విక్రమదేవ వర్మ: --కొన్ని నెలల క్రితం నాటి మాట. నాకు మేరీ అనే ఆమె కొన్ని పుస్తకాలు పంపారు. వాటిలో ఒకటి "దక్షిణ భారతాదర్శ పురుషులు. ఈ పుస్తకం వయస్సు దాదాపు డెబ్బయ్ ఏళ్ళు. ఇది అయిదు వ్యాసాల సంపుటి. ఆంధ్ర భోజుడు విక్రమ దేవ వర్మ, గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజం, వేదాంత వేత్త సర్ సర్వేపల్లి రాధాకృష్ణ, విజ్ఞాన శాస్త్రవేత్త సర్ చంద్రశేఖర వెంకట రామన్, చిత్రకళావేత్త దామెర్ల రామారావుల గురించి తెలుగు పండితులైన విద్వాన్ రావినూతల నారాయణ రావు గారు రాసిన పుస్తకం. మద్రాసులోని బ్రాడ్వేలోగల "టి.వి. చెల్లప్ప శాస్త్రి అండు సన్సు" 1951 లో ముద్రించింది. పుస్తకం మూల్యం ఒక్క రూపాయి. ఆదర్శపురుషుల విషయాలకోసం కొన్ని "భారతి" మాసపత్రికలను తిరగేసినందువల్ల ఆ పత్రికాధిపతులైన శివలెంక శంభుప్రసాద్ గారికి రచయిత రావినూతలవారు తన హృదయపూర్వక వందనాలు తెలియజేశారు. పుస్తకంలోని మొదటి వ్యాసం విక్రమదేవవర్మ గురించి చదువుతుంటే మా నాన్నగారి పుస్తకం గుర్తుకొచ్చింది. విక్రమదేవవర్మగారు జయపురాధీశ్వరులు. ఆయన తల్లిదండ్రులు కృష్ణచంద్ర దేవ్, రేఖాదేవి. 1869 జూన్ 28న జన్మించిన విక్రమదేవ వర్మ గారు 1951 ఏప్రిల్ 14న పరమపదించారు. విద్యావ్యాప్తికోసం ఎంతో తోడ్పడ్డారు. స్త్రీ చదువుసంధ్యల పట్ల అంతగా ప్రజామోదం లేని కాలంలో విక్రమదేవవర్మ విశాఖపట్నంలో ఇంటింటికీ వెళ్ళి గృహస్థులను బతిమాలి ఒప్పించి వారి కుమార్తెలను పాఠశాలల్లో చేర్పించిన మహనీయుడు. వైద్యం,.జ్యోతిషం, న్యాయ తర్క వ్యాకరణాది శాస్త్రాలలో నిష్ణాతులైన విక్రమదేవవర్మ నాటక కళకూ సేవ చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ప్రో ఛాన్సలర్ గా ఉండేవారు.సంస్కృతంలో అనేక స్తోత్రాలు రాశారు. శ్రీనివాస కళ్యాణం, మానవతీ చరిత్ర, బాలగోపాల శతకం వంటి రచనలు చేసిన విక్రమదేవ వర్మకు చిత్రభాను విజయదశమి మహోత్సవ వేళ మా నాన్నగారు "విక్రమ ప్రకృతి" అనే పద్యకావ్యాన్ని అంకితం చేశారు. 1943 లో విశాఖపట్నంలో ఈ పద్యకృతి ముద్రితమైంది. ఈ పుస్తకానికి రాసుకున్న పీఠికలో తన చదువుసంధ్యల గురించి కొన్ని మాటలు చెప్పారు. వాటిలో రెండు పద్యాలు.... 1 శబ్దమంజరి మొదలుగ సంస్కృతంబు నాంధ్రమును బది వత్సరాలభ్యసించి ఆంధ్ర విశ్వవిద్యాలయ మందుదుదిని నేను భాషాప్రవీణ పట్టానుగొంటి 2 తిరుపతి వేంకటేశ్వర సుధీధ్వయి మద్వయి యందు వేంకటే/ శ్వరగురు సత్కృపాకలిత పావన కావ్య సుకల్ప వాధురం/ ధరుడను జిన్ననాడె కవితాసుత గాంచినవాడ దానికిన్/ వరుసొన గూర్చి యిప్పటికి వన్నెను గాంచితి సాటివారిలో/ విక్రమప్రకృతి నూట పదహారు పద్యాలతో కూడిన ప్రతి. వాటిలో ఒకటి... తలకుదలవంపు తలపుల కలతదింపు వలిపముల సొంపు సొంపారు కలిమినింపు ఇంపునింపారు భుజముల పెంపు కలిగి ధారణీ ధర వృక్ష సంతానమెసగు ఈ కృతి చివర్లో మా నాన్నగారు రాసిన గద్య.... ఇది శ్రీ కామేశ్వరీ వరప్రసాద సంభూత కామేశ్వరీ గర్భశక్తి ముక్తాఫల లక్ష్మీనృసింహ ద్వితీయ పుత్ర కామేశ్వరీ కృపాసార సముద్భూత సరసకవితా పవిత్ర ఆంధ్ర విశ్వకళా పరిషద్దత్త భాషాప్రవీణ బిరుదాంచిత సుకవిపండిత జనవిధేయ పద్మనాభస్వామి నామధేయ విరచితంబగు "విక్రమ ప్రకృతి" అను నేకాశ్వాసము.(గమనిక - పద్యాలలోగానీ చివరిచ్చిన గద్యలో కానీ అచ్చుతప్పులు ఉండొచ్చేమోనని ఓ సందేహం. వాటిని సరిచేద్దామంటే ఎక్కడ పెట్టానో పుస్తకం కనిపించడం లేదు. తప్పులు దొర్లితే అది నా తప్పిదమే) - యామిజాల జగదీశ్


కామెంట్‌లు