంతో గౌరవాభిమానాలతో "రాణమ్మ" అని పిలిచేవారు. ‘శాంతినివాసం’ వంటి కథలను, ‘అగ్నిపూలు’, నిశ్శబ్ద తరంగాలు’ వంటి నవలలను రాసిన ఆమె హిందీ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి హిందీలోకి విరివిగా తర్జుమా చేశారు. ఆకాశవాణి (మద్రాసు - బి కేంద్రం) లో ఆమె కొన్ని కథలు చదివారు. ఆమె రాసిన కథలలో ఒకటి రెండు ఫెయిర్ చేసిపెట్టాను. అలాగే ఆమె డిక్టేట్ చేయగా ఓ కథ రాసిపెట్టాను. ఒక్కొక్కప్పుడు కొన్ని పుస్తకాలకోసం ఆమె ఇంటికి వెళ్తుండేవాడిని. శరత్ పుస్తకాలకు తెలుగు అనువాదాల రచనలు వారింటే చదివాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు సకాలంలో ప్రచురించి తమిళనాడులో ఉన్న తెలుగువారికి అందజేయలేక పోయినప్పుడు చౌదరాణిగారు లాభాలను ఆశించక అందించారు. అయితే ప్రభుత్వ ఉదాసీనవైఖరితో ఆమె దీనిని దీర్ఘకాలం కొనసాగించలేకపోయారు. చిత్రనిర్మాత కాట్రగడ్డ మురారిగారు తమ పుస్తకం ‘నవ్వి పోదురు గాక’లో ‘‘ఆవిడ నన్ను ఉత్తమ సాహిత్యం వైపు నడిపించారు’’ అని చెప్పుకున్నారు. మద్రాసు తెలుగువారికి రాణీ బుక్ సెంటర్ ఓ మరచిపోలేని జ్ఞాపకమే. చౌదరాణిగారు 1996 లో తుదిశ్వాస విడిచారు. ఇప్పటికీ వారి ఏకైక కుమారుడు అనిల్ తో ఇప్పటికీ ఫోన్లో పలకరిస్తూనే ఉంటాను. నేను ఫోన్ చేసినప్పుడు "జగదీశ్ బాబు" అనే అనిల్ సంబోధన వింటుంటే చెప్పలేని ఆనందం. ఏ విషయాన్నయినా నిర్మొహమాటంగా చెప్పేసే అనిల్ తో కలిసి వారి బుక్ సెంటరుకి ఎదురుగా రోడ్డుకవతల ఉన్న హమీదియా హోటల్లో ఇరానీ ఛాయ్ తాగుతూ చెప్పుకున్న కబుర్ల క్షణాలు నా జీవిత పుస్తకంలో చెదరిపోని జ్ఞాపకాలే!! అలాగే అనిల్ వాళ్ళమ్మగారి మాటలూ మరచిపోలేనివే!!- యామిజాల జగదీశ్


కామెంట్‌లు