రావూరివారి గురించి నాలుగు మాటలు-- కొన్ని నెలల క్రితం ఓ ఇరవై ఎనిమిది పేజీల పుస్తకం చూశాను. చదివాను. అది ప్రముఖ కథకులు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ (1927 జూలై 5 -2013 అక్టోబరు 18) గారి పుస్తకం. దాని శీర్షిక "నా గురించి నాలుగు మాటలు" వివిఎన్ ట్రస్ట్ (గగన్ మహల్‌, హైదరాబాద్) వారు ప్రచురించిన గొప్ప పుస్తకం. ధర పన్నెండు రూపాయలు. చిత్రకారుడు ఆనంద్ గీసిన రావూరి భరద్వాజ్ గారి ముఖచిత్రంతో ఈ పుస్తకం వెలువడింది.ఈ పుస్తకం చదవడంతో రావూరి గారి గురించి తెలియడమే కాక ఆయన రాసిన పుస్తకాలు వెతికిపట్టుకుని చదవాలనే ఆసక్తి కలుగుతుంది. గొప్ప భావుకులు. తెలుగు కవి, రచయిత. బాలసాహిత్యం లోనూ విశేష కృషి చేసిన రావూరివారు తెలుగు రచనా జగత్తులో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనత దక్కించుకున్న నిరాడంబరుడు. "కొంతమంది అదృష్టవంతులుంటారు. తమను గురించీ, తమ పూర్వీకుల గురించీ, గర్వంగా చెప్పుకోదగిన అంశాలు వారికి చాలా ఉంటాయి. ఇంకొంతమంది దురదృష్టవంతులుంటారు. తమను గురించీ, తమ పూర్వీకుల గురించీ, గొప్పగా చెప్పుకోతగిన అంశాలంటూ ఉండవు. సరేగదా, మామూలుగా చెప్పుకోదగిన అంశాలుకూడా ఉండవు" అనే మాటలతో ఈ పుస్తకరచనకు శ్రీకారం చుట్టిన రావూరివారు తమ పెదనాన్న గురించీ చెప్పుకున్న విషయం...ఒకామెను ఆయన పెదనాన్న పెళ్ళి చేసుకుందామనుకుంటారు. అయితే తాననుకున్నామె మరొకరిని పెళ్ళి చేసుకున్నారు. దాంతో ఆయన పెళ్ళే చేసుకోలేదు. అంతేకాదు రావూరివారితో ఆయన తన కోరిక చెప్పారు. తన సమాధిపై ఆమె బూడిదను చిలకరించమన్నదే ఆ కోరిక. ఆ కోరికను రావూరి వారు తీర్చారు. కొల్లిపర కోటయ్యగారి దగ్గర అక్షరాభ్యాసం చేసిన రావూరివారు చదువు మానేయడానికి ప్రత్యక్ష కారణం హెడ్మాస్టరు, పరోక్ష కారణం తమ కుటుంబాన్ని కప్పేసిన పేదరికం.1946లో విమల అనే శీర్షికతో తొలి కథ అచ్చయింది.అమ్మెవరో నాన్నెవరో తెలియని రోహిణి అనే ఆమెను పెళ్ళి చేసుకోవాలనుంందని రావూరివారు నాన్నకీ, మునిమాణిక్యంవారికీ, చలంగారికీ ఉత్తరాలు రాస్తారు. అయితే ఆ ముగ్గురిలో చలంగారొకరే "చేసుకో"మని జాబు రాశారట. అయితే డబ్బులులేక పెళ్ళి చేసుకోలేకపోయారు. మూడు వేలు ఇచ్చి రోహిణిని పెళ్ళి చేసుకోమని నాగరత్నం అనే ఆవిడ చెప్పింది. కానీ తన దగ్గర మూడు రూపాయలు కూడా లేవన్నారు రావూరివారు. లక్ష్మి, జైబూన్, చిత్ర కలిసి ఆయనకు నాలుగు రూపాయల ఎనిమిది అణాలకు ఓ కళ్ళజోడు కొనిచ్చారు. ఈ లోకమంతా ఆ ముగ్గురినీ దుమ్మెత్తిపోసస్తుండేది. అందరితో మాటలు పడిన ఆ ముగ్గురూ కొనిచ్చిన కళ్ళజోడునే ఆయన గొప్ప కానుకగా రాసుకున్నారు.జీవిత భాగస్వామి కాంతంగారు పోయినప్పుడు ఆయన ఆమె జ్ఞాపకాలుగా అయిదు పుస్తకాలు ముద్రించారు. ఈ స్మృతి సాహిత్యం చదివి తీరాలి. మొదలి నాగభూషణ శర్మగారి దగ్గర ఓ రెండు మూడు నెలలు పని చేసిన రోజుల్లో రావూరివారి గురించి నాకు చెప్తుండేవారు. ఆకలి తెలుసు అవిద్య తెలుసు అవమానం తెలుసు నిరుద్యోగం తెలుసు అన్యాయం తెలుసు అక్రమం తెలుసు అధర్మం తెలుసు వీటిని పుష్కలంగా అనుభవించాను కనుక ఇవి లేని సమాజం కావాలని కోరుకున్న రావూరివారు ఈ పుస్తకం రాస్తున్ననాటికి తనవి నూట నలభై పుస్తకాలు వెలుగుచూశాయన్నారు. ఆయన రాసిన కొన్ని కథలు దాదాపుగా అన్ని భారతీయ భాషలలోనూ వచ్చాయి. రాజ్యం వద్దు స్వర్గం వద్దు మోక్షంతో పని లేదన్న రావూరివారి కోరేదల్లా ఒక్కటే - దుఃఖబాధితుల కష్టాలు తొలగోపోవాలి!!- యామిజాల జగదీశ్


కామెంట్‌లు
Ravi చెప్పారు…
ఈ పుస్తకం ప్రింట్లో ఉందా సార్